నిర్దేశిత సమయంలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే పూర్తి చేయాలి

by Naveena |
నిర్దేశిత సమయంలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే పూర్తి చేయాలి
X

దిశ, వీపనగండ్ల: ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ, ప్రసవాల సంఖ్యను పెంచాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి వైద్యులకు సూచించారు. శనివారం వీపనగండ్ల లోని 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని, ఇందిరమ్మ ఇండ్ల సర్వేను, మండల పరిధిలోని కల్వరాలలో వరి కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వీపనగండ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో రికార్డులను పరిశీలించి, ఏ నెలలో ఎన్ని ప్రసవాలు జరుగుతున్నాయో వైద్యాధికారి డాక్టర్ రాజశేఖర్ ను అడిగి తెలుసుకున్నారు. ఉమ్మడి మండలంలో కలిపి ఓకే ఆస్పత్రి ఉన్నప్పటికీ ఆసుపత్రిలో కాన్పులు తక్కువగా అవుతున్నాయని, గ్రామాలలో ఏఎన్ఎంలు, ఆశ వర్కర్ల ద్వారా అవగాహన కల్పించి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు అయ్యేలా చూడాలని సూచించారు. సిహెచ్సి ఆసుపత్రికి సరిగ్గా వైద్యులు రాకపోవడంపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎప్పుడు హాస్పిటల్ తనిఖీకి వచ్చిన పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ రాజశేఖర్ మాత్రమే కనపడుతున్నారని,మరోమారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వైద్యులు విధులకు సక్రమంగా హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సిహెచ్సి జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ చైతన్య గౌడ్ కు చరవాణిలో సూచించారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, కుక్క కాటుకు, పాము కాటుకు వ్యాక్సిన్ అందుబాటులో ఉందా అని ప్రశ్నించారు. రికార్డులను పరిశీలించి కుక్క కాటుకు గురైన వారిని రెండో వ్యాక్సిన్ వేయటానికి స్టాఫ్ నర్సులు ఫోన్ ద్వారా బాధితుడికి సమాచారం అందించాలని, వారి ఫోన్ నెంబర్లను కూడా రికార్డులో పొందుపరచాలని సూచించారు. ఆసుపత్రిలో మధ్యాహ్నం రెండు తర్వాత వైద్యులు అందుబాటులో ఉండటం లేదని, 108 అంబులెన్స్ సౌకర్యం కూడా లేదని గ్రామస్తులు కలెక్టర్ కు వివరించారు. సిహెచ్సి ఆసుపత్రి వైద్యులు రెండు గంటల వరకే విధులు నిర్వహిస్తారని, ఆ తరువాత స్టాప్ నర్సులు రోగులకు వైద్య చికిత్సలు అందిస్తారని గ్రామస్తులకు వివరించారు.

కల్వరాల వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ ఆదర్శ్ సురభి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఏఏ మిల్లులకు పంపుతున్నారని, ఇప్పటివరకు ఎంత ధాన్యం కొనుగోలు చేశారని ప్రశ్నించారు. ఇప్పటివరకు 30 వేలు బస్తాల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని బుక్ కీపర్స్ తెలిపారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. అనంతరం వీపనగండ్లలో ఇంటింటి ఇందిరమ్మ సర్వేను తనిఖీ చేశారు. సర్వే ప్రక్రియ వేగవంతంగా లేకపోవడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో సర్వర్ సరిగ్గా పనిచేయకపోవడంతో నిదానంగా అవుతుందని అధికారులు కలెక్టర్ కు వివరించారు. అలాంటి మాటలు తనతో చెప్పవద్దని, చేసే పనిలో వేగవంతం లేకపోవడంతోనే ఇలాంటి మాటలు చెబుతున్నారని అధికారులపై మండిపడ్డారు. ఇందిరమ్మ ఇండ్ల సర్వేను ఏ విధంగా మొబైల్ యాప్ లో నమోదు చేస్తున్నారో స్వయంగా పరిశీలించారు. నమోదు ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని పొరపాట్లకు తావివ్వొద్దని ఎంపీడీవో శ్రీనివాసరావుకు సూచించారు. ఈ కార్యక్రమంలో వెలుగు డిపిఎం అరుణ, ఎంపీడీవో శ్రీనివాసరావు, వైద్యాధికారులు డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ హారిక, వ్యవసాయ అధికారి డాకేశ్వర్ గౌడ్, నయాబ్ తాసిల్దార్ కృష్ణమూర్తి, ఆర్ఐ కురుమూర్తి, వెలుగు సిసి వీరయ్య తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed