ధరణిలో దరఖాస్తుకు ముందే అవగాహన కల్పించాలి..

by Sumithra |
ధరణిలో దరఖాస్తుకు ముందే అవగాహన కల్పించాలి..
X

దిశ, మహబూబ్ నగర్ : భూములకు సంబంధించి రైతులు ధరణిలో దరఖాస్తు చేసుకునే ముందే అన్ని దృవపత్రాలు జతచేసుకునే విధంగా వారికి అవగాహన కలిగించాలని జిల్లా కలెక్టర్ జి.రవి నాయక్ అన్నారు. గురువారం ఆయన కలెక్టర్ కార్యాలయంలోని తన ఛాంబర్ నుండి రెవెన్యూ అధికారులు, తహసీల్దార్ లతో విడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఆదేశించారు. జీఓ నెంబర్లు 58, 59ల కింద క్రమబద్ధీకరించే గడువును ప్రభుత్వం మరో నెల రోజులు పొడిగించిన దృష్ట్యా రైతులు, ప్రజల్లో అవగాహన కలిగించాలని, అసంపూర్తి దరఖాస్తులను తిరస్కరించడంతో పాటు, ఆ విషయాన్ని రైతులకు స్పష్టంగా తెలియజేసి తిరిగి వారు దరఖాస్తు చేసుకునేలా తెలపాలని ఆయన సూచించారు. మీ-సేవ కేంద్రాలలో పూర్తి స్థాయివివరాలు లేని దరఖాస్తులను అప్ లోడ్ చేయరాదని మీ-సేవ కేంద్రాల యజమానులను ఆదేశించాల్సిందిగా ఈడీఎం చంద్రశేఖర్ ను ఆయన ఆదేశించారు. మిస్సింగ్ సర్వే నెంబర్, ఎక్సటెంట్ కరెక్షన్ విషయాల్లో పూర్తి జాగ్రత్తలు వహించాలని తెలిపారు.

భూముల సర్వేకై చేసుకున్న దరఖాస్తులు పెండింగ్ లో లేకుండా ఆయా సర్వేయర్లకు ఇచ్చిన పని ఆధారంగా ఒక మండలం నుండి ఇంకో మండలానికి పనిచేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ కమీషన్ కు సంబంధించిన నివేదికల సమర్పణలో ఇక ఏమాత్రం అలసత్వం కాని, జ్యాపం కాని చేయరాదని ఆయన హెచ్చరించారు. తహసిల్దార్లు తమ పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేయాలని, ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రానికి ధాన్యం శుభ్రపరచే యంత్రాలు, టార్పాలిన్లు, ఇచ్చారని అన్నారు. ఆయా కేంద్రాలకు అవి చేరింది, లేనిది తనకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పట్టణ, గ్రామీణ గృహ నిర్మాణం లబ్ధీదారుల వివరాల అప్లోడింగ్ వేగవంతం చేయాలని అన్నారు. ఇసుక జరిమానాలకు సంబంధించి వసూలైన మొత్తాన్ని చెక్కుల రూపంలో జిల్లా కలెక్టర్ కార్యాలయానికి పంపించాలని ఆదేశించారు. ఈ కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ సీతారామారావు, ఆర్డీఓ అనిల్ కుమార్, ఏఓ శంకర్, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడి కిషన్ రావు, మైన్స్ ఏడి విజయ్ కుమార్, హౌసింగ్ ఈఈ భాస్కర్, తసిల్దార్లు తదితర అధికారులు పాల్గొన్నారు.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story

Most Viewed