NVSS Prabhakar : తెలంగాణలో నాయకత్వ మార్పిడి ఖాయం : మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

by Y. Venkata Narasimha Reddy |
NVSS Prabhakar : తెలంగాణలో నాయకత్వ మార్పిడి ఖాయం : మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : జార్ఖండ్, మహారాష్ట్ర ఎన్నికల తర్వాత తెలంగాణ(Telangana)లో కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయకత్వ మార్పిడి(Leadership change) తథ్యమని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ (NVSS Prabhakar)సంచలన వ్యాఖ్యలు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పదవిని కాపాడుకునేందుకు తీవ్ర పాట్లు పడుతున్నారని, అందుకోసమే సోనియా గాంధీకి తనపై నమ్మకం కలిగించుకునేలా ప్రసన్నం చేసుకోవాలని నానా రకాలుగా ప్రయత్నిస్తున్నారని ఎద్దేవాచేశారు. సోనియా దేవత అంటూ.. ఆమె కాళ్లు కడిగి నీళ్లు నెత్తిమీద జల్లుకోవాలంటూ.. రాహులే దేశానికి సర్వస్వమంటూ భజన చేస్తున్నారని చురకలంటించారు. నిత్యం కాంగ్రెస్ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకోవడం, కప్పం కట్టడంపైనే రేవంత్ కాలం గడుపుతున్నారంటూ విమర్శించారు.

రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన తీరుపై ఎన్వీఎస్ఎస్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఒకరోజు గడిస్తే చాలనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నారన్నారు. రేవంత్.. తన పదవిని కాపాడుకోవడానికే ప్రాధాన్యతనిస్తూ పాలనను గాలికొదిలేశారని విమర్శించారు. అలాగే రాష్ట్రంలో ప్రభుత్వం ఎక్కడ తమ భూములను గుంజుకుంటుందోనని, ఇల్లు కూలగొడుతుందేమోననే భయంలో ప్రజలు ఉన్నారని అన్నారు. ఇందిరమ్మ రాజ్యమంటే.. కూలగొట్టడం, కొల్లగొట్టడం.. దోచుకోవడం, దాచుకోవడమేనా? అని ప్రభాకర్ ప్రశ్నించారు. ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు అవకాశాలను మెరుగుపర్చుకోవడం కోసం తెలంగాణను ప్రయోగశాలగా మార్చుకున్నారంటూ ప్రభాకర్ ఆరోపించారు. అసలు తెలంగాణకు రాహుల్ ముఖ్యమంత్రా.. లేక రేవంత్ రెడ్డా? అనే అనుమానం ప్రజల్రలో ఉందని చురకలంటించారు.

Advertisement

Next Story