Medchal: మంత్రి మల్లారెడ్డికి బిగ్ షాక్.. 11 మంది కీలక నేతల రాజీనామా

by srinivas |
Medchal: మంత్రి మల్లారెడ్డికి బిగ్ షాక్.. 11 మంది కీలక నేతల రాజీనామా
X

దిశ, శామీర్ పేట: మంత్రి మల్లారెడ్డికి భారీ షాక్ తగిలింది. 11 మంది మాజీ ప్రజా ప్రతినిధులు, ఉద్యమకారులు బీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. మంత్రి మల్లారెడ్డి ఏకపక్ష నిర్ణయాలతో తాము పార్టీని వీడుతున్నట్లు పేర్కొన్నారు. మేడ్చల్ జిల్లా శామీర్‌పేట ముడుచింతలపల్లి మండల మాజీ ప్రజా ప్రతినిధులు, ఉద్యమకారులు నేమురి విష్ణువర్ధన్ రెడ్డి, కంఠం కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రాజీనామాలు చేశారు. ఉమ్మడి శామీర్ పేట మాజీ మండలం అధ్యక్షుడు నేమురి విష్ణువర్ధన్ గౌడ్, అలియాబాద్ మాజీ సర్పంచ్, శామీర్‌పేట మండలం రైతు బంధు అధ్యక్షుడు కంఠం కృష్ణారెడ్డి, ముడుచింతలపల్లి మండలం రైతుబంధు అధ్యక్షురాలు, లక్ష్మపూర్ మాజీ సర్పచ్ శ్యామల, ఎక్స్ ఎంపీటీసీ మంజుల మాధవరెడ్డి, ఎక్స్ ఎంపీటీసీ లక్ష్మణ్ నాయక్, మాజీ వార్డు సభ్యులు సురేందర్, పీఏసీ డైరెక్టర్ ముగ్దం ప్రతాప్ రెడ్డి, కంఠం నరేందర్ రెడ్డి, విష్ణు, చంద్రకళ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు బీఆర్ఎస్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు శంబీపూర్ రాజుకు లేఖ రాశారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మంత్రి మల్లారెడ్డి పార్టీ కార్యకర్తలను ఉద్యమకారులను ఏమాత్రం పట్టించుకోవడంలేదని తెలిపారు. మంత్రి సొంత ఇంటి వాళ్లు ప్రతి మండలంలో రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. దాని వల్ల కార్యకర్తలకు విలువ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడిన తమను గుర్తించడంలేదని వాపోయారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, భూ కబ్జాదారులకు ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు. మంత్రి మల్లారెడ్డి ఒంటెద్దు పోకడకు మరికొంతమంది సర్పంచులు, మాజీ సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, మాజీ ఎంపీటీసీలు పెద్ద ఎత్తున రాజీనామాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

Advertisement

Next Story