రూ.9 లకే చీర అంటూ చీప్ పబ్లిసిటీ.. మండుటెండలో సైతం ఎగబడిన జనం

by Kalyani |
రూ.9 లకే చీర అంటూ చీప్ పబ్లిసిటీ.. మండుటెండలో సైతం ఎగబడిన జనం
X

దిశ ప్రతినిధి వికారాబాద్ : రూ.9 కే చీరా అనడంతో వేల సంఖ్యలో మహిళలు తరలి రావడంతో షాపింగ్ మాల్ ముందు గందరగోళం ఏర్పడి చివరికి మహిళలు గొడవకు దిగిన సంఘటన వికారాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే వికారాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం ఒక ప్రముఖ షాపింగ్ మాల్ ఓపెన్ అయ్యింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ తార అనసూయ, స్పీకర్ స్థానిక ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ లు వచ్చి షాపింగ్ మాల్ ను ప్రారంభించారు. ఇక్కడి వరకు బాగానే ఉన్న చీప్ పబ్లిసిటీ కోసం ఆరాటపడిన సదురు షాపింగ్ మాల్ నిర్వాహకులు రూ.9 కే చీర అంటూ దిగజారుడు పబ్లిసిటీకి పాల్పడ్డారు. అది కూడా ఒక్కరోజు మాత్రమే అని ఊరూరూ తిరిగి ఆటోలద్వారా మహిళలను పెట్టి పబ్లిసిటీ చేశారు. ఇంకేముంది ఉదయం 6 గంటలకే జిల్లాలోని అనేక గ్రామాలకు చెందిన మహిళలు షాపింగ్ మాల్ దగ్గరకు చేరుకొని క్యూ కట్టారు. ఉదయం 10 గంటలకు షాపింగ్ మాల్ ఓపెన్ చేసిన ముఖ్య అతిధులు వచ్చేవరకు శారీలు ఇవ్వలేదు. 12 గంటలు అవుతుండగా బారి ఎండలో చీరాల పంపిన మొదలు పెట్టారు. అప్పటికే వేల సంఖ్యలో అక్కడికి చేరిన మహిళలను కంట్రోల్ చేయడం పోలీసులకు కూడా సాధ్యం కాలేదు.

వికారాబాద్ జిల్లా ప్రజలే కాకుండా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, శంకర్ పల్లి మండలాల ప్రజలు కూడా భారీ ఎత్తున రావడంతో వికారాబాద్ పట్టణంలో ఎక్కడ చూసిన మహిళలే కనిపించారు. ఉచిత బస్సు సౌకర్యం ఉండడంతో ఏ బస్సు చూసిన మహిళలతో నిండిపోయింది. దాంతో దాదాపు 3000 మందికి మాత్రమే చీరలు ఇచ్చిన నిర్వాహకులు చీరలు అయిపోయాయని చేతులెత్తేశారు. చీరలు ఇచ్చే వరకు ఇక్కడి నుంచి వెళ్ళేది లేదని మహిళలు షాపింగ్ మాల్ ముందే నిలబడ్డారు. కొద్దిసేపు ఒక గ్రౌడ్ లోకి మహిళా లందరిని తీసుకెళ్లి చీరలు ఇవ్వగా అక్కడ ఒకరిపై ఒకరు పడి కొట్టుకునే పరిస్థితి ఏర్పడింది. కొందరు మహిళలు అస్వస్థతకు గురికాగా, కొందరి బంగారు ఆభరణాలు పోయాయని లబోదిబో మన్నారు. అయినా కూడా కొందరు మహిళలు రాత్రి 7 గంటల వరకు షాపింగ్ మాల్ ముందునుండి కదలలేదు. దాంతో చేసేది లేక చివరికి షాపింగ్ మాల్ మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినా మహిళలు అక్కడి నుంచి వెళ్లకపోవడంతో సహనం కోల్పోయిన పోలీసులు లాఠీ ఛార్జ్ చేస్తామని, లేదంటే పోలీస్ స్టేషన్ కు తరలిస్తామని భయపెట్టి అక్కడి నుండి తరిమేశారు.

షాఫింగ్ మాల్ కు సెక్యూరిటీ గార్డుల డీఎస్పీ..!

రూ.9 కే చీర అనగానే వేల సంఖ్యలో మహిళలు తరలి వస్తారని ఊహించని యాజమాన్యం సరైన బందోబస్తు ఏర్పాటు చేయలేదు. పైగా ఒకే కౌంటర్ ఏర్పాటు చేయడంతో తొక్కిసలాట జరిగింది. కొందరు మహిళలు చిన్న పిల్లలను ఎత్తుకొని రావడంతో ఊపిరాడక అనేక ఇబ్బందులు పడ్డారు. దాంతో వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి షాపింగ్ మాల్ ముందు సెక్యూరిటీ గార్డుల పనిచేశారని విమర్శలు వినిపించాయి. పోలీస్ స్టేషన్ ను గాలికి వదిలేసిన వికారాబాద్ పోలీసులు అందరూ షాపింగ్ మాల్ కు కాపలా ఇవ్వడం విశేషం. డీఎస్పీ స్థాయి వ్యక్తి ముఖ్యమైన కేసులను వదిలి షాపింగ్ మాల్ కు కాపలా కాయడం ఏంటని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకు రూ.9 చీర ఇవ్వడానికి షాపింగ్ మాల్ యజమానులు పోలీసుల నుంచి అనుమతి తీసుకున్నారో లేదో తెలియదు. ఒకవేళ ఇచ్చిన వారు ఎందుకు ఇచ్చారో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే వికారాబాద్ పోలీస్ స్టేషన్ కు వచ్చిన బాధితులు స్టేషన్ లో పోలీసులు ఎవరు కూడా అందుబాటులో లేకపోవడంతో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు స్టేషన్ ముందు పడిగాపులు కాసి పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసి ఇంటికి వెళ్ళిపోయినా పరిస్థితి ఏర్పడింది.

Next Story