ధాన్యంలో తరుగు తీస్తే లైసెన్సు రద్దు చేస్తాం: మంత్రి నిరంజన్ రెడ్డి

by Kalyani |
ధాన్యంలో తరుగు తీస్తే లైసెన్సు రద్దు చేస్తాం: మంత్రి నిరంజన్ రెడ్డి
X

దిశ, వనపర్తి: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైస్ మిల్లర్లు తరుగు పేరుతో రైతులకు నష్టం కలిగిస్తే వారి లైసెన్సులను రద్దు చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హెచ్చరించారు. శనివారం మంత్రి నిరంజన్ రెడ్డి వనపర్తి జిల్లాలోని రాజపేట, చిన్న మందడి, పామిరెడ్డి పల్లి, మణిగిళ్ల గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ .. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాసంగిలో 56 లక్షల 44 వేల ఎకరాలలో, వనపర్తి జిల్లాలో ఒక లక్ష 59 వేల ఎకరాలలో రైతులు వరి పంటను సాగుచేశారని చెప్పారు. అధికారులు 4 లక్షల 2 వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడి అంచనా వేశారని అన్నారు.

వనపర్తి జిల్లాలో 257 వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. కోటి సంచులు అవసరం ఉండగా 40 లక్షల సంచులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రైతులు 17 శాతం తేమ ఉండేలా వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొని రావాలని సూచించారు. కొనుగోలు కేంద్రాలలో సూచించిన కొలతల ప్రకారం సంచి తూకం మినహాయించి 40 కిలోలు ఉండేలా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. కౌలు రైతులు పండించిన వరి ధాన్యం విషయంలో వ్యవసాయ రైతులు సత్వరమే స్పందించి వారికి ధ్రువకరణ పత్రాలు జారీ చేయాలన్నారు.

గ్రామీణ అభివృద్ధి శాఖ, పౌర సరఫరాల శాఖ, ప్రాథమిక వ్యవసాయ సహకార శాఖలు సమన్వయంతో పనిచేసి కేంద్రాలలో ధాన్యం కొనుగోలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు జగదీశ్వర్ రెడ్డి, రైతు మండల కో ఆర్డినేటర్ రాజప్రకాశ్ రెడ్డి, జడ్పీటీసీ రఘుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed