Jurala : కృష్ణమ్మ ఉగ్రరూపం…జూరాలకు భారీగా వస్తున్న వరద

by Kalyani |
Jurala : కృష్ణమ్మ ఉగ్రరూపం…జూరాలకు భారీగా వస్తున్న వరద
X

దిశ,గద్వాల: మహారాష్ట్ర, కర్ణాటక ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో పాటు కర్ణాటక జలాశయాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో జూరాల వరద కృష్ణమ్మా ఉగ్రరూపం దాల్చింది. ‌కృష్ణా బేసిన్‌లో కురుస్తున్న భారీ వర్షాలతో కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్‌ ప్రాజెక్టులకు వరద పోటెత్తుతున్నది. దీంతో కర్ణాటకు జలాశయాల నుంచి భారీగా వరద నీరు జూరాల జలాశయానికి అక్కడి అధికారులు విడుదల చేస్తున్నారు. గురువారం రాత్రి కర్ణాటకలోని ఆల్మట్టి డ్యాంకు ఇన్‌ఫ్లో 2.04 లక్షల క్యూసెక్కులు ఉండగా అవుట్‌ఫ్లో 2.75లక్షల క్యూసెక్కులుగా నమోదైంది. ఆల్మట్టి సామర్థ్యం 129.72 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుతం 86.08 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. నారాయణపూర్‌ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 2.70 లక్షల క్యూసెక్కులు ఉండగా, అవుట్‌ఫ్లో 2.70 లక్షల క్యూసెక్కులు నమోదైంది. నారాయణపూర్‌ సామర్థ్యం 33.13 టీఎంసీలకుగానూ 26.584 టీఎంసీలు నిల్వ ఉన్నాయి.

కర్ణాటక జలాశయాల నుంచి

జూరాలకు 2,27,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు కాగా జూరాల‌ 46 గేట్ల తెరిచి దిగువకు 2,25,354 క్యూసెక్కులు వదిలారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 6.065 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. విద్యుత్ ఉత్పత్తికి 19,516 క్యూసెక్కులు వినియోగిస్తున్నారు. నెట్టెంపాడు ఎత్తిపోతలకు 750 క్యూసెక్కులు, భీమా లిఫ్ట్‌-1కు 1,300 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 820, కుడి కాలువకు 453 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తం జూరాల నుంచి 2,48,231 క్యూసెక్కులు వరద నీరు‌ దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల కు వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుండటంతో అధికారులు అప్రమతమై ప్రాజెక్టు కు వస్తున్న వరదను అలాగే దిగువకు విడుదల‌ చేస్తున్నారు. కాగా మరో వారం రోజుల పాటు వరద ప్రవాహం ఇలాగే కొనసాగే అవకాశాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. జూరాల ప్రాజెక్టు నుంచి దిగువకు నీటిని‌ విడుదల చేస్తుండటంతో లోతట్టు,నది పరిహార ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.



Next Story