- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విచారణలో విస్తుపోయే నిజాలు.. మేడిగడ్డ లొకేషన్ కేసీఆర్ నిర్ణయమే!
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రాణహిత ప్రాజెక్టులో తుమ్మడిహట్టి ప్రాంతాన్ని కేంద్రంగా డిసైడ్ చేసినా తెలంగాణ ఏర్పడిన తర్వాత అది మేడిగడ్డకు షిఫ్ట్ కావడం జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలోని జ్యుడీషియల్ కమిషన్ ఎంక్వయిరీలో కీలక అంశంగా మారింది. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం మేరకే మేడిగడ్డ ప్రత్యామ్నాయ లొకేషన్‌గా ఖరారైందని, సాధ్యాసాధ్యాలపై తమ కమిటీ అధ్యయనం చేసిందంటూ ఆ రిపోర్టులోనే ఐదుగురు రిటైర్డ్ ఇంజినీర్లు స్పష్టత ఇచ్చారు. ఆ కారణంగానే తుమ్మిడిహట్టితోపాటు ప్రత్యామ్నాయ మేడిగడ్డ లొకేషన్‌పైనా సుదీర్ఘంగా స్టడీ చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లు ఆ నలుగురు నిపుణులు కమిషన్‌కు శనివారం వెల్లడించినట్లు తెలిసింది.
మేడిగడ్డను ఫైవ్‌మెన్ కమిటీ ప్రతిపాదించలేదని, కేసీఆర్ సూచించినందువల్లనే ఆ లొకేషన్‌కు ఉన్న అనుకూల, ప్రతికూల అంశాలను స్టడీ చేసినట్లు నిపుణులు వివరించారు. నివేదికలో (పేజీ నం.4)నూ దీనిని స్పష్టంగా ప్రస్తావించినట్లు గుర్తుచేశారు. మేడిగడ్డ లొకేషన్‌ను సజెస్ట్ చేసింది కేసీఆర్ తప్ప తాము కాదని నొక్కిచెప్పారు. చివరకు మేడిగడ్డ లొకేషన్‌కు కొన్ని ప్రతికూలతలు ఉన్నాయని కూడా రిపోర్టులో వెల్లడించామన్నారు. నిర్మాణ వ్యయం పెరగడంతోపాటు బొగ్గు నిక్షేపాలు, ఓపెన్ కాస్ట్ మైన్స్, వన్యప్రాణి సంరక్షణా కేంద్రం ఆంక్షలు.. ఇలాంటివి ఉన్నట్లు సూచించామన్నారు.
పైగా కెనాళ్ల నిర్మాణం, గ్రావిటీ ద్వారా నీటి సరఫరాలో తలెత్తే సమస్యలు, హెచ్చు మోతాదులో అవసరమయ్యే విద్యుత్తు, మెయింటెనెన్స్ కాస్ట్ పెరగడం.. వీటిని కూడా నివేదికలో ప్రస్తావించినట్లు ఒప్పుకున్నారు. తుమ్మిడిహట్టి దగ్గర డిజైన్‌తో మహారాష్ట్రలో ముంపు తలెత్తి ఆ రాష్ట్ర ప్రభుత్వంతో అభ్యంతరాలు వ్యక్తమైతే ప్రత్యామ్నాయంగా వేమనపల్లి (గోదావరి నది మీద) దగ్గర నిర్మించుకోవచ్చని, రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు ఎలాంటి ఇబ్బందులు రావన్న అంశాన్నీ నొక్కిచెప్పారు. నివేదికలో దీన్ని పేర్కొన్న అంశాన్ని కూడా ఉదహరించారు.
ఫైవ్‌మెన్ కమిటీతో కమిషన్ భేటీ
ఉమ్మడి రాష్ట్రంలో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం తెలిపినా తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రత్యామ్నాయంగా కాళేశ్వరం తెరమీదకు రావడాన్ని కమిషన్ సీరియస్‌గా తీసుకున్నది. అందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం 2015లో నియమించిన ఫైవ్‌మెన్ (రిటైర్డ్ ఇంజనీర్ల) కమిటీ రిపోర్టును కమిషన్ అధ్యయనం చేసింది. ఆ నివేదికలో నిపుణులు చేసిన సూచనలు, సిఫారసులను ప్రభుత్వం ఎందుకు వద్దనుకున్నదో డాక్యుమెంట్ల రూపంలో వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నది.
అందులో భాగంగా ఆ కమిటీలోని నలుగురితో శనివారం బీఆర్‌కేఆర్ భవన్‌లో కమిషన్ సమావేశమైంది. అప్పటి ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలోని అంశాలపై ఇప్పటికీ అదే అభిప్రాయంతో ఉన్నట్లు వెల్లడించడంతో విడిగా వారి నుంచి అఫిడవిట్లు అవసరం లేదనే నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. మరో రిటైర్డ్ ఇంజనీర్ తనంతట తానుగా కమిషన్ ముందుకొచ్చి అభిప్రాయాలను అఫిడవిట్ రూపంలో ఇస్తానని వెల్లడించారు.
సబ్ కాంట్రాక్టర్లు ఎవరు?
ప్రాణహిత నుంచే ఎంక్వయిరీని మొదలుపెట్టాలని భావించిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలోని జ్యుడీషియల్ కమిషన్.. ఇప్పుడు మూడు బ్యారేజీలతోపాటు వివిధ లింకు ప్రాజెక్టు పనులను పూర్తిచేసిన కాంట్రాక్టు సంస్థలపై దృష్టి పెట్టింది. మెయిన్ కాంట్రాక్టు దక్కించుకున్న నిర్మాణ సంస్థలు సబ్ లీజ్ (సబ్ కాంట్రాక్టు)కు ఏయే కంపెనీలకు ఇచ్చాయనే వివరాల సేకరణపై దృష్టి పెట్టింది. దాదాపు 15 కంపెనీలు ఉన్నట్లు అనుమానిస్తున్న కమిషన్.. ఆర్థికపరమైన అంశాలపైనా ఎంక్వయిరీ జరిపే సమయంలో పూర్తి లెక్కల్లోకి వెళ్లాలని భావిస్తున్నది. ఒకవేళ మెయిన్ కాంట్రాక్టు కంపెనీలు స్వచ్ఛందంగా, రాతపూర్వకంగా ఆ వివరాలను వెల్లడించని పక్షంలో వాటి వార్షిక ఆర్థిక నివేదికలు, ఆడిట్ రిపోర్టులు, బ్యాంక్ స్టేట్‌మెంట్ల నుంచి సేకరించాలనే నిర్ణయానికి వచ్చింది. సబ్ కాంట్రాక్టు సంస్థల వివరాలు అందితే అవతకవకలు ఏ స్థాయిలో చోటుచేసుకున్నాయో క్లారిటీ వస్తుందనే అభిప్రాయంతో ఉన్నది.
ఒప్పందాలు, ఎవిడెన్స్ లేకుండానే..
ఎక్కడా ఒప్పందాలు లేకుండానే, ఎవిడెన్సుకు చిక్కకుండానే సబ్ కాంట్రాక్టు సంస్థలు కాళేశ్వరం నిర్మాణంలో భాగస్తులయ్యాయని కమిషన్ ప్రాథమిక అంచనాకు వచ్చింది. వాటికి పేమెంట్స్ ఏ ప్రాతిపదికన జరిగాయో ఆరా తీస్తున్నది. మూడు బ్యారేజీలను మూడు ప్రధాన కాంట్రాక్టు సంస్థలకు ఇచ్చినా వాటికి అనుబంధంగా ఉండే పనులను చిన్న కాంట్రాక్టు సంస్థలకు ఏ పద్ధతిన కేటాయించింది..? వాటి అంచనా వ్యయమెంత..? ఆ పేమెంట్స్ ఏ ప్రకారం జరిగాయి..? ఇలాంటి వివరాలన్నీ అందితే వాటి మధ్య ఉన్న లోపాయకారీ ఒప్పందాన్ని, గత ప్రభుత్వ పెద్దలతో ఉన్న సంబంధాన్ని తెలుసుకోవచ్చన్నది కమిషన్ అభిప్రాయంగా కనిపిస్తున్నది. ఈ వివరాలను ఇరిగేషన్ డిపార్టుమెంటు నుంచి తీసుకోవడం సంగతి ఎలా ఉన్నా కాంట్రాక్టు కంపెనీల నుంచి రాతపూర్వకంగా తెప్పించుకోవాలని అనుకుంటున్నది. టెక్నికల్ అంశాలపై ఎంక్వయిరీ పూర్తయిన తర్వాత వీటి లోతుల్లోకి వెళ్లాలని భావిస్తున్నది.
కిందిస్థాయి ఇంజినీర్ల వివరణపై త్వరలో నిర్ణయం
కాళేశ్వరం ప్రాజెక్టు ఎంక్వయిరీలో భాగంగా ఇప్పటికే ఇరిగేషన్ డిపార్టుమెంటు ఇంజినీర్-ఇన్-చీఫ్ సహా చీఫ్ ఇంజినీర్లు, సూపరింటెండింగ్ ఇంజినీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లతో సమావేశమై వారి నుంచి వివరాలను తీసుకున్న కమిషన్.. అఫిడవిట్ల రూపంలో ఈ నెల 27వ తేదీకల్లా అందించాలని ఆదేశించింది. కానీ.. కాళేశ్వరం నిర్మాణంతో సంబంధం ఉన్న అసిస్టెంట్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల నుంచి మాత్రం ఇప్పుడే వివరాలను సేకరించాలని కమిషన్ భావించడంలేదు. అవసరమైన టైమ్‌లో వారితో ఇంటరాక్ట్ కావాలనుకుంటున్నది. ప్రస్తుతానికి ఇరిగేషన్ డిపార్టుమెంటు ఇంజినీర్లు, అధికారులతో సంప్రదింపులు పూర్తయిన నేపథ్యంలో అఫిడవిట్లు పూర్తయ్యేవరకు సమావేశాలు ఉండకపోవచ్చని కమిషన్ వర్గాల సమాచారం. జస్టిస్ చంద్రఘోష్ కొన్ని ఆకస్మిక పర్యటనలు చేపట్టాలని భావిస్తున్నందున ఎక్కడ విజిట్ చేస్తారు... ఎలాంటి వివరాలను సేకరిస్తారు... ఇవి ఆసక్తికరంగా మారాయి.
విచారణకు పిలిచినప్పుడు రావాల్సిందే..
కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో జ్యుడిషియల్ కమిషన్‌గా నిర్దిష్టమైన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ వివరాలతో రాష్ట్ర ప్రభుత్వం నియమించినందున ఎంక్వయిరీలో భాగంగా నోటీసులు ఇచ్చినప్పుడు తప్పకుండా రావాల్సిందేనన్న అభిప్రాయంతో ఉన్న కమిషన్.. హాజరుకాకపోతే కమిషన్ తనకున్న అధికారాలను వినియోగించడానికి కూడా సిద్ధమవుతున్నది. ఎందుకు హాజరుకాదల్చుకోలేదో ఇచ్చే వివరణకు అనుగుణంగా సమన్లు జారీ చేయడం, ఆ తర్వాత వారెంట్ ఇష్యూ చేయడం లాంటి దిశగానూ ఆలోచిస్తున్నది. అలాంటి పరిస్థితి ఉత్పన్నమైతే తీసుకోవాల్సిన చర్యలపైనా కమిషన్ స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నది. అఫిడవిట్లన్నీ అందిన తర్వాత ఎంక్వయిరీ ప్రక్రియ, బహిరంగ విచారణ, మరికొద్దిమందికి నోటీసులు ఇవ్వడం.. ఇలాంటివాటిపై కమిషన్‌కు స్పష్టమైన ప్రణాళికే ఉన్నట్లు సమాచారం.