అంగన్ వాడీలకు చిన్నసైజు గుడ్లు సరఫరా...

by Anjali |
అంగన్ వాడీలకు చిన్నసైజు గుడ్లు సరఫరా...
X

దిశ, నారాయణఖేడ్: అంగన్వాడీలకు కోడిగుడ్ల సరఫరా కాంట్రాక్ట్ విషయంలో అక్రమాలు కొనసాగుతున్నాయి. చిన్నసైజ్ ఉన్న గుడ్లను సరఫరా చేస్తూ అక్రమాలకు పాల్పడుతూ సొమ్ముచేసుకుంటున్నారు. ఈ విషయంలో ఏండ్లుగా ఆరోపణలు వస్తున్నప్పటికీ తిరిగి వారికే కాంట్రాక్టులు అప్పగించడంపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. సంగారెడ్డి జిల్లాలో 1504 అంగన్ వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటి ద్వారా ఆరోగ్యలక్ష్మి పథకం కింద గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికారం అందిస్తుంటారు. ఐసీడీఎస్ ద్వారా సరఫరా చేసే కోడిగుడ్లు చిన్నసైజ్ గా ఉంటున్నాయి.

కాంట్రాక్టర్లు ఏమాత్రం నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదు. మూడేళ్లలోపు చిన్నారులకు నెలకు 16 గుడ్లు, గర్భిణులు, బాలింతలు, మూడేళ్లకు పైబడిన చిన్నారులకు రోజుకు ఒక గుడ్డు ఇస్తున్నారు. అయితే శిశు సంక్షేమ శాఖ నిర్ణయించిన ప్రమాణాలకు ప్రకారం గుడ్డు కనీసం 50 గ్రాముల బరువుండాలి. ఇదంతా అధికారుల లెక్కలో మాత్రమే కనిపిస్తుంది. నారాయణఖేడ్ పట్టణంలోని ఒకటవ అంగన్ వాడీ కేంద్రంలో పరిశీలించగా ఒక్క గుడ్డు కేవలం 20 గ్రాములే ఉంది. 30 గుడ్లుకు 1500 గ్రాములు ఉండాల్సి ఉండగా 1200 గ్రాముల మాత్రమే ఉన్నాయి. అన్ని సెంటర్లకు ఇలాంటి గుడ్లే సరఫరా అవుతున్నాయని, ఎన్ని ఆరోపణలు ఉన్నా వారికే తిరిగి కాంట్రాక్ట్ అప్పగించడంపై తీవ్ర విమర్శలు వెలువెత్తుతుండగా ఈ అంశం అధికార యంత్రాంగంలో చర్చానీయాంశమవుతున్నది.



నియోజకవర్గంలో మొత్తం 404 అంగన్ వాడీలకు మొత్తం 1,05,360 గుడ్లు పంపిణీ పక్క రాష్ట్రం నుంచి కాంట్రాక్టర్ సరఫరా చేస్తున్నారు. ఖేడ్ డివిజన్ లోని నారాయణఖేడ్, కల్హేరు, కంగ్టి, మనూరు, నాగలి గిద్ద, సిర్గాపూర్, నిజాంపేట మండలాల్లో అంగన్ వాడీ కేంద్రాలు 282తో పాటు మినీ అంగన్ వాడీ కేంద్రాలు 122 ఉన్నాయి. అంగన్ వాడీ కేంద్రాల్లో ఆరోగ్య లక్ష్మి పథకం 6 నెలల నుంచి 3 సంవత్సరాల 9737 పిల్లలు ఉన్నారు. 3 నుంచి 6 సంవత్సరాల 77776 పిల్లలు ఉన్నారు. గర్భిణులు 2147 మంది ఉండగా బాలింతలు 2305 ఉన్నారు. గర్భిణులు, బాలింతలకు ఒక్కపూట సంపూర్ణ భోజనం అందిస్తున్నారు.

రోజుకు ఉడకబెట్టిన గుడ్డు చొప్పున నెలకు 30గుడ్లు ఇస్తున్నారు. అంగన్ వాడీ కేంద్రం పనిదినాల్లో ప్రతి గర్భిణికి 150 గ్రాముల బియ్యం, 30 గ్రాముల కందిపప్పు, 16 గ్రాముల నూనె ఇస్తున్నారు. ఏడు నెలల నుంచి 3ఏళ్ల లోపు పిల్లలకు రోజుకు ఒక గుడ్డు చొప్పున 16 గుడ్లు, బాలామృతం కేటాయిస్తున్నారు. మూడున్నరేళ్ల నుంచి 6ఏళ్ల పిల్లలకు రోజుకు ఉడకబెట్టిన ఒక గుడ్డు చొప్పున 30 గుడ్లు ఇస్తున్నారు. అంగన్ వాడీ కేంద్రం పని దినాల్లో75 గ్రాముల బియ్యం, 15 గ్రాముల కందిపప్పు, 5 గ్రాముల నూనె అందిస్తున్నారు.

నాసిరకం చిన్న గుడ్లు సరఫరా

అంగన్ వాడీ కేంద్రాలకు కోడిగుడ్లు సరఫరా చేసే ఏజెన్సీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. టెండర్ లో చూపిన విధంగా కాకుండా నాసిరకంగా గుడ్లు సరఫరా చేయడంతో టీచర్లకు తలనొప్పిగా మారింది. కేంద్రాలకు పంపిణీ చేసే గుడ్లు చిన్నగా, నాసిరకంగా ఉంటున్నాయి. సంబంధిత అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో ఏజెన్సీలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నాయి. కోడిగుడ్లు నాణ్యత లోపంపై ఎప్పటికప్పుడు ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నామని టీచర్లు వాపోతున్నారు. గతంలో జిల్లా కేంద్రంలో జెడ్పీ, మండల సర్వసభ్య సమావేశంలో సైతం ప్రజా ప్రతినిధులు కోడిగుడ్ల నాణ్యతను ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువస్తున్నారు. అయినా గుడ్లు సరఫరా చేసే ఏజెన్సీ తీరులో మార్పు రావడం లేదు.

ఆరోపణలోచ్చినా చర్యలు శూన్యం...

అంగన్ వాడీ కేంద్రాలకు 15 ఏళ్ల నుంచి ఖేడ్ డివిజన్ కు గుడ్లను సరఫరా చేస్తున్నారు. ఇక్కడి కాంట్రాక్టర్ నిబంధనలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. చిన్న సైజు గుడ్లను సరఫరా చేస్తున్నారు. దీంతో నిత్యం ఎక్కడ ఓ చోట ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. దీంతో పాటు నారాయణఖేడ్ నియోజకవర్గంలో కుళ్లిన గుడ్లు సరఫరా చేస్తున్నారని పలువురు కలెక్టర్ కు కూడా ఫిర్యాదు చేశారు. అయినా వీరిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారడంతో చూసిచూడనట్టుగా వదిలేస్తారని ఆరోపణలు వస్తున్నాయి. టెండర్లు వేసే సమయంలో రూల్స్ పాటిస్తామని ఒప్పందం చేసుకుని, తరువాత తమకు ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారని అంగన్ వాడీ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుడ్లు సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్ ను బ్లాక్ లిస్టులో పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

పక్క జిల్లాల నుంచి చిన్న గుడ్లు...

కాంట్రాక్టర్లు పక్క జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి చిన్న గుడ్లను తీసుకొస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కొవిడ్ కారణంగా కోడి గుడ్లకు బాగా డిమాండ్ పెరిగింది. సాధారణంగా ఉండే వాటికి కన్నా చిన్నసైజ్ గుడ్లకు ధర తక్కువగా ఉంటుంది. గరిష్టం 45 గ్రాముల వరకు ఉన్న వాటినే ఏరికోరి తెస్తున్నారు. కోళ్ల ఫారంలో మొదటిసారి గుడ్లు పెట్టినప్పుడు చిన్న పరిమాణంలోని వస్తుంటాయి. దీంతో తక్కువ ధరకు కొనుగోలు చేసి జిల్లాలో ఆయా కేంద్రాల్లో సరఫరా చేస్తున్నట్లు సమాచారం. వీటిని ఆయా అంగన్వాడీ కేంద్రాలకు చేరవేయడంలోనూ కొందరు వ్యూహాత్మకంగా వివరిస్తున్నారు. కొన్ని చోట్ల సంబంధిత పర్యవేక్షణ అధికారుల సహకారం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలకు దర్జాగా చిన్నవే చేరవేస్తున్నారు. కొందరు ఫిర్యాదు చేస్తున్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో పరిస్థితుల్లో మార్పు రావడం లేదు. ఇప్పటికైనా చిన్న గుడ్ల సరఫరాకు అడ్డుకట్ట వేయాలని అంగన్వాడీ పిల్లల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

చిన్న గుడ్లను తిరస్కరించాలి

-పద్మావతి, జిల్లా సంక్షేమ అధికారిణి..

అంగన్ వాడీ కేంద్రాల్లో నాణ్యత పరిశీలించాకే కోడిగుడ్లు దింపుకొని బయోమెట్రిక్ వేయాలి. ఒక గుడ్డు 50 గ్రాముల బరువు ఉండాలి. అంతకంటే తక్కువ బరువు ఉంటే తిరస్కరించాలి. దీనిపై ఇప్పటికే సరఫరా చేసే ఏజెన్సీలకు చెప్పాం. ఖేడ్ నియోజకవర్గంలోని అంగన్ వాడీ సెంటర్లలలో గుడ్లను పరిశీలించాలని, చిన్నవి ఉంటే వెంటనే రిటర్న్ పంపాలని పీడీపీవోకు ఆదేశాలిస్తాం. అవసరమైతే కాంట్రాక్టర్ ను బ్లాక్ లిస్టులో పెడతాం. వచ్చే నెల నుంచి గుడ్ల కాంట్రాక్టు రద్దు చేస్తాం

Advertisement

Next Story