ధాన్యం కొనుగోలు జూన్ 2 వరకు పూర్తిచేయాలి.. కలెక్టర్ రాజర్షి షా

by Sumithra |
ధాన్యం కొనుగోలు జూన్ 2 వరకు పూర్తిచేయాలి.. కలెక్టర్ రాజర్షి షా
X

దిశ, మెదక్ ప్రతినిధి : ధాన్యం కొనుగోళ్ల పక్రియ మరింత వేగవంతం చేసి జూన్ 2 నాటికి పూర్తయ్యేలా చూడవలసినదిగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా మండల ప్రత్యేక అధికారులు, ఆర్డీఓలు, తహసీల్ధార్లు, డిఎస్పీలకు సూచించారు. శుక్రవారం ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతం పై అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ మిల్లుల వద్ద హమాలీలలను అధిక సంఖ్యలో పెట్టుకొని ధాన్యం ఆన్ లోడింగ్ త్వరితగతిన అయ్యేలా తహసీల్ధార్లు, డిప్యూటీ తహసీల్ధార్లు, గిర్దావర్లు మిల్లుల వద్ద ఉండి పర్యవేక్షిస్తూ మిల్లర్లను పురమాయించాలని అన్నారు. అన్ లోడింగ్ ఎంత త్వరగా అయితే అంతత్వరగా తిరిగి కొనుగోలు కేంద్రాలకు లారీలు తరలించి లోడింగ్ చేసి పంపుటకు వీలవుతుందని అన్నారు. కేంద్రం నిర్వాహకులు కూడా రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం తూకం అయిన వెంటనే లోడింగ్ చేసి మిల్లులకు తరలించాలన్నారు.

మిల్లుల వద్ద ఎటువంటి కోతలు లేకుండా తక్షణమే దించుకొని ట్రక్ షీట్ ఇచ్చేలా నిరంతరం పర్యవేక్షిస్తూ మండల వారీగా, మిల్లు వారీగా రోజు వారి లోడింగ్, ఆన్ లోడింగ్ నివేదిక అందజేయవలసినదిగా జిల్లా పౌర సరఫరాల అధికారిని కలెక్టర్ ఆదేశించారు. జూన్ 2 నుండి రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలు ప్రారంభమవుతున్నందున ధాన్యం సేకరణలో మరింత వేగం పెంచాలని కేంద్రం నిర్వాహకులకు, అధికారులకు సూచించారు. ఎక్కడైనా మిల్లర్లు ధాన్యం దించుకోవడంలో అలసత్వం వహిస్తే నోటీసులు జారీ చేయాలన్నారు. గత సీజనుతో పోలిస్తే ధాన్యం సేకరణ అధికంగా ఉన్న అక్కడక్కడా రైతులు ధర్నాకు దిగుతున్నట్లు వార్తలు వస్తున్నాయని, అటువంటి సునిశిత కేంద్రాలను గుర్తించి అనవసరంగా ధర్నాలు, సమస్యలు ఉత్పన్నం కాకుండా పోలీసుల సహాకారంతో తగు జాగ్రత్తలు తీసుకోవలసిందిగా రెవెన్యూ అధికారులకు సూచించారు. ధాన్యం ఎక్కువగా ఉన్న కేంద్రం నిర్వాహకులు తూకం వేసి గన్ని బ్యాగులో ధాన్యం నింపి రెడీగా పెట్టుకోవాలని, లారీలు వచ్చిన వెంటనే లోడింగ్ చేసి మిల్లులకు తరలించాలన్నారు.

అధికారులు కూడా గన్నిసంచుల కొరత లేకుండా, లారీల సమస్య తలెత్తకుండా నిరంతరం మానిటరింగ్ చేస్తూ ధాన్యం ఎక్కువగా ఉన్న కేంద్రాలకు త్వరగా లారీలను పంపాలని అన్నారు. ప్రతి మిల్లు వద్ద పోలీసులను పెట్టి త్వరగా అన్ లోడింగ్ జరిగేలా అధికారులు మానిటరింగ్ చేయాలన్నారు. కొనుగోలు కేంద్రానికి, మిల్లులకు ట్యాగింగ్ చేసిన జిల్లాలోని 65 మిల్లులలో సంబంధిత మిల్లర్లు మూతపడిన అల్యూమినియం ఫ్యాక్టరీ , ఖండసారి షుగర్ ఫ్యాక్టరీ, బొల్లారంలోని గోదాములలో ధాన్యం భద్రపరచవలసినదిగా సూచించారు. రేషన్ బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం వస్తున్నదని కొన్ని నిరాధార వార్తలు వస్తున్నాయని, వాటిని నమ్మరాదని కలెక్టర్ తెలిపారు. బలవర్థకమైన పోర్టిఫైడ్ రైస్ ను సాధారణ బియ్యంలో మిళిత చేసి రేషన్ కార్డుదారులకు అందిస్తున్నామని, ఇది గమనించాలని సూచించారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ రమేష్, డీఎస్ఓ శ్రీనివాస్, డీఆర్డీఓ, డీసీఓ, ఆర్డీఓలు, మండల ప్రత్యేక అధికారులు, తహసీల్ధార్లు, కేంద్రం నిర్వాహకులు తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story