అక్రమ సంబంధం.. ఆపై దారుణ హత్య

by Shiva |   ( Updated:2023-03-18 13:44:23.0  )
అక్రమ సంబంధం.. ఆపై దారుణ హత్య
X

సంగారెడ్డి పట్టణంలో వెలుగు చూసిన ఘటన

దిశ, కంది: భర్తను వదిలి ఒంటరిగా ఉంటున్న మహిళతో అక్రమ సబంధం పెట్టుకున్న వ్యక్తి అదే మహిళను దారుణంగా హతమార్చిన ఘటన సంగారెడ్డి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. ఎస్పీ రమణ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నాగారం గ్రామం బీదర్ జిల్లాకు చెందిన లక్ష్మణ్ కు కవిత (28)కు పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఓ కూతురు, ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే, కవిత భర్త లక్ష్మణ్ అదే గ్రామంలో మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఇదే విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకొని విడిపోయారు.

అనంతరం కవిత బతుకుదెరువు కోసం సంగారెడ్డి పట్టణానికి కొంతకాలం క్రితం వలస వచ్చింది. సరిగ్గా నెల రోజుల క్రితం సంగారెడ్డి పట్టణ పరిధలోని రాంనగర్ లో నివాసముంటున్న మంగళి కృష్ణతో కవితకు పరిచయం ఏర్పడింది. దీంతో పరిచయం కాస్త స్నేహంగా మారడంతో ఇద్దరూ ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారు. మంగళి కృష్ణ ప్రతిరోజూ కటింగ్ షాప్ కు వెళ్లి రాత్రి 10 వరకు ఇంటికి తిరిగి వచ్చేవాడు. ఈ క్రమంలోనే కవిత రోజూ పనికి వెళ్లి రాత్రి ఇంటికి ఆలస్యంగా రావడం పట్ల కృష్ణ ఆమెను ప్రశ్నించే వాడు. కాగా, 12న కటింగ్ షాప్ లో పని ముగించుకుని రాత్రి 10 గంటలకు కృష్ణ ఇంటికి చేరుకున్నాడు.

అదేవిధంగా రాత్రి 11 గంటలకు కవిత ఇంటికి చేరుకుంది. ఇప్పటిదాకా ఎక్కడ వెళ్లావు అంటూ కృష్ణ, కవితను ప్రశ్నించగా.. నా ఇష్టం ఉన్నట్లు వెళ్తా.. వస్తా.. అంటూ ఇద్దరి మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. తన సమాధానంతో తీవ్ర అగ్రహానికిలోనైన కృష్ణ, కవితను బలంగా కొట్టడంతో కవిత అక్కడిక్కడే స్పృహ తప్పి కింద పడిపోయింది. తరువాత కృష్ణ ఆమె తలను నేలపై గట్టిగా కొట్టి దారుణంగా హతమార్చాడు. అనంతరం ఏమీ తెలయనట్లుగా మృతదేహాన్ని సంచిలో కుక్కి.. అదే రోజు అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో మహబూబ్ సాగర్ ఒడ్డున పడేసి వెళ్లిపోయాడు.

ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం అనుమానాస్పదంగా మహిళ మృతి చెందిందంటూ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. కేవలం 24 గంటల్లోనే హత్య కేసు మిస్టరీని ఛేదించారు. ఈ కేసును చాకచక్యంగా చేధించిన పట్టణ సీఐ శ్రీధర్ రెడ్డి, సిబ్బందిని జిల్లా ఎస్పీ రమణ కుమార్ ప్రత్యేకంగా అభినందించి రివార్డును అందజేశారు. ఈ విలేకరుల సమావేశంలో సంగారెడ్డి డీఎస్పీ రవీంద్రా రెడ్డి, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story