దొంగ సర్వేలతో.. బీసీ జనాభా తగ్గించారు : హరీష్ రావు

by Kalyani |
దొంగ సర్వేలతో.. బీసీ జనాభా తగ్గించారు : హరీష్ రావు
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి: దొంగ సర్వే చేసి...బీసీ జనాభా తగ్గించారని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. సిద్దిపేట పట్టణంలోని శ్రీ కృష్ణ యాదవ ఫంక్షన్ హాల్ సభ్యులకు గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ... కేసీఆర్ తెలంగాణ ఆత్మ గౌరవం నిలబెడితే సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ గౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి దోచుకొని ఢిల్లీకి పంపుతున్నాడని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి 11 సార్లు ఢిల్లీ వెళ్లిన రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో రాష్ట్రానికి గుండు సున్నా ఇచ్చారని అన్నారు. బీసీలకు ఎన్నికల హామీ మేరకు కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలన్నారు.

రాష్ట్ర మంత్రివర్గంలో బీసీలకు 42 శాతం పదవులు ఇచ్చి, బీసీలకు ఉప ముఖ్య మంత్రి పదవి ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క కులానికి న్యాయం చేయలేదన్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలన్నారు. భూమి సమస్యల పరిష్కారానికి మంత్రులు 30 శాతం కమిషన్ కావాలంటున్నారని ఆరోపించారు. భూ మాత.. భూ మేత గా తయారైందని ఫైర్ అయ్యారు. కమిషన్ల కోసం మంత్రులు, ఎమ్మెల్యే మధ్య గొడవలు జరుగుతున్నాయని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ సీఎం కేసీఆర్ యాదవుల కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు అమలు చేసి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో యాదవులకు ఒక్క మంత్రి పదవి ఇవ్వలేదన్నారు. గొర్రె పిల్లలు ఇవ్వకుండా డీడీలు సైతం వాపస్ ఇచ్చారని హరీష్ రావు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, యాదవ సంఘం ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed