కాంగ్రెస్, బీఆర్ఎస్ ను ఇంటికి పంపిద్దాం

by Disha Web Desk 15 |
కాంగ్రెస్, బీఆర్ఎస్ ను ఇంటికి పంపిద్దాం
X

దిశ, మెదక్ ప్రతినిధి : అవినీతి, కుంభ కోణాలతో ప్రజల సొమ్మును దోచుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను ఇంటికి పంపాలని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ శ్రావంత్ ప్రజలకు పిలుపునిచ్చారు. మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు నామినేషన్ సందర్బంగా మెదక్ లో వేలాది మందితో భారీ ర్యాలీ గురువారం మెదక్ వెల్కమ్ బోర్డు నుంచి రాందాస్ చౌరస్తా వరకు నిర్వహించారు. గోవా సీఎం ప్రమోద్ శ్రావంత్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గోవా సీఎం ప్రమోద్ శ్రావంత్ మాట్లాడుతూ మెదక్ వచ్చిన తాను ప్రఖ్యాత వన దుర్గా మాతకు దండం పెట్టి రఘునందన్ రావు గెలవాలని కోరినట్టు తెలిపారు.

రాష్ట్రంలో గెలిచే అర్హత కాంగ్రెస్, బీఆర్ ఎస్ పార్టీలకు లేదని అన్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీ లు అమలు చేయకుండా అవినీతికి పాల్పడుతుందని విమర్శించారు. రాష్ట్రం లో ఉన్న కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని, రెండు పార్టీలను ఇంటికి పంపి ప్రజల కోసం, దేశాన్ని అభివృద్ధి చేస్తున్న మోడీ ని మారో సారి ప్రధాని చేసేందుకు మెదక్ లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ను గెలిపించాలని కోరారు. 370 ఆర్టికల్ రద్దు తో పాటు అనేక పథకాలు అమలు చేసిన ఘనత నరేంద్ర మోడీ కే దక్కిందని, మళ్లీ మరిన్ని సంక్షేమ పథకాలు తేవాలంటే దేశంలో మోడీయే ప్రధాని కావాలని దేశం అంతా కోరుతుందని అన్నారు.

కాంగ్రెస్ సర్కార్ ఎక్కువ రోజులు ఉండదు : కిషన్ రెడ్డి

రాష్ట్రంలో పదేళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉందని, కానీ కాంగ్రెస్ అంత కాలం అధికారంలో ఉండదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మెదక్ లో నిర్వహించిన బీజేపీ ర్యాలీ లో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ మోస పూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని అన్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీ లతో పాటు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని హామీ ఇచ్చిందని, ప్రజలు నమ్మి అధికారం అప్పగిస్తే.. మోసం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు వేల పెన్షన్ ఇచ్చిందని ఓట్లు వేయాలా.. లేక ఏకకాలంలో రెండు లక్షల రుణ మాఫీ చేసిందని ఓట్లు వేయాలో చెప్పాలని కోరారు. అన్ని గ్యారంటీ లు అమలు చేస్తామని రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి లు డిసెంబర్ 9న హామీ ఇచ్చారని, కానీ ఇప్పటికీ 15 వేల రైతు బంధు,

వరి ధాన్యం బోనస్ తో పాటు రుణ మాఫీ చేయకపోవడం వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఆ పాపం కాంగ్రెస్ పార్టీకే అంటుకుంటుందని అన్నారు. రాహుల్ గాంధీ ఇరవై ఏళ్లు ప్రధాని అవుతాడని రేవంత్ కేరళలో చెప్పడం హాస్యంగా ఉందని అన్నారు. రాహుల్ గాంధీ స్పీచ్ కు ఓట్లు రావని, కానీ మోడీ స్పీచ్ విన్న ప్రతి ఒక్కరూ బీజేపీ కి ఓట్లు వేస్తారని అన్నారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ లో ఇరవై ఏళ్లు ఉంటే బీజేపీ లో మోడీ ప్రధానిగా ఉంటారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గతంలో ఎంపీ గా గెలిచిన ప్రభాకర్ రెడ్డి ఎప్పుడైనా మెదక్ వచ్చి అభివృద్ధి పై శ్రద్ద చూపాడా అని ప్రశ్నించారు.

కేసీఆర్ ప్రభుత్వంలో అభివృద్ధి కంటే అధికంగా భూముల కుంభ కోణం, లిక్కర్ కుంభ కోణాలు చేసి దండుకున్నారని ఆరోపించారు. తెలంగాణ దోపిడీ సరిపోదన్నట్టు కవిత ఢిల్లీలో లిక్కర్ స్కాం చేసి తీహార్ జైల్ కు వెళ్లిందని, రాష్ట్ర పరువు తీసిన కుమార్తె ను కేసీఆర్ వెనకేసుకురావడం పై మండిపడ్డారు. బీజేపీకి అక్రమ కేసులు పెట్టాల్సిన అవసరం లేదని, తప్పు చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. మోడీ పై ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజల గుండెల్లో ఉన్నారని, ఈసారి నాలుగు వందల సీట్లు బీజేపీ గెలుస్తుందని, అందులో మెదక్ ఉండాలని జిల్లా ప్రజలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, గోదావరి అంజి రెడ్డి, సంగమేశ్వర్, బాస్వ లక్ష్మీనారాయణ, మోహన్ రెడ్డి, పంజా విజయ్, నాయిని ప్రసాద్, ఎక్కలా దేవి మధు, చల్ల నరేందర్, బీజేపీ నాయకులు, ఎమ్మార్పీఎస్ నేతలు, భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Next Story

Most Viewed