శంకర్ దాదా ఎంబీబీఎస్‌లు.. మేడ్చల్ జిల్లాలో ఫేక్ డాక్టర్ల దందా

by Aamani |
శంకర్ దాదా ఎంబీబీఎస్‌లు.. మేడ్చల్ జిల్లాలో ఫేక్ డాక్టర్ల దందా
X

దిశ,మేడ్చల్ బ్యూరో : నకిలీ వైద్యులు రెచ్చిపోతున్నారు. శంకర్ దాదా ఎంబీబీఎస్ ల అవతరమెత్తుతున్నారు.అర్హత లేకున్నా..డాక్టర్ గా చలామణి అవుతూ మెడికల్ దందాకు పాల్పడుతున్నారు. ఎలాంటి లైసెన్స్ లు లేకుండానే గల్లీల్లో బోర్డులు పెట్టుకుని హాస్పిటల్స్, క్లినిక్స్ ఓపెన్ చేసి అందిన కాడికి దండుకుంటున్నారు. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ నకిలీ వైద్యుల ఆగడాలు పెరిగిపోతున్నాయి. ఈ మధ్య కాలంలో పలు దవాఖానల్లో తరచూ వైద్యం వికటించి రోగులు మృత్యువాత పడుతున్న ఘటనల నేపథ్యంలో అప్రమత్తమైన తెలంగాణ మెడికల్ కౌన్సిల్ పెద్ద ఎత్తున దవాఖానలు, క్లినిక్ లపై దాడులు నిర్వహించి, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో 7 ఆసుపత్రులను సీజ్ చేయించింది. తనిఖీల్లో నకిలీ వైద్యుల గుట్టు రట్టు అయ్యింది.

నకిలీ వైద్యం దందా ఇలా..

నకిలీ వైద్యులు పేషంట్లకు ఇష్టానుసారంగా ట్రీట్మెంట్ చేస్తూ ప్రాణాలు తీసేస్తున్నారు.ఫిజియోథెరపిస్టులు మొదలు ఆర్ఎంపీ, పీఎంపీలతో పాటు సీనియర్ డాక్టర్ల వద్ద పనిచేసే కాంపౌండర్లు సైతం డాక్టర్లుగా చెప్పుకుంటున్నారు. వీరంతా నియమాలకు విరుద్ధంగా క్లినిక్ లలో పడకలు నిర్వహించడం, రోగులకు సెలోన్ లు పెట్టడం, యాంటీబయోటిక్ మందులు ఇవ్వడం, స్టెరాయిడ్ ఇంజిక్షన్స్ ఇవ్వడం, ఆయుర్వేదిక్ వైద్యులు నియమాలకు విరుద్ధంగా గర్బిణిలకు అలోపతి మందులు ఇవ్వడం, హై డోస్ యాంటీబయోటిక్ మందులు ఇవ్వడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు.కొందరు తమ క్లినిక్ లలోనే రోగ నిర్దారణ పరీక్షల పేరిట డబ్బులు గుంజుతూ.. తప్పుడు రిపోర్టులు ఇస్తున్నారు. వాటిని నమ్ముకుంటున్న జనాలు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఎమెర్జెన్సీ సమయాల్లో పేషెంట్స్ వస్తే ఎదో ట్రీట్ మెంట్ చేస్తున్నట్లు హడావిడి చేస్తూ.. రూ.వేలల్లో డబ్బులు వసూలు చేస్తున్నారు. తమ వల్ల కాదని , అధిక కమీషన్ ఇచ్చే మరో డాక్టర్ వద్దకు రెఫర్ చేస్తున్నారు.ఈ నకిలీ వైద్యులు ఏకంగా అసోసియేషన్లు ఏర్పాటు చేసుకుని ఆస్పత్రులు, డాక్టర్ల వద్ద పెద్ద మొత్తంలో కమీషన్ తీసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చేస్తున్న దాడుల్లో ఫేక్ డాక్టర్ల దందాను బట్టబయలు అవుతుంది.

నకిలీ ఫిజీషియన్ అవతారమెత్తి...

-బాచుపల్లిలో బుచ్చిబాబు అనే వ్యక్తి సహజ పోలీ క్లినిక్ ను ఏర్పాటు చేశాడు.నకిలీ జనరల్ ఫిజీషియన్ (ఎండీ ,డీజీహెచ్ )గా అవతారమెత్తి నిబంధనలకు విరుద్ధంగా ప్రత్యామ్నాయ(అల్టర్ నేటివ్ మెడిసిన్ ) మందులు ఇస్తూ వైద్యం అందిస్తున్నాడు. అయితే ఇతను ఏ రోగానికి ఏ మందులు రాయాలో..ఓ బుక్ లో చూస్తు రాస్తున్నట్లు వైద్య,ఆరోగ్య శాఖ తనిఖీల్లో బయటపడింది.అదేవిధంగా జగద్గిరి గుట్టలో శివనాగుల శ్రీనివాస్ అనే వ్యక్తి హాసిని ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ ను ఏర్పాటు చేసి, అక్రమంగా ఆసుపత్రిని నడుపుతున్నాడు. త ద్వారా అర్హత లేకుండా వైద్యం చేస్తూ.. రోగుల ప్రాణాలతో చెలగాటం అడుతున్నాడు.

వైద్యుడిగా ఫార్మాసిస్ట్ ....

మేడిపల్లి మండల పరిధిలోని బోడుప్పల్ లో వెల్ విషెర్స్ హాస్పిటల్ గౌతమి అనే వైద్యురాలి రిజిస్ట్రేషన్ అయింది. అయితే ఆమె రెండు సంవత్సరాల క్రితం ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లారు. దీంతో ఇక్కడ ఫార్మాసిస్ట్ వైద్యుడి అవతారమెత్తాడు.రోగులకు అన్ని రకాల వైద్యం అందిస్తూ.. అందినకాడికి దండుకుంటున్నారు. మెడికల్ కౌన్సిల్ కు ఫిర్యాదు రావడంతో జిల్లా వైద్యా,ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఉమాగౌరి నేతృత్వంలో ఇటివల వెల్ విషెర్స్ ఆసుపత్రి తో పాటు అర్హతకు మించి వైద్యం అందిస్తున్న మరో రెండు రక్షిత్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్, పల్స్ క్లినిక్ లను సీజ్ చేశారు.

ఫేక్ డాక్టర్లపై కేసులు పెడ్తం : డాక్టర్ ఉమా గౌరీ, జిల్లా వైద్య,ఆరోగ్య శాఖ అధికారి

ఫేక్ డాక్టర్లు మెడికల్ దందా పై ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. త్వరలోనే నకిలీ వైద్యాన్ని అరికట్టేందుకు ప్రత్యేక డ్రైవ్ ను చేపడుతాం. కొందరు ఆర్ఎంపీ,పీఎంపీలు ఇష్టారీతిన డాక్టర్ బోర్డులు పెట్టుకుని తెలియని వైద్యం చేస్తూ పేషంట్ల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.కాంపౌండర్లు కూడా ఫేక్ సర్టిఫికెట్లతో ఫేక్ డాక్టర్లు గా మారుతున్నారు. డయాగ్నోస్టిక్, ల్యాబ్ ల పేరుతో ఆఫర్లు ప్రకటించి తప్పుడు రిపోర్టులు చేతిలో పెడుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. అలాంటి దందా చేసే వారిపై ఎంక్వైరీ చేసి కఠిన చర్యలు తీసుకుంటాం.

Advertisement
Next Story

Most Viewed