వ్యాపారుల మధ్య వివాదం ఎందుకు..?

by S Gopi |
వ్యాపారుల మధ్య వివాదం ఎందుకు..?
X

దిశ, మెదక్​ ప్రతినిధి: జిల్లాలో 157 రైస్ మిల్లులు కాగా ఇందులో 33 పారా బాయిల్డ్ ఉన్నాయి. ప్రతి మిల్లులో నిర్వహణ పేరిట కొంత డబ్బు జమ చేస్తారు. వాటిని జిల్లా కమిటీ అధ్వర్యంలో ఖర్చు చేస్తారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న మిల్లర్ యజమాన్యానికి ఏవైనా సమస్య వచ్చినా.. రైల్ మిల్లర్స్ అసోసియేషన్ చెపట్టే ప్రతి కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా మిల్లర్ యాజమాన్యం ద్వారా పోగు చేసిన డబ్బులు ఖర్చు చేస్తారు. ఇది కొన్నేళ్లుగా అసోసియేషన్ ఆధ్వర్యంలో సాగే తంతు.. కానీ ఇటీవల కాలంలో వ్యాపారంలో ఉన్న విభేదాలు అసోసియేషన్ వరకు వచ్చాయి. దాదాపు రూ.3 కోట్ల వరకు డబ్బులు అసోసియేషన్ అధ్వర్యంలో కొంత మంది సొంతానికి వాడుకుంటున్నట్లు శ్రీధర్ గుప్త ఆరోపిస్తున్నారు. లెక్కలు చూపకుండా వాటిని జిల్లా రైస్ మిల్లర్స్ జిల్లా అధ్యక్షుడు, కమిటీ వాడుకున్నారన్న విమర్శలు చేశారు. పదేళ్లుగా రైస్ మిల్లర్లలకు డబ్బుల లెక్కలు చూపకుండా కాలయాపన చేయడం, వాటి లెక్కలు అడిగినవారిపై అధికారులతో కేసులు చేయిస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నర్సాపూర్ కు చెందిన శ్రీధర్ గుప్తా అసోసియేషన్ సంబంధించి లెక్కలు అడగడంతో గతంలో రెండు పర్యాయాలు శ్రీధర్ గుప్తకు చెందిన రైస్ మిల్లులపై విజులెన్స్ అధికారులు దాడులు చేసి కేసులు చేయడం వెనకాల అసోసియేషన్ లో కీలక నేతల ప్రమేయం ఉందన్న విమర్శలు గతంలోనే వినిపించాయి.

జిల్లా వ్యవసాయ ఆధారిత ప్రాంతం కావడమే కాకుండా అత్యధికంగా వరి సాగు చేసే జిల్లాల్లో మెదక్ మొదటి స్థానాల్లో ఉంటుంది. వ్యాపారం కూడా పెద్ద ఎత్తున సాగడం రైస్ మిల్లులకు కలిసొచ్చే అంశం.. ప్రతి మిల్లు నుంచి యాజమాన్యం ప్రతి ఏటా ఎఫ్​సీఐకి సీఎంఆర్​పంపుతారు. దీంతో కొంతకాలంగా మిల్లులు లాభాల బాట పట్టాయి. అలాగే ఖర్చు కూడా పెరగడం పలు అవసరాల కోసం నేతలు రైస్ మిల్లర్ అసోసియేషన్ వైపు చూడడంతో అన్ని మిల్లుల యాజమాన్యం వద్ద ప్రతి యేటా డబ్బులు పోగు చేస్తారు. జిల్లాలో వందల సంఖ్యలో మిల్లులు ఉండడం ప్రతి మిల్లు వద్ద పోగు చేసిన డబ్బులు అసోసియేషన్ వద్ద ఉంచి వాటిని ఖర్చులకు వినియోగిస్తారు. లెక్కలు పూర్తిగా అసోసియేషన్ వద్ద ఉంటాయి. దీనికి ఖర్చు చేసిన విషయం ప్రతి పైస లెక్క చెప్పాల్సిన బాధ్యత అసోసియేషన్ పై ఉంటుంది. కానీ పదేళ్లుగా లెక్కలు చెప్పడం లేదన్నది శ్రీధర్ గుప్త ఆరోపించడంతో రైస్ మిల్లర్ వ్యవహారం రచ్చకు ఎక్కింది. ప్రతి యేటా రూ.70 లక్షల నుంచి రూ.90 లక్షల వరకు మిల్లర్ల నుంచి సేకరిస్తున్నట్లు చెబుతున్నారు. మరి అంత పెద్ద మొత్తంలో వచ్చే డబ్బులు అసోసియేషన్ పక్కాగా ఖర్చు చేస్తే వివాదం వెలుగులోకి వచ్చేది కాదు.. కానీ దాదాపు రూ.3 కోట్లకు సంబంధించిన లెక్కలు లేవన్నది ఆరోపణ. మరి అంత డబ్బులు ఎవరి వద్ద ఉన్నాయి.. ఏమైంది అన్నది మిగతా వారిలో ఉన్న ప్రశ్నలు.. ప్రస్తుతం జిల్లాలో జరుగుతున్న వివాదంలో అసోసియేషన్ కు సంబంధించిన వారి మధ్యనే జరుగుతుంది. శ్రీధర్ గుప్త బీహారీ కూలీలతో చంద్ర పాల్ ను చంపేస్తా అంటూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టును చంద్ర పాల్ కు పర్వాడ్ చేసింది అసోసియేషన్ క్యాషియర్. దీంతో ఈ వ్యవహారం అంతా డబ్బుల చుట్టే ఉందన్న వాదన కొందరు చేస్తున్నారు. అసోసియేషన్ పరిధిలో డబ్బుల వ్యవహారం అయితే పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. కానీ మరేదో ఉండడంతో బహిరంగ విమర్శలకు వచ్చినట్లు తెలుస్తోంది.

సీఎంఆర్ వివాదం మరో కారణమా..?

రైస్ మిల్లర్ల వ్యవహారం ఒకరిని ఒకరు దూషించుకునే వరకు రావడం వెనుక డబ్బుల వ్యవహారం కాకుండా మరేదో ఉందన్న చర్చకూడా సాగుతుంది. ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం ను రైస్ మిల్లర్లు బియ్యంగా మార్పిడి చేసి ఇవ్వాల్సి ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా వచ్చిన ధాన్యంను ఆయా పరిధిలో ఉన్న మిల్లులకు సీఎంఆర్ చేయడానికి అప్పగిస్తారు. దీనికి గాను క్వింటాల్ చొప్పున ప్రభుత్వం కమీషన్ ఇస్తుంది. దీని వల్ల మిల్లులకు కమీషన్ కలిసి వస్తుంది. ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేసి ఇవ్వడం వల్ల ఎలాంటి పెట్టుబడి లేకుండా సీఎంఆర్ చేసినందుకు కమీషన్ వస్తుంది. ప్రతి మిల్లుకు కొంత టార్గెట్ ఇచ్చి గడువు లోగా ఎఫ్ సీఐకి తరలించాలి.. కానీ ఇందులో కొంతమంది తమకు ఉన్న పలుకు బడిని ఉపయోగించి ఎక్కువ టార్గెట్ పొందడం వల్ల తమకు తక్కువ సీఎంఆర్ టార్గెట్ తక్కువ ఇస్తున్నారన్నా వివాదం నెలకొంది. ఇందుకు కొందరు జిల్లా అధికారుల వద్ద ఫిర్యాదు చేసి సీఎంఆర్ టార్గెట్ తగ్గించడం వంటి కారణాల వల్లనే ఇరు వర్గాల మధ్య విభేదాలకు కారణమైంది.

దీంతో విజిలెన్స్ కేసుల వరకు వెళ్ళడం దీని వెనకాల అసోసియేషన్ లో కీలకమైన వ్యక్తి హస్తం ఉందన్న ఆరోపణలు శ్రీధర్ గుప్త చేస్తున్నారు. కానీ చాలా వరకు వచ్చిన ధాన్యం సీఎంఆర్ చేస్తే వచ్చే లాభాల కంటే పీడీఎఫ్ రైస్ దందా కారణంగా సీఎంఆర్​ టార్గెట్ పెంచాలన్న ఒత్తిడి పెరుగుతుందన్న విమర్శలు కూడా ఉన్నాయి. చాలా వరకు రైస్ మిల్లుల్లో పెద్ద ఎత్తున పీడీఎఫ్ బియ్యం దర్జాగా రీ సైల్క్లింగ్ జరుగుతుందన్న ప్రచారం ఉంది. గతంలో పీడీఎఫ్ అంతగా లేనప్పుడు ఎఫ్ సీఐకి బియ్యం పంపాలంటే సాధ్యం అయ్యేది కాదన్న మిల్లర్లు ఇప్పుడు పోటీ పడి సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్) ఇస్తున్నారంటే దీని వెనక పీడీఎఫ్​బియ్యం విక్రయాలు జోరుగా సాగడమే కారణం అనే ఆరోపణలు ఉన్నాయి. ఇందులో జిల్లా అధికారుల పాత్ర కూడా ఉండడం, ఆరోపణలు చేసిన వ్యక్తికి సంబంధించిన మిల్లులో కేసులు నమోదు కావడం వెనక ఇందులో పెద్ద ఎత్తున పెద్దల హస్తం ఉండడం.. రాజకీయ నేతల ప్రమేయం ఉండడమే కారణం అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంటే కాకుండా సోషల్ మీడియాలో చేసిన చాట్ లో రూ. 10 నుంచి రూ.30 లక్షలు అంటూ జేసీడీఎస్ వో, చంద్రపాల్ అంటూ ఉండడంపై కూడా చర్చ సాగుతున్నది. ఇలాంటి వివాదాలు తగ్గాలంటే అధికారులు పీడీఎఫ్ బియ్యం రీ సైక్లింగ్ ను అరికడితే వివాదాలకు తావుండదని పలువురు వాపోతున్నారు.

Advertisement

Next Story