- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
"మీ సేవ"లు కిట కిట

దిశ, తుంగతుర్తి : "మీసేవ" కేంద్రాలు దరఖాస్తుదారులతో కిటకిటలాడుతున్నాయి. రాజీవ్ యువ వికాస్ పథకం కింద సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తులు చేసుకోవడానికి వారంతా ఎగబడుతున్నారు. నోటిఫికేషన్ విడుదలైన నాటి నుండి ఇదే పరిస్థితి కొనసాగుతోంది. సెలవు దినాల్లో సైతం మీ సేవా కేంద్రాలు కళకళలాడుతున్నాయి. పథకం దరఖాస్తు కోసం ఆదాయ, కులం సర్టిఫికెట్లు జత చేయాలంటూ మొదట్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి తర్వాత దాన్ని సవరించింది. రేషన్ కార్డు కలిగి ఉన్నవారు ఆదాయ సర్టిఫికెట్ జత చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసినప్పటికీ పలువురు పట్టించుకోవడం లేదు.
ఎందుకంటే.. మంజూరయ్యే పథకానికి ఏనాటికైనా ఆదాయ సర్టిఫికెట్ జత చేయాల్సిందే అంటూ మొండిగా హడావుడి చేస్తున్నారు. నియోజకవర్గ కేంద్రమైన తుంగతుర్తిలో ఉన్న మీసేవ కేంద్రాల్లో కొనసాగుతున్న ఈ సందడి మిగతా వారికి ఇబ్బందికరంగా మారింది. (మీ సేవకు మిగతా పనుల కోసం వచ్చే వారికి) ఇదిలా ఉంటే మరోవైపు తుంగతుర్తి ఎంపీడీవో శేషు కుమార్ దరఖాస్తుదారులు ఇబ్బంది పడవద్దనే ఉద్దేశంతో ఆన్ లైన్ లో సర్వర్ ప్రాబ్లం వచ్చినా, డబ్బులు లేక దరఖాస్తులు చేసుకోలేకపోయిన పేద వారంతా నేరుగా తమ కార్యాలయంలో సరైన పత్రాలతో దరఖాస్తులు చేస్తే తామే వాటిని ఆన్ లైన్ చేస్తామంటూ ఇప్పటికే పత్రికల ద్వారా ప్రచారం చేశారు. అయితే కొంతవరకే దీనికి స్పందన వచ్చింది. చెప్పిన ప్రకారం దరఖాస్తులను ఆన్ లైన్ చేస్తారో లేదో..? అనే అనుమానంతో చాలామంది అటువైపు వెళ్ళక మీ సేవా కేంద్రాలకు బారులు కడుతున్నారు. ముఖ్యంగా సబ్సిడీతో కూడిన రుణం ఎప్పుడు వస్తుందో ఏమో కానీ.. దరఖాస్తులు చేసుకోవడంలో మాత్రం రెట్టింపు ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నారు.