- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
పల్లాపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు

దిశ, వరంగల్ బ్యూరో : కేసీఆర్ చుట్టూ కుక్కలా తిరిగిన పల్లా రాజేశ్వర్ రెడ్డి అధికారాన్ని, కేసీఆర్ ను అడ్డం పెట్టుకొని అక్రమంగా వందల కోట్ల ఆస్తులు సంపాదించాడని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ధ్వజమెత్తారు. అవినీతి, అక్రమాలతో అడ్డగోలుగా సంపాదించిన పైసల బలుపుతో పల్లా రాజేశ్వర్ రెడ్డి, అజ్ఞానంతో తాటికొండ రాజయ్య తనపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని అన్నారు.
జనగామ జిల్లా చిల్పూర్ మండలం చిన్నపెండ్యాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీని భ్రష్టుపట్టించిదే పల్లా రాజేశ్వర్ రెడ్డి అంటూ ఆరోపించారు. జనగామలో నీ గెలుపు ఏ రకంగా వచ్చిందో అందరికీ తెలుసని అన్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ కే కర్రు కాల్చి వాత పెట్టారని, మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో వచ్చిన మెజారిటీనే దానికి నిదర్శనమని తెలిపారు. అధికారం కోల్పోయాక కూడా విర్రవీగుడు తగ్గలేదని, వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హెచ్చరించారు. అక్రమాలకు, అవినీతికి పాల్పడిన పల్లా లాంటి దిగజారి బతికే వారికి నాపై విమర్శలు చేస్తే అర్హత లేదని అన్నారు.
అభివృద్ధిపై చర్చకు సిద్ధం
స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ అభివృద్ధికి రూ.800 కోట్ల నిధులు మంజూరుకు తీసుకువచ్చిన పనులకు సంబంధించిన జీవోలను కూడా ప్రజలందరి ముందు ఉంచానని కడియం తెలిపారు. నియోజకవర్గ చరిత్రలో ఏనాడూ లేని విధంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయించినట్లు వెల్లడించారు.
శంకుస్థాపన చేసిన వాటికి టెండర్లు పూర్తయి పనులు ప్రారంభం అవుతున్నాయని తెలిపారు. సీఎం శంకుస్థాపన చేసిన 29 శిలా ఫలకాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలిపేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. అభివృద్ధి నిధులకు సంబంధించి తాను చెప్పిన మాటలు అబద్దం అని నిరూపిస్తే ప్రజలకు క్షమాపణ చెబుతానని, నిజమని తేలితే నువ్వు క్షమాపణ చెబుతావా అంటూ పల్లాకు సవాల్ విసిరారు.
ఆయనకు దేవాదుల తల తోక కూడా తెలియదు
దేవాదుల ప్రాజెక్టు తల ఎక్కడ ఉందో తోక ఎక్కడ ఉందో తెలియని వాళ్లు కూడా దేవాదుల తెచ్చింది తానేనంటూ మాట్లాడుతున్నారంటూ మాజీ ఎమ్మెల్యే రాజయ్యనుద్దేశించి ఎద్దేవా చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో నీటి పారుదల శాఖ మంత్రిగా దేవాదులకు రూపకల్పన చేసిందే తాను అని, ఆనాడు దేవాదుల నిర్మాణం దేవుని వల్ల కూడా కాదని పిండ ప్రదానాలు కూడా చేశారని అన్నారు.
ఇప్పుడు అదే దేవాదుల స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ వర ప్రదాయిని అయిందని తెలిపారు. గత 15 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉండి నియోజకవర్గాన్ని, అభివృద్ధిని ఏనాడూ పట్టించుకోలేదని రాజయ్యను ఉద్దేశించి అన్నారు. పైగా అవినీతి, అక్రమాలకు అడ్డాగా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గాన్ని మార్చాడని ఆరోపించారు. పదవులు, పథకాలు అమ్ముకునుడు, తాగుడు, తినుడు, ఎగురుడు, దూకుడే పనిగా మార్చుకున్నాడని అన్నారు. ఇలాంటి వాళ్లు చేసే విమర్శలను పట్టించుకోనని తెలిపారు.
నా ఎజెండా నియోజకవర్గ అభివృద్ధి
నా ఎజెండా నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యలను పరిష్కరించడం మాత్రమేనని కడియం తెలిపారు. అంతే కానీ ప్రజలకు నష్టం కలిగించే పనులు ఏనాడూ చేయనని స్పష్టం చేశారు. నాకున్న ఏకైక సంకల్పం నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే అన్నారు. నియోజకవర్గంలోని ప్రతి ఎకరానికి సాగు నీరు అందించాలని, ప్రజల కష్ట సుఖాలలో పాలుపంచుకొని వారి రుణం తీర్చుకోవడమే తన లక్ష్యం అన్నారు. సమావేశంలో మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.