‘ముడా’ ముందు సమస్యల తోరణం.. వార్డువార్డునా సమస్యలే!

by Shiva |
‘ముడా’ ముందు సమస్యల తోరణం.. వార్డువార్డునా సమస్యలే!
X

దిశ, మహబూబ్‌నగర్ బ్యూరో: మహబూబ్‌నగర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) ముందు సమస్యల తోరణాలు ఎదురుకానున్నాయి. జడ్చర్ల, మహబూబ్‌నగర్, భూత్పూర్ మునిసిపాలిటీలతో పాటు, మరికొన్ని మండలాలను కలుపుకుని రెండున్నరేళ్ల క్రితం గత ప్రభుత్వం ముడాను ఏర్పాటు చేసింది. ముడా పరిధిలోని మున్సిపాలిటీలు, గ్రామాల అభివృద్ధి ముడా చైర్మన్, సభ్యుల భాగస్వామ్యం ప్రధానంగా ఉండాలి. కానీ, బీఆర్ ప్రభుత్వ హయాంలో ముడా చైర్మన్, సభ్యుల పదవీ బాధ్యతల స్వీకరణ తర్వాత అప్పటి ముఖ్య నేతల జోక్యం ఎక్కువగా ఉండడంతో ముడా చైర్మన్, సభ్యులు చెప్పుకోదగిన స్థాయిలో నిర్ణయాలు తీసుకోలేకపోయారు. అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలలో నామమాత్రంగా పాల్గొన్నారు. ఇంతలో అసెంబ్లీ ఎన్నికలు రావడం.. ప్రభుత్వం మారడంతో ముడా చైర్మన్, సభ్యుల పదవీ కాలం ముగిసిపోయింది.

కుప్పలుతెప్పలుగా వెంచర్లు...

ముడా పరిధిలో కుప్పలు తిప్పలుగా అక్రమ వెంచర్లు వెలిశాయి. అర్థ బలం, అంగ బలం, రాజకీయ బలం ఉన్నవాళ్లు ఎటువంటి అనుమతులు లేకుండా వెంచర్లను ఏర్పాటు చేశారు. అన్ని అనుమతులతో వెంచర్లు చేసి విక్రయించాల్సింది పోయి.. యథేచ్ఛగా ఎలాంటి అనుమతులు లేకుండా.. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ కుంటల చొప్పున భూమిని విక్రయిస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి రావలసిన ఆదాయానికి పెద్ద ఎత్తున గండి పడింది. మూడు మున్సిపాలిటీలలోనూ చెప్పుకోదగిన స్థాయిలో అభివృద్ధి పనులు జరగలేదు. కొన్ని మున్సిపాలిటీల వార్డులలో పారిశుధ్య పనులు, డ్రైనేజీ వ్యవస్థలు అస్తవ్యస్తంగా మారాయి. ఆయా మున్సిపాలిటీల చైర్మన్లు, సభ్యులు, అధికారులతో కలిసి ప్రత్యేక ప్రణాళికలను ఏర్పాటు చేసుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

అధిక పన్నులతో జనం సతమతం..

ముడా పరిధిలో ఉన్న భూత్పూర్ మున్సిపాలిటీ ప్రజలు అధిక పన్నులు చెల్లించలేక సతమతం అవుతున్నారు. మహబూబ్‌నగర్, జడ్చర్లలోనే కాకుండా హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్థాయిలో కూడా లేనివిధంగా అధికారులు పన్ను విధిస్తుండడంతో ప్రజలు, చిన్నపాటి వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపాలిటీల పరిధిలో ఉన్న ఇండ్లను అన్నింటిని జియో ట్యాగ్ చేసి పన్నులు అమలు చేయాలని గత ప్రభుత్వం చేసిన ఆదేశాలను భూత్పూర్ మున్సిపాలిటీలో పనిచేసిన అధికారులు అమలు చేయగా.. మిగిలిన మున్సిపాలిటీలలో అమలు కాలేదు.

దీంతో గతంలో రూ.5 నుంచి రూ.10 వేల పన్ను చెల్లించవలసిన యజమానులు ఇప్పుడు రూ.25 నుంచి రూ.50 వేల వరకు పన్నులు చెల్లించవలసిన పరిస్థితులు నెలకొన్నాయి. ముడా పరిధిలో ఉన్న సమస్యలతో పాటు, భూత్పూర్ మున్సిపాలిటీలో అధికంగా ఉన్న పన్నుల తగ్గుదలకు, ఇతర సమస్యల పరిష్కారానికి జడ్చర్ల, మహబూబ్ నగర్, దేవరకద్ర ఎమ్మెల్యేల సహకారంతో సమస్యలను పరిష్కరించాలని ముడా పరిధిలోని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement

Next Story