ఆ జిల్లాపై ఎంఐఎం స్పెషల్ ఫోకస్.. మూడు సెగ్మెంట్లపై కసరత్తు

by Sathputhe Rajesh |   ( Updated:2023-05-06 07:01:19.0  )
ఆ జిల్లాపై ఎంఐఎం స్పెషల్ ఫోకస్.. మూడు సెగ్మెంట్లపై కసరత్తు
X

దిశ ప్రతినిధి, నిర్మల్ : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ సాంప్రదాయంగా వస్తున్న హైదరాబాద్ స్థానాలే కాకుండా కొత్త చోట్ల పోటీ చేస్తుందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎన్ని నియోజకవర్గ స్థానాల్లో పోటీ చేస్తుందనే అంశంపై చర్చ మొదలైంది. మైనార్టీ ఓట్లు గణనీయంగా ఉన్న నియోజకవర్గాల్లో పోటీ చేస్తే ఫలితం రాబట్టవచ్చన్న ఆశ పార్టీ అధిష్టానంలో ఉందని తెలుస్తోంది. ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో కొత్త స్థానాల్లో పోటీ చేస్తామని పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ స్పష్టం చేసిన నేపథ్యంలో పలు నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు ఆసక్తిని చూపుతున్నారు.

పార్టీకి పలు నియోజకవర్గాల్లో బలం ఉన్నప్పటికీ రాజకీయ సమీకరణల నేపథ్యంలో కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీతో స్నేహం కొనసాగిస్తూ వచ్చిన ఎంఐఎం పార్టీ గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో అధికార భారత్ రాష్ట్ర సమితి పార్టీతో మిత్రపక్షంగా కొనసాగింది. ఎంఐఎం సహకారంతోనే కొన్ని కీలకమైన నియోజకవర్గాల్లో అతి కష్టం మీద అధికార పార్టీ గట్టెక్కింది. అయితే అధికార భారత రాష్ట్ర సమితితో పాటు కాంగ్రెస్, బీజేపీ మూడు పార్టీలు పోటీ చేస్తే ఓట్ల చీలికతో ఒకటి రెండు నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉందని మరికొన్ని చోట్ల పార్టీ బలం చాటుకునే అవకాశం దక్కుతుందని ఆ పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ బరిలో నిలిచేందుకు పలువురు అభ్యర్థులు ఆసక్తిని చూపుతున్నట్లు సమాచారం.

పశ్చిమ జిల్లాలో మూడు చోట్ల...

ఎంఐఎం పార్టీ పతంగి గుర్తుతో పోటీ చేసేందుకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో మూడు నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు ఆసక్తిని చూపుతున్నట్లు ప్రచారం జరుగుతుంది ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలోనే ముధోల్ నియోజకవర్గం లో ఎంఐఎం పార్టీకి బలమైన పట్టు ఉంది. ఆ నియోజకవర్గంలోని బైంసా మున్సిపాలిటీని రెండు దశాబ్దాలుగా ఎంఐఎం పార్టీ నిలబెట్టుకుంటూ వస్తోంది ఆ పార్టీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు జాబీర్ అహ్మద్ ఎంఐఎం పార్టీలో అత్యంత కీలక నేతగా ఎదిగారు. పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీతో ఆయన కుటుంబంతో జాబీర్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

పార్టీకి సంబంధించి ఉమ్మడి జిల్లాలోనే జాబీర్ ఎంత చెబితే అంత అన్నట్లుగా ఎంఐఎం పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అవకాశం వస్తే ముథోల్ నియోజకవర్గం నుంచి జాబీర్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. ఆ నియోజకవర్గంలో మైనారిటీల ఓట్లు గణనీయంగా ఉన్నాయి. ఓట్లు ఏకపక్షంగా ఎంఐఎం పార్టీకి పోలైతే అటు ఇటుగా అభ్యర్థి విజయం అంచుల దాకా వెళతారని ప్రచారం ఉంది. అయితే ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ బిజెపి బిఆర్ఎస్ పార్టీలు హోరాహోరీ పోటీ పడితే ఎంఐఎం విజయావకాశాలు మెరుగుపడతాయని పార్టీ‌తో పాటు రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

నిర్మల్ నియోజకవర్గంలోనూ పార్టీ బలంగానే ఉంది. నిర్మల్ పట్టణంతో పాటు ఆయా మండలాల్లో మైనారిటీ ఓటర్లు ఆశాజనకంగానే ఉన్నారు. గతంలో పదిమంది కౌన్సిలర్లు మున్సిపల్ వైస్ చైర్మన్ నిర్మల్ మున్సిపాలిటీలో వెలుగొందిన చరిత్ర ఉంది. ఈ నేపథ్యంలోనే పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అజీమ్ బిన్ యాహియ పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఆయనతో పాటు ఒక సీనియర్ జర్నలిస్టు పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని సమాచారం. ఆదిలాబాద్ నియోజకవర్గంలో అభ్యర్థుల గెలుపోటములకు అదిలాబాద్ పట్టణమే కీలకం. మూడు ప్రధాన పార్టీలు పోటీ పడితే తమకు విజయ అవకాశాలు ఉంటాయని ఎంఐ ఎం నమ్ముతోంది పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు నజీర్ అహ్మద్ తో పాటు వామపక్ష పార్టీల నుంచి వచ్చిన ఓ యువ న్యాయవాది పేరు కూడా ఈ నియోజకవర్గంలో వినిపిస్తోంది.

తూర్పున అంతంతే...

ఇక అదిలాబాద్ తూర్పు జిల్లా ప్రాంతంలో పార్టీ పోటీ చేయడం కష్టమేనని చెబుతున్నారు. అన్ని నియోజకవర్గాల్లోనూ మైనార్టీలు ఉన్నప్పటికీ గెలుపు అంచులు దాకా వెళ్లే స్థాయిలో ఓట్లు లేవు. అయితే గెలుపోటములు తారుమారు చేసే బలం మాత్రం ఆ పార్టీకి ఓటర్ల సంఖ్య ఉన్నట్లు చెబుతున్నారు. తూర్పు ప్రాంతంలో ఆసిఫాబాద్ మంచిర్యాల నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంది. అయితే పార్టీకి అభ్యర్థులు ఎవరన్నది చెప్పే పరిస్థితి లేదు. ఎన్నికల సమయం దాకా పొత్తుల వ్యవహారం తేలుతుందని పరిస్థితులను బట్టి మంచిర్యాలలో పోటీ చేస్తే ఎలా ఉంటుందన్న అంశంపై పార్టీ నేతలు ఆలోచిస్తున్నట్లు తెలిసింది.

Read More: ‘మళ్లీ చెప్తున్న.. ముమ్మాటికీ మీది పిరికిపందల ప్రభుత్వమే’

Advertisement

Next Story