Theft :బంగారం షాప్ లో భారీ చోరీ..

by Kalyani |
Theft :బంగారం షాప్ లో భారీ చోరీ..
X

దిశ, జడ్చర్ల : అర్ధరాత్రి షట్టర్ తాళాలు పగలగొట్టి బంగారం షాపులోని 10 లక్షల విలువ గల 10 కిలోల వెండి ఆభరణాలు రెండు తులాల బంగారు ఆభరణాలను దుండగులు దోచుకెళ్లిన ఘటన శుక్రవారం బాలనగర్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. చోరీకి పాల్పడుతున్న సమయంలో అదే దారి నుంచి ఇంటికి వెళ్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి చూడడంతో నిందితులు లాకర్ లో ఉన్న బంగారు ఆభరణాలను వదిలేసి పారిపోయారు. విషయం తెలిసిన మండల కేంద్రంలోని ప్రజలు, వ్యాపారాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. విషయం తెలిసిన మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ జానకి డి.ఎస్.పి వెంకటేశ్వర్లు ఘటన స్థలాన్ని పరిశీలించి క్లూస్ టీం తో ఆధారాలను సేకరించి విచారణ చేపట్టారు. బాలనగర్ మండల కేంద్రంలో జాతీయ రహదారికి అతి సమీపంలో రాజస్థాన్ కు చెందిన కేశవ్ రామ్ చౌదరి బంగారు ఆభరణాల జ్యువెలరీ షాప్ నిర్వహిస్తున్నాడు.

ఈ క్రమంలో గురువారం రాత్రి తన షాపులోనే 30 కేజీల వెండి ఆభరణాలను షాప్ లోని ఫ్రేమ్లలో ఉంచగా సుమారు 50 తులాల బంగారు ఆభరణాలను షాప్ లోని లాకర్లో భద్రపరిచి తన షాప్ కు ఉన్న డబల్ షట్టర్ ను లాక్ వేసి ఇంటికి వెళ్ళాడు. ఇదే క్రమంలో సుమారు రెండు గంటల ప్రాంతంలో 4 గురు దుండగులు షాప్ వద్దకు వచ్చి తమ వద్ద తెచ్చుకున్న ఎలక్ట్రికల్ కట్టర్ ల ద్వారా షట్టర్ తాళాలను విరగ్గొట్టి షాప్ లోకి చొరబడి షాప్ లో ఉన్న అభరణాల ఫ్రేమ్లను తమ వెంట తెచ్చుకున్న బ్యాగులలోకి వేసుకున్నారు. ఇదే క్రమంలో బాలనగర్ మండల కేంద్రానికి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి తన విధులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా షాప్ వద్ద షెటర్ పగలగొట్టి ఉండడంతో పాటు ఓ వ్యక్తి నిలిచి ఉండడాన్ని చూసి అతని దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేశాడు. అతడు సాఫ్ట్వేర్ ఉద్యోగిని బెదిరించడంతో కొంత దూరం వెళ్లి 100 ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాడు.

తమను ఓ వ్యక్తి గమనించారని అతడు పోలీసులకు సమాచారం అందిస్తే తమ దొరికిపోయే ప్రమాదం ఉందనే ఆందోళనలో నలుగురు నిందితులు గాబరా గాబరాగా ఆభరణాలను తమ బ్యాగులో వేసుకొని షట్టర్ నుండి బయటికి వచ్చి పక్కనే ఉన్న మరో కిరాణం యజమాని కారును తమ వద్ద తెచ్చుకున్న తాళాల ద్వారా ఓపెన్ చేసి వాటిని తీసుకొని అక్కడి నుంచి పారిపోయారు. లేకుంటే షాప్ లోని లాకర్లో భద్రపరిచిన యాభై తులాల బంగారు ఆభరణాలు కూడా దుండగులు ఎత్తుకుపోయేవారని పోలీసులతో పాటు షాపు యజమాని అభిప్రాయపడ్డారు. 100 కు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని చూసేవరకు షాప్ ధ్వంసమై ఉందని అప్పటికే నిందితులు పారిపోయారని పోలీసులు తెలిపారు. నిందితులు కారును రాజాపూర్ మండల కేంద్ర సమీపంలో వదిలి వెళ్లారు.

చోరీ ఘటన సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది డీఎస్పీ వెంకటేశ్వర్లు

బాలనగర్ మండల కేంద్రంలో జువెలరీ షాప్ లో చోరీ ఘటన షాప్ లోని సిసి ఫుటేజ్ లో రికార్డయిందని, సీసీ ఫుటేజీలు వివిధ టోల్గేట్ల వద్ద సీసీ ఫుటేజ్ లను పరిశీలించి నిందితుల కొరకు గాలిస్తున్నామని, ఎట్టి పరిస్థితులైన త్వరలోనే నిందితులను పట్టుకుంటామని, ఈ ఘటనపై జ్యువెలరీ షాప్ యజమాని కేశవరం చౌదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు డీఎస్పీ తెలిపారు.



Next Story