మ్యాట్రిమోని సైట్ నుంచి మొబైల్ కు లింక్.. రూ.లక్ష హాంఫట్

by Shiva |   ( Updated:2023-05-15 12:31:06.0  )
మ్యాట్రిమోని సైట్ నుంచి మొబైల్ కు లింక్.. రూ.లక్ష హాంఫట్
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : మ్యాట్రిమోని సైట్ నుంచి వచ్చిన లింక్ తో ఓ బాధితుడికి రూ.లక్ష పోగొట్టుకున్న ఘటన సిద్దిపేట త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బాధితుడికి గుర్తు తెలియని సైబర్ నేరస్థుడు ఓ మ్యాట్రిమోని సైట్ నుంచి పెళ్లి సంబంధం గురించి ఓ లింక్ పంపించాడు.

తరువాత మంచి భవిష్యత్తు మంచి వ్యాపారం చేయాలని తనతో వ్యాపారం చేస్తే ఎక్కువ డబ్బులొస్తాయని సైబర్ నేరగాడు బాధితుడికి మరో లింకు పంపించాడు. అది నమ్మిన బాధితుడు సైబర్ నేరగాడు చెప్పిన విధంగా రెండు, మూడు విడతలుగా రూ.లక్ష ను ఫోన్ పే, గూగుల్ పే నంచి సైబర్ నేరగాడికి పంపించాడు. అనంతరం ఆ ఫోన్ నెంబర్ కు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. అదేవిధంగా మ్యాట్రిమోని లింక్ ఓపెన్ చేయగా బ్లాక్ అయి ఉంది.

అత్యాశకు పోయి తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు జాతీయ సైబర్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా సీపీ శ్వేత మాట్లాడుతూ.. గుర్తు తెలియని వ్యక్తులు పంపిన లింక్ లను ఓపెన్ చేయకూడదని తెలిపారు. సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏదైనా సైబర్ క్రైం జరిగిన వెంటనే 1930 కి కాల్ చేస్తే పోగొట్టుకున్న డబ్బు తిరిగి పొందేలా చేయవచ్చని తెలిపారు.

Advertisement

Next Story