గుడ్లు పెట్టిన జెర్రిపోతు పాము.. ఎట్టకేలకు ఆ అపోహలకు చెక్

by Mahesh |
గుడ్లు పెట్టిన జెర్రిపోతు పాము.. ఎట్టకేలకు ఆ అపోహలకు చెక్
X

దిశ, జడ్చర్ల : సాధారణంగా పాములు కొన్ని గుడ్లు పెడతాయి. మరికొన్ని పిల్లల్ని కంటాయి. అయితే ప్రజలు జెర్రిపోతును మగదిగాను నాగుపామును ఆడది గాను అపోహ పడుతుంటారు. కానీ జెర్రిపోతు పాముల్లో కూడా ఆడ మగ పాములు వేర్వేరుగా ఉంటాయి. సాధారణంగా ప్రతి పాములోను ఆడ మగ తేడాలుంటాయి. గత 5 సంవత్సరాలుగా డా. బూర్గుల రామకృష్ణ రావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వృక్షశాస్త్ర సహయాచార్యుడు డా. బి. సదాశివయ్య ఆధ్వర్యంలో.. జడ్చర్ల పరిసర ప్రాంతాల్లో పాముల రక్షణ చేస్తున్నారు. అందులో భాగంగా ఇటీవల జడ్చర్ల పట్టణంలో ఒక ఇంట్లో ఆడ జెర్రిపోతు పామును పట్టుకున్నారు.

అది శుక్రవారం నాడు 10 గుడ్లను పెట్టిందని సర్ప రక్షకుడు డా. బి. సదాశివయ్య తెలిపారు. వీటిని పొదిగించేందుకు సరైన పరికరాలు కళాశాలలో లేనందున వాటిని హైదరాబాద్‌లోని అటవీశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ వారికి అందజేశామని కళాశాల ప్రిన్సిపాల్ డా. అప్పియ చిన్నమ్మ తెలిపారు. కళాశాలలోని జీవవైవిధ్య పరిశోధన, విద్యాకేంద్రంలో ఇప్పటికే 3 సార్లు ఇలా పెట్టిన గుడ్లను హైదరాబాద్ పంపగా అవి పిల్లలుగా మారాయని సదాశివయ్య తెలిపారు. ఇందు మూలంగా ప్రజలు జెర్రిపోతుల్లో కూడా ఆడ పాములుంటాయని గ్రహించాలని తెలియజేశారు. సాధారణంగా ఇవి జులై నుంచి ఆగస్టు నెలల్లో 6 నుండి 22 వరకు గుడ్లు పెట్టవచ్చని తెలిపారు.



Next Story

Most Viewed