పోలీస్ నియమకాల్లో రిజర్వేషన్‌ల ఉల్లంఘన.. కేసీఆర్‌కు మందకృష్ణ బహిరంగలేఖ

by GSrikanth |
పోలీస్ నియమకాల్లో రిజర్వేషన్‌ల ఉల్లంఘన.. కేసీఆర్‌కు మందకృష్ణ బహిరంగలేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో: పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఇటీవల నిర్వహించిన ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమ్స్‌లో రిజర్వేషన్ల ఉల్లంఘన జరిగిందని ఎమ్మార్పీస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహిరంగలేఖ రాశారు. ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్షలో ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీకి కనీస అర్హత మార్కులను 30 శాతంగా నిర్ణయించారని, కానీ, గత నోటిఫికేషన్లలో ఓసీ అభ్యర్థికి 40 శాతం, బీసీకి 35 శాతం, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 30 శాతంగా ఉండేదని పేర్కొన్నారు. దీని వలన ముందు నోటీఫికేషన్‌తో పోలీస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు కనీస అర్హత మార్కులను తగ్గించకుండా సమాన మార్కులు నిర్ణయించడం వలన రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందని తెలిపారు. దీన్ని వెంటనే సవరించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు. రాజ్యాంగంలోని అధికరణ 15, 16, 46 ప్రకారం ప్రతి రిక్రూట్‌మెంట్‌లో ఎంట్రీ లెవల్‌లోనే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఓసీలతో పోల్చినప్పుడు తక్కువ కటాఫ్ మార్కులను పెట్టాలి అనే రాజ్యాంగ స్పూర్తిని ఉల్లంఘించి ఈ నోటిఫికేషన్‌ను జారీ చేసినట్లుగా ఆయన భావించారు. పోలీస్ నియామకాలలో పాత విధానాన్నే కొనసాగించాలని, ప్రిలిమ్స్ పరీక్షలో తప్పుగా వచ్చిన ప్రశ్నలన్నిటికీ మార్కులు కలపాలని, నెగిటివ్ మార్కులు తొలగించాలని డిమాండ్ చేశారు. పోలీస్ రిక్రూట్‌మెంట్‌ రిజర్వేషన్స్ అమలుకై నిరసనలలో పాల్గొన్న అశోక్ సార్, ప్రభాకర్ చౌటి, కొర్ర శ్రీనివాస్ నాయక్‌లపై పెట్టిన కేసులను బేషరతుగా ఉపసంహరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story