ఏఐసీసీని తాకిన ‘మాదిగ’ సెగ.. ఆ రెండు టికెట్లు కావాలని డిమాండ్

by GSrikanth |
ఏఐసీసీని తాకిన ‘మాదిగ’ సెగ.. ఆ రెండు టికెట్లు కావాలని డిమాండ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: పార్లమెంటు ఎన్నికల సమయంలో మాదిగ సామాజికవర్గం నుంచి కాంగ్రెస్ నేతలకు నిరసన సెగ తగులుతున్నది. మొత్తం 17 స్థానాల్లో ఇప్పటికి 13 చోట్ల అభ్యర్థుల్ని ప్రకటించిన కాంగ్రెస్ హైకమాండ్ వరంగల్ (ఎస్సీ) స్థానానికి అభ్యర్థిని ప్రకటించకుండా పెండింగ్‌లో పెట్టింది. ఈ సీటును మాదిగ కమ్యూనిటీ అభ్యర్థికే ఇవ్వాలని ఆ సామాజికవర్గానికి చెందిన కార్యకర్తలు పార్టీ నాయకత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం ముందు గురువారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. పిడమర్తి రవి మద్దతుదారులు పదుల సంఖ్యలో ఏఐసీసీ ముందు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నాయకత్వంపై ఒత్తిడి తెచ్చారు. వరంగల్ ఎంపీ స్థానంతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు కూడా మాదిగ కమ్యూనిటీ అభ్యర్థికే టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు.

ఇప్పటివరకూ గాంధీభవన్‌లో రాష్ట్ర నాయకత్వంపై ఒత్తిడి తెచ్చిన ఈ కమ్యూనిటీ కాంగ్రెస్ కార్యకర్తలు రాషట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీని కూడా కలిసి డిమాండ్ చేశారు. తాజాగా ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయాన్ని నిరసనలకు వేదికగా మల్చుకున్నారు. రాష్ట్రంలో మాలలకంటే మాదిగల జనాభా ఎక్కువ ఉన్నదని, రెండు ఎంపీ స్థానాలను కేటాయించాల్సి ఉన్నా నిర్లక్ష్యం జరిగిందని ఆరోపించారు. జనాభాకు అనుగుణంగా టికెట్ల కేటాయింపు జరగాలన్నారు. పెండింగ్‌లో ఉన్న వరంగల్ సీటును, కంటోన్మెంట్ స్థానాన్ని మాదిగలకే ఇవ్వాలని వారు నినాదాలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed