అందుబాటులో ఉంటా..

by Disha Web Desk 15 |
అందుబాటులో ఉంటా..
X

దిశ, వర్గల్ : అందరికీ అందుబాటులో ఉండి మెదక్ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు. ములుగు, వర్గల్ కార్నర్ మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ.. దివంగత ఇందిరాగాంధీ పోటీ చేసిన గడ్డ నుంచి తనకు ఎంపీగా పోటీ చేసే అవకాశం కాంగ్రెస్ పార్టీ కల్పించిందని తెలిపారు. ఇందిరమ్మ ఈ ప్రాంతానికి అనేక పరిశ్రమలు తెచ్చి అభివృద్ధికి బాటలు వేశారని గుర్తు చేశారు. గతంలో అధికారంలో ఉన్న పాలకులు పేదలను పట్టించుకోలేదని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో ఎంతమందికి డబుల్ బెడ్ రూములు కట్టించిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలోనే పేదలకు భూములు, ఇండ్లు ఇచ్చిందని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ పాలనలో ఆరు గ్యారెంటీలు అమలవుతున్నాయని, మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల కరెంటుతో పేదలకు మేలు చేసింది కాంగ్రెస్ పార్టీయేనని స్పష్టం చేశారు. తనను ఎంపీగా గెలిపిస్తే ఎంపీ నిధులు, రాష్ట్ర ప్రభుత్వం నిధులతో ఈ ప్రాంతాన్ని మరింతగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఆలోచించి ఓటేయాలని సూచించారు. బహిలంపూర్ గ్రామంలో పెండింగ్ సమస్యలు పరిష్కరిస్తానని చెప్పారు. గ్రామానికి కలెక్టర్ ను తీసుకొచ్చి సమస్యలన్నీ పరిష్కరించేందుకు బాధ్యత తీసుకుంటానని చెప్పారు. అలాగే వర్గల్ మండల కేంద్రంలో పెద్దమ్మ ఆలయం వద్ద ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ముదిరాజులు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. సంఘం అధ్యక్షులు నానపురం నర్సింలు, సొప్పరి బాబు, నాగిరెడ్డి పల్లి అశోక్, ఉప సర్పంచ్ పసుల రమేష్, మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షులు శ్రీరామ్ నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

Next Story