ఈ యాసంగి 64 లక్షల మందికి రైతు బంధు ఇచ్చాం.. మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్

by Javid Pasha |   ( Updated:2023-01-28 13:43:36.0  )
ఈ యాసంగి 64 లక్షల మందికి రైతు బంధు ఇచ్చాం.. మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్
X

దిశ, గద్వాల : ఈ యాసంగీలో సుమారు 64 లక్షల మంది రైతులకు రైతు బంధు ఇచ్చామని మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డ్ ఆవరణలో ఏర్పాటు చేసిన కొత్తగా ఎన్నికైన మార్కెట్ కమిటీ చైర్మన్ పచ్చర్ల శ్రీధర్ గౌడ్ ప్రమాణ స్వీకారోత్సవానికి వారు హాజరయ్యారు. అంతకుముందు మంత్రులకు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అలంపూర్ ఎమ్మెల్యే వీఎం అబ్రహాము, జడ్పీ చైర్ పర్సన్ సరిత, మున్సిపల్ చైర్మన్ బీ.ఎస్ కేశవ్ లు సాదర స్వాగతం పలికారు. అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఎన్నికైన పచ్చర్ల శ్రీధర్ గౌడ్ వైస్ చైర్మన్ తదితరుల చేత జిల్లా మార్కెటింగ్ అధికారి పుష్ప ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 15 కోట్లకు పైగా పట్టాదారు పాసు పుస్తకాలు ఉన్న రైతులు ఉన్నారని, కేవలం మూడు కోట్ల మంది పట్టాదారులకు మాత్రమే ఐదు ఎకరాల లోపు ఉన్న వారికి ఒక్కో విడత చొప్పున 2000 రూపాయలు ఇస్తున్నారని, మిగిలిన 12 కోట్ల పట్టాదారులకు మొండిచేయి చూపిస్తోందని కేంద్రంపై విమర్శించారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని పెంచుతామన్న కేంద్రం ఆదాయాన్ని పెంచకపోగా కనీసం మద్దతు ధర కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చిన కేంద్ర ప్రభుత్వం మాట తప్పిందన్నారు.

దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధు పథకాన్ని అమలు చేశారని చెప్పారు. మరణించిన రైతు కుటుంబాలు రోడ్డున పడకుండా ఉండేందుకు సీఎం కేసీఆర్ ఒక గొప్ప ఆలోచనతో రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టి ఎలాంటి పైరవీలు లేకుండా రైతు ఇంటి వద్దకే ఐదు లక్షల రూపాయలు వెళ్లేలా చేశారని తెలిపారు. ఇప్పటి వరకు 1,32,000 ఉద్యోగాలు భర్తి చేశామని, 91 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేశామని గుర్తు చేశారు. రైతులకు మేలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం వైపు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు మొగ్గు చూపుతున్నాయని చెప్పారు. దేశంలో రైతు ప్రభుత్వం తీసుకురావాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని, ఇందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేశారని తెలిపారు. దేశవ్యాప్తంగా రైతులకు మాత్రమే ఎలాంటి పన్ను విధించే హక్కు లేదని, కేంద్ర ప్రభుత్వం మాత్రం రైతులకు పన్ను విధించే ఆలోచనలో పడిందని తెలిపారు. అన్నదాతల చావుకు కారణం కేంద్ర ప్రభుత్వమే అని, దేశ ప్రజల ఆదాయాన్ని కొద్దిమంది కోటీశ్వరులకు దోచి పెట్టేందుకు కేంద్రం చూస్తోందన్నారు. శాస్త్రవేత్త స్వామినాథన్ నివేదిక మేరకు రైతులు పండించిన పంట వారి కష్టార్జితం, కుటుంబ సంఖ్య, పెట్టుబడులు అన్ని పోగా ఎకరాకు వచ్చే ఆదాయంకు అదనంగా 50% కలిపి క్వింటాకు ధర నిర్ణయిస్తేనే అది మద్దతు ధర అవుతుందని తెలిపారు.


రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా రైతు ప్రభుత్వం రాబోతోందని ఆయన ఆశాభావ వ్యక్తం చేశారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. 70 ఏళ్ల పాలనలో ఎంతోమంది ముఖ్యమంత్రిలు పాలన చేసిన ఏ ఒక్కరు ఏ వర్గం గురించి ఆలోచించలేదని, కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే అన్ని వర్గాలను వాడుకున్నారని విమర్శించారు. భగవంతుడు కులాన్ని సృష్టించలేదని మనుషులను సృష్టిస్తే మనుషులమైన మనమే కులాన్ని సృష్టించుకున్నామని చెప్పారు. అన్ని కులాల వారికి సమన్యాయం జరగాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని పేర్కొన్నారు. వాల్మీకుల సమస్యను పరిష్కరించేలా ఎమ్మెల్యేలు కృష్ణమోహన్ రెడ్డి అబ్రహంలతో కలిసి అసెంబ్లీలో చర్చిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కన్స్యూమర్ ఫెడరేషన్ చైర్మన్ గట్టు తిమ్మప్ప, రాష్ట్ర పంచాయతీరాజ్ ట్రిబునల్ మాజీ చైర్మన్ బండారి భాస్కర్, జిల్లా పరిషత్ వైస్ చైర్ పర్సన్ సరోజమ్మ, పిఎసిఎస్ చైర్మన్ ఉమ్మడి జిల్లా డైరెక్టర్ సుభాన్, గద్వాల ఎంపీపీ ప్రతాప్ గౌడ్, ఎంపీపీలు జడ్పిటిసిలు ఎంపీటీసీలు సర్పంచులు పాల్గొన్నారు.

Advertisement

Next Story