ఆ నలుగురిలో.. ఎవరు?

by Anjali |
ఆ నలుగురిలో.. ఎవరు?
X

దిశ బ్యూరో, మహబూబ్ నగర్: ఉమ్మడి పాలమూరు జిల్లాలో మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానిది ప్రత్యేక స్థానం.. ఈ స్థానం నుంచి ఊహించని ఫలితాలు రావడం ఆనవాయితీగా వస్తోంది. మహబూబ్ నగర్ నియోజకవర్గంలో బీజేపీ వైపు మొగ్గు చూపే పట్టణ ప్రజలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు సీనియర్ నేతలతో పాటు.. కొత్తగా పార్టీలో చేరిన నేతలు సైతం ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ స్థానం నుంచి మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి పేర్లు మొదట్లో ఎక్కువగా వినిపించాయి. వీరి ఇద్దరిలో ఒకరు తప్పనిసరిగా పోటీ చేస్తారని ఆ పార్టీ వర్గాలు ప్రచారం చేశాయి. రాజకీయ పరిణామాలు నేపథ్యంలో నేతలు తమ ఆలోచనల విధానాలను మార్చుకుంటున్నారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బలమైన నేతలను బరిలోకి దించితే ప్రయోజనం ఉంటుందన్న నేపథ్యంలో ఎంపీలు, మాజీ ఎంపీలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, పట్టు ఉన్న మాజీ ఎమ్మెల్యేలను రంగంలోకి దించడం ద్వారా పార్టీకి ప్రయోజనాలు కలుగుతానేన్న ఉద్దేశంతో వారిని పోటీలోకి దించాలని పార్టీ సూచనప్రాయంగా నిర్ణయించింది. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మహబూబ్ నగర్ కాకుండా తాను గతంలో ప్రాతినిధ్యం వహించిన గద్వాల నుంచి పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

ఈ కారణంగానే ఆమె ఈ మధ్య ఎక్కువ సమయాన్ని అదే నియోజకవర్గంలో ప్రచార కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. ఇప్పటివరకు పలుమార్లు ఎంపీగా పోటీ చేసిన జితేందర్ రెడ్డి ఈసారి అధిష్టానం పోటీ చేయమని ఆదేశిస్తే తప్పనిసరిగా మహబూబ్ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఆయన ముఖ్య నాయకులు కార్యకర్తలతో అడపదడప సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆదివారం ఒక టీవీలో నిర్వహించిన ముఖాముఖిలోనూ జితేందర్ రెడ్డి అధిష్టానం ఆదేశిస్తే తప్పనిసరిగా మహబూబ్ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు.

మాజీ మంత్రి చూపు మహబూబ్ నగర్ వైపు..

ఇది ఇలా ఉండగా మాజీ మంత్రి పి చంద్రశేఖర్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఉద్దేశంతో అడుగులు ముందుకు వేస్తున్నారు. అధికార పార్టీపై విరుచుకుపడుతూ మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అలాగే.. కాంగ్రెస్ నుంచి ఆ మధ్య బీజేపీలో చేరిన ఎన్పీ వెంకటేష్ ఎన్నికల్లో పోటీ చేయాలనే తలంపుతోనే పార్టీ మారారు. సామాజిక సమీకరణలు, తదితర కారణాలతో తనకు అవకాశం దక్కుతుందన్న ఆశాభావంతో ఆయన ఉన్నారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాసరెడ్డి సైతం మహబూబ్ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి, ఉన్న పరిచయాలు తనకు కలిసి వస్తాయని ఆశిస్తున్నాడు. మొత్తం పై ఈ నలుగురిలో ఒకరు తప్పనిసరిగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీలో ఉండటం ఖాయం అని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.

సర్వేలతోనే ఖరారు..

భారతీయ జనతా పార్టీ వచ్చే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. పరిచయాలు, హంగామాలు కాకుండా ఎవరు పోటీలో ఉంటే విజయం సాధించ గలుగుతారు. పోటీ చేసే అభ్యర్థికి కలిసి వచ్చే అంశాలు ఏమిటి.. కలిగే ఇబ్బందులు ఏమిటి ..? అన్న అంశాలను పరిగణలోకి తీసుకొని అభ్యర్థులను ఎంపిక చేయనుంది. సర్వేల ప్రకారం ఈ నలుగురిలో ఎవరు అయితే అధికార పార్టీని ఢీకొని విజయం సాధించ గలుగుతారు అని ఆలోచించి అభ్యర్థిని ప్రకటిస్తారు అని పార్టీ శ్రేణులు అంటున్నాయి.

Advertisement

Next Story