వారినెలా అకామిడేట్ చేద్దాం.. చేరికల వేళ ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

by Prasad Jukanti |
వారినెలా అకామిడేట్ చేద్దాం.. చేరికల వేళ ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో:తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన ఖరారు అయింది. సోమవారం మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఒక ప్రైవేటు ఫంక్షన్ నిమిత్తం హస్తినాకు వెళ్తున్న రేవంత్ రెడ్డి.. కుదిరితే ఏఐసీసీ పెద్దలతో భేటీ అవుతారని తెలుస్తోంది. ముఖ్యంగా ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తో సమావేశమైన రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నట్లు సమాచారం. అయితే రాష్ట్రంలో ప్రధాన పార్టీలన్నీ పార్లమెంట్ ఎన్నికలపై గురిపెట్టిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన హాట్ టాపిక్ గా మారింది.

ఎంపీ టికెట్లపై డిస్కషన్:

ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి పలువురు నేతలు కాంగ్రెస్ లో చేరుతున్నారు. మరి కొంత మంది చేరేందుకు రెడీగా ఉన్నారని అదును కోసం ఎదురు చూస్తున్నారనే టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే వీరిలో కొంత మంది ఎంపీ టికెట్ ఆశిస్తున్నవారు ఉన్నారనే సమాచారం టీ కాంగ్రెస్ లో చర్చగా మారింది. దీంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు దక్కకపోయినా సర్దుకుపోయిన సొంత పార్టీ నేతల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. కొత్తగా వచ్చిన వారికి టికెట్ ఇస్తే తమ పరిస్థితి ఏంటి అనే విషయంలో రాష్ట్ర నాయకత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పార్టీలో ఇప్పటికే చేరిన వారిని, చేరబోతున్న వారిని ఎలా అకామిడేట్ చేద్దామనే విషయంలో కేసీ వేణుగోపాల్ తో రేవంత్ రెడ్డి చర్చించనున్నట్లు తెలుస్తోంది. పార్టీలో చేరిన కొందరికి లోక్ సభ ఎన్నికల్లో టికెట్ ఇచ్చే అంశంతో పాటు టికెట్ దక్కని అసంతృప్తులకు నామినేటెడ్ పోస్టులు ఇచ్చే అంశంపై కూడా చర్చించే సూచనలు కనిపిస్తున్నాయి.

మంత్రివర్గ విస్తరణపై ఫోకస్:

మరో వైపు రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణపై కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి తొలికేబినెట్ కూర్పులో రాష్ట్రంలోని నాలుగు ఉమ్మడి జిల్లాలకు ప్రాతినిధ్యం దక్కలేదు. నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి మంత్రులు ఎవరూ లేరు. హైదరాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థులెవరూ ఎమ్మెల్యేగా గెలవలేదు. మిగతా జిల్లాల్లో మాత్రం మంత్రి పదవి కోసం సీనియర్లు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల లోపు మంత్రి వర్గ విస్తరణ చేసి కేబినెట్ లో మిగతా జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పిస్తే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అదిపార్టీకి మరింత సానుకూలంగా మారే అవకాశం ఉందనే భావనతో ముఖ్యమంత్రి ఉన్నారని ఈ మేరకు ఈ అంశాన్ని సైతం అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లనున్నారనే ప్రచారం పొలిటికల్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. దీంతో మంత్రి వర్గ కూర్పులో ఎవరికి ఛాన్స్ దక్కనుందనే చర్చ జోరుగా జరుగుతోంది.

Advertisement

Next Story