సీపీఆర్‌పై అందరికీ అవగాహన అవసరం: మంత్రి హరీశ్ రావు

by Mahesh |   ( Updated:2023-03-27 07:45:19.0  )
సీపీఆర్‌పై అందరికీ అవగాహన అవసరం: మంత్రి హరీశ్ రావు
X

దిశ బ్యూరో, సంగారెడ్డి: శరీరంలో అన్ని భాగాలకు విశ్రాంతి ఉంటుంది కానీ, గుండెకు మాత్రం ఉండదు. మనం నిద్రిస్తున్నా గుండె పని చేస్తూ ఉంటుంది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న గుండెలు ఆగిపోతుండడం, సడెన్ కార్డియాక్ అరెస్టులు (ఎస్.సి.ఎ)హార్ట్ స్ట్రోక్లు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తున్నదని మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. ఇది ఎంతో ఆలోచించాల్సిన విషయన్నారు. సంగారెడ్డి కలెక్టరేట్‌లో సీపీఆర్ పై నిర్వహించిన శిక్షణ అవగాహణ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. మన కళ్లముందే ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు చూస్తున్నాం. సమయం, సందర్భం, చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ఎవరికైనా సడెన్ కార్డియాక్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుందని, ప్రాణనష్టాన్ని తగ్గించేందుకు సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా సీపీఆర్ పై అవగాహన కల్పించాలని, శిక్షణ ఇప్పించాలని నిర్ణయించారని మంత్రి పేర్కొన్నారు.

సడెన్ కార్డియాక్ అరెస్ట్, హార్ట్ ఎటాక్ రెండూ ఒకటే అని చాలా మంది అనుకుంటారు. కానీ వైద్య నిపుణులు చెబుతున్న దాని ప్రకారం, అవి రెండూ వేర్వేరన్నారు. సడెన్ కార్డియాక్ అరెస్ట్ అంటే అనుకోని ప్రమాదాలు, దుర్ఘటనలు జరిగినప్పుడు మనిషి సైకలాజికల్ షాక్సికి గురవుతాడు. ఈ సమయంలో హృదయ స్పందనలో తేడా వస్తుంది. గుండె లయ తప్పి ఆగిపోతుందన్నారు. ఈ సమయంలో మనిషి స్పందించడు, శ్వాస ఆగిపోతుంది. ఆ సమయంలో గుండె కొట్టుకునేలా ఛాతి మీద పదే పదే ఒత్తిడి చేయడం, నోటి ద్వారా కృత్రిమ శ్వాసను అందించడంతో గుండె, ఊపిరితిత్తులు తిరిగి పని చేస్తాయన్నారు. దీన్నే సీపీఆర్ అంటారని, దీన్ని తెలుగులో హృదయ శ్వాస పునరుద్ధారణ అంటారు. ఇంత చేసినా కొన్ని సార్లు గుండె స్పందించదు. ఆ సమయంలో ఆటోమేటిక్ ఎక్స్ టర్నల్ డెఫిబ్రిలేటర్స్ (ఏఈడీ) అనే వైద్య పరికరం ద్వారా ఛాతీ నుంచి గుండెకు స్వల్ప మోతాదులో ఎలక్ట్రిక్ షాక్ ఇవ్వడం ద్వారా గుండె తిరిగి పని చేసేలా చేయడం సాధ్యమవుతుందన్నారు.

జిమ్ చేస్తూ, పనులు చేస్తూ, డ్యాన్స్ చేస్తూ, నడుస్తూ కొంత మంది సడెన్గా పడిపోవడం, ప్రాణాలు కోల్పోవడం వంటి వీడియోలు సోష‌ల్ మీడియాలో, టీవీల్లో చూస్తున్నాం. సీపీఆర్ తెలిసిన వారు ఉంటే సీపీఆర్ చేసి వారి ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది. దేశవ్యాప్తంగా, ఆసుపత్రుల బయట ప్రతి రోజు దాదాపు 4వేలు సడెన్ కార్డియాక్ అరెస్ట్లు జరుగుతుండగా, ఇందులో 90 శాతం మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయని హరీష్ రావు వెల్లడించారు. ఇందులో 75 శాతం ఆసుపత్రుల బయట జరుగుతుండగా, 15 శాతం పబ్లిక్ ప్లేసుల్లో జరుగుతున్నాయన్నారు. ప్రాణాపాయంలో ఉన్న వారికి సీపీఆర్ చేసేందుకు చదువు, మెడికల్ పరిజ్ఞానం, వయస్సుతో సంబంధం లేదని ఎవరైనా సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడవచ్చు అన్నారు. దీని మీద సమాజంలో అవగాహన లేదు. ఎవరూ దృష్టి సారించడం లేదు.

ఇది కూడా ప్రాథమిక చికిత్సలో భాగమే. శరీరంలో మెదడు అత్యంత సున్నితమైనది. ఆక్సిజన్ అందకపోతే మెదడు ఎక్కువ సేపు పని చేయదు. త్వరగా చెడిపోతుంది. అందువల్ల మెదడుకు ఆక్సిజన్‌తో కూడిన రక్తాన్ని వెంటనే అందించాలి. అందుకు వెంటనే సీపీఆర్ చికిత్స ప్రారంభించాలని సూచించారు. ఇందులో భాగంగా, పారామెడికల్ సిబ్బందితో పాటు, వైద్యు సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, పోలీసు, కమ్యూనిటీ వాలంటీర్లు, ఉద్యోగులు, రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ ప్రతినిధులు, సిబ్బంది, కమర్షియల్ కాంప్లెక్స్ వర్కర్స్ ఇలా వివిధ వర్గాలకు చెందిన వ్యక్తులకు సీపీఆర్ మీద శిక్షణ ఇస్తున్నామన్నారు. ప్రతి జిల్లాకు ఐదుగురు మాస్టర్ ట్రైనర్ను ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ ఐదుగురు జిల్లాలో మిగతా సిబ్బందికి శిక్షణ ఇస్తారు.

ప్రతి మాస్టర్ ట్రైనర్ రోజుకు 3 బ్యాచుల చొప్పున 60 మందికి మొత్తంగా వారానికి 300 మందికి శిక్షణ ఇవ్వబోతున్నారు.1240 మెడికల్ ఆఫీసర్లు, 1300 స్టాఫ్ నర్సు, 8500 ఏఎన్ఎంలు, 26,000 నుంచి ఆశాలకు ఇలా అందరికీ శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జీహెచ్ఎంసీ, మున్సిపాలిటీ సిబ్బందికి శిక్షణ ఇస్తున్నాం. దీని కోసం రూ.15 కోట్లతో అవసరమైన 1262 ఏఈడీ మిషన్లు ప్రొక్యూర్ చేసుకొని, అన్ని పీహెచ్సిలు, యూపీహెచ్సీలు, బస్తీ దవాఖానల్లో ఏర్పాటు చేయబోతున్నాం. సీఎం కేసీఆర్ ఒక గొప్ప ఆలోచన చేసి సీపీఆర్ ట్రైనింగ్ ప్రారంభించారు. రాజేంద్ర నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తికి సడెన్ కార్డియాక్ అరెస్ట్ అయితే, అక్కడే ఉన్న పోలీసు కానిస్టేబుల్ రాజశేఖర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి అతని ప్రాణాలు కాపాడిన సందర్భాన్ని మంత్రి గుర్తు చేశారు.

ప్రజావాణిలో ఫిర్యాదు ఇచ్చేందుకు వరంగల్ కలెక్టరేట్‌కు వచ్చి, ఒక్కసారిగా కుప్పకూలిపోయిన వ్యక్తికి జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటరమణ తక్షణం స్పందించి సీపీఆర్ చేసి ప్రాణం కాపాడగా వీరిని సన్మానించామన్నారు. అపార్ట్మెంట్స్, మాల్స్, జనాలు ఎక్కువగా ఉండే నిర్మాణాల్లో ఎఇడి మిషన్లు తప్పనిసరి చేసేలా జీఓ తెస్తున్నాం. ఇక నుంచి కూడా సీపీఆర్ శిక్షణ పొందిన మా సీపీఆర్ వారియర్స్ సడెన్ కార్డియాక్ అరెస్ట్ అయిన వారికి తక్షణ ప్రాథమిక చికిత్స అందించి ప్రాణాలు కాపాడుతారన్నారు. కార్యక్రమంలో జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మా రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శరత్, ఎస్పీ రమణ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story