హానర్​ నిర్మాణ సంస్థ నిర్లక్ష్యానికి కార్మికులు బలి..

by Disha Web Desk 23 |
హానర్​ నిర్మాణ సంస్థ నిర్లక్ష్యానికి కార్మికులు బలి..
X

దిశ,కూకట్​పల్లి : కూకట్​పల్లి పోలీస్​ స్టేషన్​ పరిధిలోని హానర్​ అనే బడా నిర్మాణ సంస్థ నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు కార్మికులు తీవ్ర గాయాల పాలయ్యారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కనీస జాగ్రత్తలు పాటించకుండా బ్లాస్టింగ్​ చేయడంతో అక్కడే పనిచేస్తున్న ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న మీడియా అక్కడికి చేరుకుని కవరేజ్​ చేసేందుకు ప్రయత్నించగా నిర్మాణ సంస్థ ప్రతినిధులు మీడియాను లోపలికి అనుమతించలేదు. ఐడీఎపీఎల్​ రంగధాముని చెరువు రోడ్డులో 27 ఎకరాల స్థలంలో హానర్​ అనే బడా నిర్మాణ సంస్థ జి ప్లస్​ 25 బహుళ అంతస్తు నిర్మాణాలను చేపడుతుంది. వీటిని కే ఎల్​సి కన్​స్ట్రక్షన్​ కంపెనీ నిర్మాణ పనులు చేపడుతుండగా, పటేల్​ మైనింగ్ సంస్థ రాళ్లను బ్లాస్టింగ్​ పనులను చేపడుతుంది.

శుక్రవారం నిర్మాణ పనులలో భాగంగా పెద్ద పెద్ద బండరాళ్లను పగలగొట్టడానికి పటేల్​ మైనింగ్​ సంస్థ ప్రయత్నించింది. అదే సమయంలో అక్కడే పనిచేస్తున్న వెస్ట్​ బెంగాల్​కు చెందిన హరిలాల్​ మహాంతో(54), బిహార్​కు చెందిన పంకజ్​ ఆలమ్​(32)లు తీవ్ర గాయాల పాలయ్యారు. హుటాహుటిన నిర్మాణ సంస్థ ప్రతినిధులు వారిద్దరిని సమీపంలో అమోర్​ ఆసుపత్రికి తరలించారు. కాగా ఇద్దరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సంఘటన సమాచారం అందుకున్న కూకట్​పల్లి ఏసీపీ శ్రీనివాస్​ రావు, సీఐ కృష్ణ మోహన్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఏసీపీ శ్రీనివాస్​ రావు మాట్లాడుతూ సంఘటన వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగిందని, నిర్మాణ సంస్థకు ఉన్న అనుమతులు, మైనింగ్​, బ్లాస్టింగ్​ అనుమతులపై విచారణ చేపట్టి చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.


Next Story

Most Viewed