వైన్స్ కావాలా...నిజాయితీ రాజకీయాలు కావాలా :Teenmar Mallanna

by Sridhar Babu |   ( Updated:2022-12-13 15:12:58.0  )
వైన్స్ కావాలా...నిజాయితీ రాజకీయాలు కావాలా  :Teenmar Mallanna
X

దిశ, లక్ష్మీదేవి పల్లి : కేసీఆర్​ అడుగడుగునా ఏర్పాటు చేసే వైన్స్ కావాలా, నిజాయితీ రాజకీయాలు కావాలా అని తీన్మార్ మల్లన్న ప్రజలను ప్రశ్నించారు. ఆయన పాదయాత్ర మంగళవారం కొత్తగూడెం త్రీ టౌన్ సెంటర్ కు చేరుకుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజలకు జరుగుతున్న అన్యాయాలపై, కేసీఆర్ చేస్తున్న అరాచక పాలనపై మల్లన్న ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజలను తాగుబోతులను చేసి, మద్యం తో వచ్చే ఆదాయంతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడని ఆరోపించారు. కేసీఆర్ ను గద్దె దింపే వరకు తన పోరాటం ఆగదని అన్నారు. ఉదయం లేస్తే తన సొంత పత్రికలో కల్లబొల్లి మాటలతో మాయ రాతలు రాస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడని విమర్శించారు. దళిత బంధు, గిరిజన బంధు, బీసీ బంధు అంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ కాలం వెళ్ళదీస్తున్నాడని, కాళ్లేశ్వరానికి రూ.1.32 లక్షల కోట్లు అప్పుచేసి, లక్ష కోట్లు వెనకేసుకున్నాడని ఆరోపించారు. దాంతో కడుపులో పెరుగుతున్న పిండం పైన కూడా లక్ష పైన అప్పు భారాన్ని మోపాడని విమర్శించారు. ప్రజలను చైతన్యవంతులు చేసే తనపై అనేక కేసులు మోపి, ఎన్నిసార్లు కొందామని చూసినా తాను అమ్ముడుపోలేదని తెలిపారు. ప్రతి దళితుడికి మూడు ఎకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ అంటూ మాయ మాటలు చెప్పి తను, తన కుటుంబం లక్షల కోట్లు వెనకేసుకొని , ఫామ్ హౌస్ లు కట్టుకున్నారని ఆరోపించారు. ధరణి ఒక బూటకమని ఆనాడే విమర్శించానని తెలిపారు. 70 మంది నాయకుల భూ బాగోతం బట్టబయలు చేసిన వ్యక్తి మల్లన్న అన్నారు. దళితుడైన రాజయ్యను మంత్రి పదవి నుండి భర్త రఫ్ చేసి, బిడ్డకు మాత్రం ఎమ్మెల్సీ కట్టబెట్టాడన్నారు. దళితుడికో న్యాయం నీ బిడ్డకు న్యాయమా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రజలు చైతన్యవంతులై వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కు బుద్ధి చెప్పాలని కోరారు. మంచి రాజకీయాలు కావాలంటే తనతో పాటు నడవాలని కోరారు. ఓటు హక్కుతో పాటు నాయకుడిని రీ కాల్ చేసే హక్కు కూడా ఓటర్ కి రావాలని, అప్పుడే పార్టీ మారాలనే ఆలోచన ప్రజా ప్రతినిధికి ఉండదన్నారు. రీ కాల్ చేసే హక్కు కావాలంటే 9036081100 నెంబర్ కు మిస్డ్​కాల్ ఇచ్చి మద్దతు ఇవ్వాలని కోరారు. తనకు మద్దతిస్తే జిల్లాలోని ప్రతి టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ని దావకానగా మారుస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు.

Read more:

రీకాల్​ వ్యవస్థ రావాలి : Teenmar Mallanna

Advertisement

Next Story

Most Viewed