అధికారులకు సవాల్ విసురుతున్న అక్రమార్కులు..

by Sumithra |
అధికారులకు సవాల్ విసురుతున్న అక్రమార్కులు..
X

దిశ, మల్కాజిగిరి : మల్కాజిగిరి సర్కిల్ అక్రమ నిర్మాణాలకు అడ్డాగా మారుతోంది. సెల్లార్ నిర్మాణాలతో పాటు బహుళ అంతస్తుల భవనాలు విచ్చల విడిగా కొనసాగుతున్నా అధికారులు మాత్రం ప్రేక్షక పాత్ర వహిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈస్ట్ ఆనంద్ బాగ్ చౌరస్తాలోని శ్రీనివాసుడి సాక్షిగా వెలుస్తున్న సెల్లార్ నిర్మాణామే ఇందుకు నిలువెత్తు నిదర్శనం. నగర శివారులో నిబంధనలకు విరుద్ధంగా వెలిసిన అక్రమ నిర్మాణం కుంగిపోవడంతో అధికారులు ఆ భవనాన్ని కూల్చివేసిన ఘటన చోటు చేసుకున్నా అధికారుల్లో చలనం రావటం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఈస్ట్ ఆనంద్‌బాగ్ చౌరస్తాలో చేపడుతున్న అక్రమ సెల్లార్ నిర్మాణం పై ఫిర్యాదులు రావటంలో పనులను నిలిపివేసిన అధికారులు తాజాగా యథేచ్చగా సెల్లార్ పనులు కొనసాగుతున్నా పట్టించుకోక పోవడం పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అక్రమ సెల్లార్ నిర్మాణాన్ని సక్రమంగా మల్చుకుని సదరు నిర్మాణదారుడు యథేచ్చగా పనులు చేపడుతున్నా అధికారులు మాత్రం ఇటువైపు కన్నెత్తి చూడటం లేదు. ప్రస్తుతం ఇక్కడ చేపడుతున్న సెల్లార్ నిర్మాణానికి ఎటువంటి అనుమతులు లేకుండా కేవలం 160 గజాల స్థలంలోనే నిర్మాణం చేపడుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ నిర్మాణాన్ని మొదట్లో అడ్డుకున్న అధికారులను ఆర్థిక, రాజకీయ పలుకుబడితో నోర్లు మూయించినట్లు చర్చ లేకపోలేదు. అధికారులతో కుమ్మక్కై ఆ స్థలంలో కేవలం పునాది మాత్రమే తీస్తున్నాను ఒకవేళ సెల్లార్ నిర్మాణం చేపడితే దాన్ని కూల్చే అర్హత అధికారులకు కల్పిస్తున్నానంటూ చెప్పుకొచ్చి ప్రస్తుతం సెల్లార్ నిర్మాణం చేపడుతున్నా ఏ ఒక్క అధికారి అటువైపు కన్నెత్తి చూడడానికి భయపడే పరిస్థితి నెలకొంది. చిన్నపాటి నిర్మాణాలనే అడ్డుకునే అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వెలుస్తున్నా నిర్మాణాల పట్ల ఎందుకు స్పందించడం లేదు ? నిబంధనలు కొందరికి మాత్రమేనా, అందరికి ఒకేలా వర్తించవా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ తతంగంలో అధికారులకు భారీ స్థాయిలో ముడుపులు అందాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు..

మల్కాజిగిరి సర్కిల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. మల్కాజిగిరి, మౌలాలి, ఈస్టు ఆనంద్ బాగ్, వినాయక్ నగర్, నేరేడ్మేట్, గౌతంనగర్ డివిజన్ల పరిధిలోని పలు కాలనీల్లో అక్రమ సెల్లార్లు, బహుళ అంతస్తులు భవనాల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఇక్కడ జరిగే ప్రతి అక్రమ నిర్మాణం వెనుక మున్సిపల్ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు అక్రమ నిర్మాణదారులకు కొమ్ముకాస్తున్నారనే విమర్శలున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న నిర్మాణాలు అధికారుల కనుసన్నల్లోనే జరగడంతో అక్రమ నిర్మాణాలు కోకొల్లలుగా వెలుస్తున్నాయని ఆయా డివిజన్ల ప్రజలు అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాప్రాల్ బాపూజీనగర్ సాయిబాబా ఆలయం వెనుక బహుళ అంతస్తుల భవనం, జూపల్లి హోమ్స్ సమీపంలో వెలుస్తున్న నిర్మాణాలకు అధికారులు నోటీసులు జారీ చేసినా, యథేచ్చగా నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. కమర్షియల్ షెటర్లు, అదనపు అంతస్తుల నిర్మాణాలు జోరుగా సాగుతున్నా అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవని స్థానికులు ఆరోపిస్తున్నారు. రెసిడెన్షియల్ జోన్‌ను కమర్షియల్ గా మార్చడంతో శైలి గార్డెన్ చౌరస్తాలో ట్రాఫిక్ స్తంభించి ప్రయాణికులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు.

నోటీసులు సరే చర్యలేవి ?

మల్కాజిగిరి సర్కిల్ పరిధిలో చేపడుతున్న అక్రమ నిర్మాణాలకు అధికారులు నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకుంటున్నారు. సదరు నిర్మాణదారులతో సిబ్బంది చేతులు కలిపి ఉచిత సలహాలిచ్చి ప్రోత్సహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అక్రమ నిర్మాణాలంటూ పనులను ఆపడం.. చేతులు కలపడంతో ఆదే అక్రమ నిర్మాణం సక్రమంగా పూర్తి కావటం సర్కిల్ పరిధిలో షరా మాములుగానే కొనసాగుతోంది. ఇదంతా మున్సిపల్ సిబ్బంది కనుసన్నల్లోనే జరుగుతున్నా అధికారులు మాత్రం ప్రేక్షక పాత్ర వహించడం పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ నిర్మాణాల పై తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ణప్తి చేస్తున్నారు.

Advertisement

Next Story