శాసనసభా సమావేశాలు నిర్వహించి ‘నీట్’పై తీర్మానం చేయాలి: మాజీ ఎంపీ వినోద్ కుమార్

by Shiva |
శాసనసభా సమావేశాలు నిర్వహించి ‘నీట్’పై తీర్మానం చేయాలి: మాజీ ఎంపీ వినోద్ కుమార్
X

దిశ, తెలంగాణ బ్యూరో: నీట్ పేపర్ లీకేజీపై రాద్ధాంతం జరుగుతున్నా సీఎం రేవంత్‌రెడ్డి తనకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండటం సిగ్గు చేటని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి నీట్ రద్దు కోసం ఏకగ్రీవ తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ కోరారు. శుక్రవారం మీడియా ప్రకటన విడుదల చేశారు. నీట్‌పై దేశ వ్యాప్తంగా నిరసనలు ఉధృతం అవుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. నీట్‌ను రద్దు చేయాలంటూ తమిళనాడు అసెంబ్లీ చేసిన ఏకగ్రీవ తీర్మానాన్ని స్వాగతించారు.

నీట్ విషయంలో తమిళనాడు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు యావత్ దేశానికే ఆదర్శనీయంగా నిలుస్తుందని కొనియాడారు. నీట్ ద్వారా మెడికల్ కాలేజీల్లో ఇతర రాష్ట్రాల విద్యార్థులను చేర్చుకోకుండా రాష్ట్రానికి మినహాయింపు ఇవ్వాలని, గతం మాదిరిగానే ఎంసెట్ ఆధారంగానే మెడికల్ అడ్మిషన్లు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అనుమతినిచ్చేలా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని కోరారు. రాష్ట్రాల విన్నపాలను కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పడితే సుప్రీంను ఆశ్రయించి, రాష్ట్రాలు తమ హక్కులను సాధించుకోవాలని సూచించారు.



Next Story