Local Elections: ‘లోకల్’ కన్‌ఫ్యూజన్..! ఈసీ నుంచి అందని ఓటర్ల జాబితా

by Shiva |
Local Elections: ‘లోకల్’ కన్‌ఫ్యూజన్..! ఈసీ నుంచి అందని ఓటర్ల జాబితా
X

దిశ, తెలంగాణ బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సస్పెన్స్ కంటిన్యూ అవుతున్నది. వీలైనంత తొందరగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలంటూ స్టేట్ బీసీ కమిషన్, రాష్ట్ర ఎన్నికల సంఘం, పంచాయతీరాజ్ శాఖ అధికారులకు సీఎం రేవంత్ గత నెల 26న స్పష్టం చేశారు. సుదీర్ఘంగా రివ్యూ నిర్వహించి ఎక్కడెక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఆరా తీశారు. స్థానిక సంస్థలకు తగినట్లుగా వారం రోజుల్లోనే ఓటర్ల జాబితా రూపొందించాలని ఆదేశించారు. రిజర్వేషన్లపై వీలైనంత తొందరగా నివేదిక ఇవ్వాలని బీసీ కమిషన్‌ను ఆదేశించారు. కానీ కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఇప్పటివరకు పోలింగ్ బూత్‌లవారీ ఓటర్ల జాబితా రాకపోవడంతో గందరగోళం నెలకొన్నది. వారం రోజుల్లోనే జాబితా వస్తుందనే అంచనా ఉన్నా రెండు వారాలు దాటినా రాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో కసరత్తు ప్రారంభమే కాలేదు.

రిజర్వేషన్ల ఖరారుకు రూపొందిన ప్రశ్నావళి

‘స్థానిక’ ఎన్నికలకు గతంలో రూపొందించిన ఫార్ములా ఫిక్స్ చేసినా రిజర్వేషన్ల శాతాన్ని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈసారి కొత్తగా ఖరారు చేయాల్సి ఉంటుందని రాష్ట్ర బీసీ కమిషన్ గతంలోనే స్పష్టత ఇచ్చింది. క్షేత్రస్థాయిలో బీసీల ఆర్థిక, సామాజిక స్థితిగతులు, వారి వెనకబాటుతనం, జనాభాలో వచ్చిన మార్పులు తదితరాలపై అన్ని స్థానిక సంస్థల పరిధిలో అధ్యయనం చేసిన తర్వాత రిజర్వేషన్ల శాతాన్ని ఖరారు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం గతంలో 53 అంశాలతో ఒక ప్రశ్నావళి తయారుచేసినా ఈసారి మరో మూడింటిని అదనంగా చేర్చి రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. బీసీ సంఘాలు, ప్రజా సంఘాలతో మాట్లాడిన తర్వాత ఈ ప్రశ్నావళి ఖరారైంది. వీటినే సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా, సెంటర్ ఫర్ సోషల్ డెవలప్‌మెంట్ లాంటి సంస్థలకు కూడా పంపింది.

ఆఫీసర్ల సహకారం లేదని బీసీ కమిషన్ అసంతృప్తి

ప్రజాభిప్రాయాన్ని సేకరించేందుకు జిల్లాల కలెక్టర్ల మొదలు వివిధ స్థాయిల్లోని ప్రభుత్వ సిబ్బంది సభల నిర్వహణకు ప్లాన్ చేయాల్సి ఉంటుంది. పలుమార్లు లేఖలు పంపినా అధికారుల నుంచి తగిన సహకారం లేదని బీసీ కమిషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టకుండా రిజర్వేషన్లను తేల్చలేమని పేర్కొన్నది. ఇదే విషయమై అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎంను కలిసిన సందర్భంగా బీసీ కమిషన్ చైర్మన్ వివరించినట్టు తెలిసింది. ఎన్నికల సంఘం నుంచి బూత్‌లవారీ ఓటర్ల జాబితాకు, బీసీ కమిషన్ చేపట్టాల్సిన ప్రజాభిప్రాయ సేకరణ ప్రోగ్రామ్‌కు సంబంధం లేకుండా సమాంతరంగా జరగవచ్చన్నది బీసీ కమిషన్ వాదన. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై గత నెల 26న సీఎం రివ్యూ చేసిన వెంటనే ఫీల్డ్ స్టడీ ప్రారంభమైతే బాగుండేదని అభిప్రాయపడింది.

‘స్థానిక’ ఎలక్షన్స్ జాప్యమయ్యే చాన్స్

ఒకవైపు కేంద్ర ఎలక్షన్ కమిషన్ నుంచి పోలింగ్ బూత్‌లవారీగా ఓటర్ల జాబితా రాకపోవడం, మరోవైపు బీసీల ఆర్థిక, సామాజిక స్థితిగతులపై రాష్ట్ర బీసీ కమిషన్ ఫీల్డ్ స్టడీ మొదలుపెట్టకపోవడంతో స్థానిక సంస్థల ఎన్నికలు జాప్యమయ్యే అవకాశమున్నదనే వాతావరణం నెలకొన్నది. రిజర్వేషన్లను ఖరారు చేయాల్సిన రాష్ట్ర బీసీ కమిషన్ పదవీకాలం ఆగస్టు 31తో ముగుస్తున్నది. ఆ లోపే రిజర్వేషన్ కొలిక్కి వస్తే బాగుండేదని, ఇప్పటికింకా ప్రక్రియ మొదలుకాకపోవడంతో ఆలస్యమయ్యే అవకాశమున్నది. రాష్ట్ర ప్రభుత్వం కొత్త బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేసినా అవగాహన చేసుకుని కార్యాచరణ మొదలుపెట్టడానికి కొంత సమయం పడుతుందని, ఈ చిక్కుల కారణంగా వెంటనే ప్రాసెస్ మొదలుపెట్టినా దాదాపు రెండు నెలల కంటే ఎక్కువ టైమ్ పట్టవచ్చన్నది కమిషన్ వాదన.

రిజర్వేషన్ ఫార్ములా ఫైనల్ బిగ్ టాస్క్

ఒకవైపు కేంద్ర ఎలక్షన్ కమిషన్ నుంచి ఓటర్ల జాబితా అందడం, మరోవైపు స్టేట్ బీసీ కమిషన్ రిజర్వేషన్ శాతాన్ని ఖరారు చేయడం, వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న తర్వాత ప్రభుత్వం ఒక స్పష్టతకు రావాల్సిన అనివార్యత.. ఇవన్నీ పూర్తయిన తర్వాత రాష్ట్ర ఎలక్షన కమిషన్ పోలింగ్ షెడ్యూలును ఖరారు చేస్తుంది. షెడ్యూలు విడుదల మొదలు రిజల్టు వరకు మొత్తం రెండు వారాల్లోనే పూర్తిచేసే వెసులుబాటు ఉన్నా కీలకమైన రిజర్వేషన్ ఫార్ములను ఫైనల్ చేయడమే అన్నింటికంటే పెద్ద టాస్క్ అన్నది అటు బీసీ కమిషన్, ఇటు పంచాయతీరాజ్ అధికారుల అభిప్రాయం. స్థానిక సంస్థల పదవీకాలం జనవరి 31తోనే ముగియడంతో ప్రస్తుతం స్పెషల్ ఆఫీసర్ల పాలనలో ఉన్నాయి. రోజువారీ నిర్వహణలో సమస్యలు వస్తున్నందున వీలైనంత తొందరగా పోలింగ్ కంప్లీట్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది.

స్థానిక ఎన్నికల నిర్వహణపై వివిధ విభాగాల మధ్య సమన్వయం సమస్యలు ఎలా ఉన్నా... వార్డు మెంబర్ మొదలు జడ్పీ చైర్మన్ వరకు అవకాశాల కోసం కాంగ్రెస్ కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. ఎమ్మెల్యేల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఇంకోవైపు కేంద్ర ఫైనాన్స్ కమిషన్ నుంచి గ్రాంట్ల విడుదలలో ఎదురయ్యే లీగల్ చిక్కులపైనా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఎక్కువ కాలం స్పెషల్ ఆఫీసర్ల పాలనలో ఉండకుండా వీలైనంత తొందరగా ఎన్నికలు నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి సుదీర్ఘంగా సమీక్ష చేసి వివిధ విభాగాలకు దిశానిర్దేశం చేసి పది రోజులైనా ఎలాంటి పురోగతి లేకపోవడం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న సీఎం ఈ నెల 14న హైదరాబాద్ చేరుకోగానే థర్డ్ ఫేజ్ రుణమాఫీ లాంచింగ్, గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు.. తదితరాలన్నీ పూర్తయిన తర్వాత స్థానిక ఎన్నికలపై స్పష్టత వచ్చే అవకాశమున్నది.

Advertisement

Next Story

Most Viewed