వేలం వేసిన భూమిని తీసుకోవడమే తప్పా...

by Sridhar Babu |
వేలం వేసిన భూమిని తీసుకోవడమే తప్పా...
X

దిశ, అలంపూర్ : ప్రభుత్వం వేలం వేసిన భూమిని కొనడమే తప్పయిందా... అలాంటప్పుడు ఎందుకు వేలంపాట వేశారో చెప్పాలని ఓ రైతు అధికారులను నిలదీశాడు. తనకు న్యాయం జరిగే వరకు సొసైటీ కార్యాలయం తెరవనిచ్చేది లేదని శనివారం సొసైటీ కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల పరిధిలోని పెద్దపోతుపాడు గ్రామశివారులో సహకార సొసైటీ కార్యాలయం స్వాధీనంలో ఉన్న సర్వే నెంబర్ 76A6,75Aలో మూడు ఎకరాల భూమిని అందరి ముందు బహిరంగ వేలం పాట నిర్వహించారు. సొసైటీ కార్యాలయానికి రుణం చెల్లించకుండా ఎన్నో రోజులు వాయిదాలు వేసుకుంటూ బాకీ పడటంతో ఆ భూమిని బహిరంగ వేలం వేశారు. దీంతో చాలామంది రైతులు వేలంపాటలో పాల్గొన్నారు. మనోడు మండల కేంద్రానికి చెందిన సాయిబాబా అనే రైతు ఎకరాకు 12 లక్షల పదివేల రూపాయలను చెల్లించి ఆ భూమిని వేలంపాటలో దక్కించుకున్నాడు. వేలం పాట దక్కించుకున్న ఆ రైతుకు అధికారుల సమక్షంలో రిజిస్ట్రేషన్ కూడా చేసి ఇచ్చారు.

కానీ ఆ భూమిలో పంటవేయగా సొసైటీకి బాకీపడిన రైతు మాత్రం అది తనదంటూ పదేపదే దున్నడం, రాజకీయ నాయకులను తీసుకురావడంతో మండలంలోని అధికారులు కూడా చేతులెత్తేశారు. సుమారు రూ.40 లక్షలు పెట్టి మూడు ఎకరాలు కొన్న తనకు న్యాయం జరగడం లేదని, అలాంటి సమయంలో వేలం పాట ఎందుకు వేశారని మండిపడ్డాడు. తనకు న్యాయం జరిగే వరకు సొసైటీ కార్యాలయాన్ని తెరవనిచ్చేది లేదని భీష్మించుకు కూర్చున్నాడు. తాను ఎవరినీ బెదిరించి భూమిని కొనలేదని, జిల్లా అధికారుల ఉత్తర్వుల మేరకు బహిరంగ వేలం వేసిన భూమినే కొన్నానని వాపోయాడు.

బాధిత రైతు ప్రతిసారీ అడ్డుకోవడం ఏమిటని సొసైటీ చైర్మన్ శ్రీధర్ రెడ్డిని, కార్యదర్శి ప్రభాకర్ ను రైతు సాయిబాబా నిలదీశాడు. చేతకానప్పుడు బహిరంగ వేలం వేయడం ఎందుకని, తనలాంటి రైతులతో ఇలా డబ్బులు కట్టించుకుని తిప్పుకోవడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశాడు. దాంతో సంఘటనా స్థలానికి స్థానిక పోలీసులు చేరుకొని సాయిబాబాకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తాళం వేయడం సరికాదని, ఏదైనా ఉంటే పై అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అయినా బాధిత రైతు వినిపించుకోలేదు. బాధితుడికి నచ్చజెప్పేందుకు వారు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు.

Advertisement

Next Story