- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నీళ్ల కోసం మరో పోరాటానికి సిద్ధమవుదాం : హరీష్ రావు

దిశ, సంగారెడ్డి : సాగు నీటి కోసం మరో పోరాటానికి సిద్ధం కావాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సూచించారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా ముఖ్య నాయకులతో కోకాపేటలోని తన నివాసంలో సంగారెడ్డి జిల్లా పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ… సంగారెడ్డి జిల్లాకు సాగుకు, తాగుకు నీరందించేందుకు రెండేళ్ల క్రితం 2022 ఫిబ్రవరి 21న నారాయణ్ ఖేడ్ లో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఈ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారన్నారు. ఈ లిప్టు ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా జిల్లా సస్యశ్యామలం చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటే.. అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తున్నా కాంగ్రెస్ పార్టీ ఆ ప్రాజెక్టుల వైపు తొంగి కూడా చూడలేదన్నారు. దీంతో సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్, ఆందోల్, సంగారెడ్డి, జహీరాబాద్ నియోజకవర్గ ప్రజల సాగు నీరు కలగానే మారిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల పనులు ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో జహీరాబాద్, సంగారెడ్డి, నారాయణ ఖేడ్, అందోల్ నియోజకవర్గాల బీఆర్ఎస్ కార్యకర్తలను మరో నీటి పోరాటం చేసేందుకు సమాయత్తం చేయాలని సూచించారు. రైతులకు మేలు జరిగేలా భవిష్యత్తు కార్యాచరణ చేపడదామని 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఆరాటపడిన కేసీఆర్ ఆకాంక్షను నెరవేర్చుదామని నాయకులకు తెలిపారు. సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టు పనులను వెంటనే పూర్తి చేయాలనే డిమాండ్ తో, ఆ ప్రాజెక్టుల నిర్దేశిత ఆయకట్టు ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నామని వివరించారు. దీంతో ప్రభుత్వంలో కదలిక తెచ్చి, ప్రాజెక్టులు పూర్తి చేయించి, దాదాపు 4 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సంగమేశ్వర, బసవేశ్వర సాగునీటి ప్రాజెక్టులపై పోరాటానికి సిద్ధం అవుదామని పిలుపునిచ్చారు. ఆ దిశగా సంసిద్ధం కావాలని సూచించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, చింతా ప్రభాకర్, మాణిక్ రావు, మాజీ ఎమ్మెల్యేలు భూపాల్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శివ కుమార్, మాజీ జెడ్పీ చైర్మన్ జైపాల్ రెడ్డి, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.