నిరుద్యోగులతో చెలగాటం ఆడుతున్న రాష్ట్ర ప్రభుత్వం : ఎమ్మెల్యే రఘునందన్ రావు

by Shiva |
నిరుద్యోగులతో చెలగాటం ఆడుతున్న రాష్ట్ర ప్రభుత్వం : ఎమ్మెల్యే రఘునందన్ రావు
X

దిశ, దుబ్బాక : రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి తొమ్మిదేళ్లు గడుస్తున్నా.. కొత్త వారికి ఉద్యోగాలకు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తుందని, నిరుద్యోగులకు అండగా బీజేపీ పార్టీ అండగా ఉంటుందని దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు తెలిపారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నీళ్లు, నిధులు, నియామాకాల కోసం ఏర్పడిన రాష్ట్రంలో నిరుద్యోగుల ఆశలు, ఆకాంక్షలు నెరవేరడం లేదన్నారు.

ఆత్మనూన్యతా భావాలకు లోనవుతున్న నిరుద్యోగులకు అండదండగా నిలిచేందుకే ఈ నెల 11న ఉమ్మడి మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో నిరుద్యోగ మార్చ్ కార్యక్రమాన్ని బీజేపీ నిర్వహిస్తోందని ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలిపారు. నిధులు, నీళ్లు, నియామాకాలు ఎటు పోయాయో సీఎం కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కాంట్రాక్ట్ టీచర్లు, డాక్టర్లు, నర్సులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉండరని, అందరినీ క్రమబద్ధీకరిస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ నేటికి మాటను నిలబెట్టుకోలేదన్నారు.

కాంట్రాక్ట్ సీఎం, కాంట్రాక్ట్ మంత్రులను నియమించుకుంటే తప్పేముందని ఎద్దేవా చేశారు. టీ.ఎస్.పీ.ఎస్.సీ పేపర్ లీకేజీతో నిరుద్యోగుల్లో నిరాశ నెలకొందన్నారు. రాష్ట్రంలో నియామకాలు లేన లేక నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లా కలెక్టరేట్ల వద్ద టెంట్లు, నిరసనలు, ధర్నాలే బీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుకు అద్దంపడుతోందని అన్నారు. నియోజకవర్గ కేంద్రమైన దుబ్బాకలో టెట్ అభ్యర్థులు, పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ కోచింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన శిక్షణతో పాటు ఉచిత పుస్తకాలు, పౌష్టికాహారాన్ని కల్పించామన్నారు.

ఈ నెల 11న సంగారెడ్డిలో నిర్వహించే నిరుద్యోగ మార్కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ హాజరవుతున్నట్లు తెలిపారు. నిరుద్యోగ మార్కు దుబ్బాక నియోజకవర్గం నుంచి 5 వేల మంది నిరుద్యోగులను తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఉమ్మడి జిల్లా నలుమూల నుంచి అధిక సంఖ్యలో హాజరై నిరుద్యోగ మార్చ ను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. గతంలో టీ.ఎస్.పీ.ఎస్.సీ పేపర్ లీక్ విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు. తోమ్మిదేళ్ల నుంచి నిరుద్యోగులు ఉద్యోగాలు వస్తాయనే ఆశతో ఉన్నారని తెలిపారు.

ప్రస్తుతం ప్రభుత్వం వారి నోట్లో మట్టి కొడుతూ నిరాశకు గురి చేసిందన్నారు. 33 జిల్లాల్లో కాంట్రాక్టు ఉద్యోగులుగా పని చేస్తున్న ఉద్యోగులను పర్మినెంట్ చేయకపోవడం దారుణమని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ నిరుద్యోగులకు అండగా ఉండి.. వారి తరపున నిరంతరం పోరాటం చేస్తుందని అన్నారు. ఉమ్మడి జిల్లాలోని 253 బూతుల నుంచి నిరుద్యోగులు పాల్గొని నిరుద్యోగ మార్చ్ ను జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బాలేష్ గౌడ్, సుభాష్ రెడ్డి, చింత సంతోష్ గుప్తా, మంద అనిల్, ఎస్.ఎన్ చారి, విభీషణ్ రెడ్డి, ఆకుల నరేష్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story