తుపాకులతో వన్యప్రాణుల వేట.. ఆందోళన వ్యక్తం చేస్తున్న సమీప గ్రామాల ప్రజలు

by Shiva |
తుపాకులతో వన్యప్రాణుల వేట.. ఆందోళన వ్యక్తం చేస్తున్న సమీప గ్రామాల ప్రజలు
X

దిశ, ములకలపల్లి: వన్యప్రాణుల వేట యథేచ్ఛగా కొనసాగుతోంది. బయటి ప్రాంతాల నుంచి కొందరు వేటగాళ్లు తుపాకులు వేసుకుని అడవిలో సంచిరిస్తూ.. వన్యప్రాణుల పాలిట యమకింకరులు అవుతున్నారు. చీకటి పడిందంటే చాలు అడవుల్లో తుపాకీ మోతలు సమీప గ్రామాల ప్రజలకు కునుకు లేకుండా చేస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం తాళ్లపాయ గ్రామ సామీపంలోని ఓ జీడితోటలో ఇవాళ తెల్లవారుజామున కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దుప్పిని చంపి అక్కడే దాని మాంసాన్ని పోగులుగా చేసి తీసుకు వెళ్లిన ఆనవాళ్లు స్థానికులకు కనింపిచాయి. అదే ప్రదేశంలో దుప్పి చర్మం ఒలిచి జీడి చెట్టుపై ఆరవేశారు. అయితే, ములకలపల్లి మండలంలో ఎక్కువ గ్రామాలు అడవికి అత్యంత సమీపంలో ఉంటాయి. దీంతో పంటచేలు కూడా అడవులకు సమీపంలో ఉండటంతో వేటగాళ్లు పంట చేలకు వచ్చే వన్య ప్రాణులను చంపేందుకు స్థానికుల సహకారంతో గ్రామాల్లోకి తుపాకులతో వస్తున్నట్లు తెలుస్తోంది.

అంతరిస్తున్న అటవీ ప్రాణులు

మండలంలో రోజురోజుకు వన్య ప్రాణులు కనుమరుగవుతున్నాయి. గతంలో సీతారామ ప్రాజెక్టు కోసం తీసిన కాలువల మూలంగా కొన్ని మూగ జీవాలు ఆ కాలువల్లో చిక్కి చనిపోయాయి. ఇంకా కొన్ని కాలువలు దాటలేక రోడ్లపై తిరుగుతుంటే కుక్కలు వేటాడి చంపిన సందర్భాలు కోకొల్లలు. అదేవిధంగా వన్యప్రాణులకు చంపేందుకు కరెంట్ షాక్, అది గమనించని చాలా మంది అమాయకులు ప్రాణాలను కోల్పోయారు. ఈ క్రమంలో మండలంలో గత కొంతకాలంగా గుర్తు తెలియని వ్యక్తులు సాగిస్తున్న వేటతో అనేక రకాలైన అరుదైన వన్యప్రాణులు వారి చేతిలో వధకు గురికావడం పట్ల సర్వత్ర ఆందోళన వ్యక్తం అవుతోంది.

Advertisement

Next Story

Most Viewed