Congress: ఉగ్రదాడిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలి.. సీడబ్లూసీ భేటీలో కాంగ్రెస్ డిమాండ్

by vinod kumar |
Congress: ఉగ్రదాడిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలి.. సీడబ్లూసీ భేటీలో కాంగ్రెస్ డిమాండ్
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ కశ్మీర్‌లోని పహెల్గాం (Pahalgam) లో జరిగిన ఉగ్రదాడి యావత్ దేశాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే. ఈ దాడి నేపథ్యంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) గురువారం సమావేశమైంది. ఉగ్రదాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించిన కాంగ్రెస్.. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేసింది. పాక్ కుట్ర పన్నిన ఈ దాడి మన ప్రజాస్వామ్య విలువలపై ప్రత్యక్ష దాడి అని తెలిపింది. ఉగ్రవాదుల చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు వెల్లడించింది. ఉగ్రవాదులను వీలైనంత త్వరగా పట్టుకోవాలని దీనికి గాను కేంద్ర ప్రభుత్వం తన అధికారాలన్నింటినీ ఉపయోగించుకోవాలని సూచించింది. ఘటనకు దారి తీసిన ఇంటలిజెన్స్ వైఫల్యం, భద్రతా లోపాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని పేర్కొంది.

ఈ మేరకు ఉగ్రదాడిని ఖండిస్తూ సీడబ్లూసీ ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ‘ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోవడంపై సీడబ్లూసీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. మృతుల కుటుంబాలను ప్రగాఢ సానుభూతి తెలియజేస్తోంది. ఈ విషాద సమయంలో బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం. దేశంలో మనోభావాలను రెచ్చగొట్టడానికి హిందువులను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకున్నారు. ఈ టైంలో కాంగ్రెస్ శాంతి కోసం విజ్ఞప్తి చేస్తోంది’ అని తీర్మానంలో పేర్కొంది. ఐక్యత, అంకితభావం ద్వారా మాత్రమే ఉగ్రవాదాన్ని ఎదుర్కోగలమని తెలిపింది. భారత్‌లో లక్షలాది మంది యాత్రికులు ఉన్నారని వారి భద్రతను జాతీయ ప్రాధాన్యతగా పరిగణించాలని తీర్మానంలో పేర్కొంది.

ఈ విషాదాన్ని రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించింది. ఈ టైంలో ఐక్యతను ప్రదర్శించాల్సిన అవసరం ఉందని తెలిపింది. అంతకుముందు ఉగ్రవాద దాడిలో మరణించిన వారికి నివాళులర్పించడానికి కాంగ్రెస్ నాయకులు ఒక నిమిషం మౌనం పాటించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun karge), అగ్రనేతలు సోనియా గాంధీ (Sonia Gandhi), రాహుల్ గాంధీ (Rahul gandhi), సీనియర్ నేతలు జైరాం రమేష్, పవన్ ఖేరా, కేసీ వేణుగోపాల్ పాల్గొన్నారు.



Next Story

Most Viewed