Teak thieves : గోదావరిలో టేకు దొంగలు..

by Sumithra |
Teak thieves : గోదావరిలో టేకు దొంగలు..
X

దిశ, మణుగూరు : మణుగూరు మండలం రామానుజవరం - కొండాయిగూడెం వద్ద ఉన్న గోదావరిలో అక్రమార్కులు పుష్ప సినిమాను గుర్తు చేస్తున్నారు. వర్షాకాలం ముందు అడవిలో భారీ టేకు మొద్దులను నరికి గోదావరి చుట్టు ప్రక్కల ఇసుకలో పాతి పెట్టారనే ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. వర్షాకాలం మొదలు కాకాగానే అక్రమార్కులు పాతి పెట్టిన టేకు మొద్దులు వరదకు గోదావరిలో కొట్టుకు వస్తున్నాయి. దీంతో అక్రమార్కులు గోదావరిలో పడవల సహాయంతో టేకుమొద్దులను అందుకొని ఒడ్డుకు చేర్చుతున్నారు.

అక్రమార్కులు పడవలు వేసుకొని గోదావరి చుట్టూ తిరుగుతూ కనిపించిన టేకు మొద్దులను అందుకుంటున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వందలకుపైగా టేకు మొద్దులు కొట్టుకురావడం గమనార్హం. అక్రమార్కులు భారీ టేకు మొద్దులను నరికి గోదావరి చుట్టుపక్కల పాతి పెట్టినప్పుడు అటవీశాఖ అధికారులు, సిబ్బంది ఏం చేశారని పలువురు విమర్శలు కురిపిస్తున్నారు. అధికారులు - టేకు దొంగలు చేతులు కలపడంతోనే లక్షల రూపాయల సరుకు దొంగలపాలు అవుతుందనే ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. అధికారులకే తెలిసే టేకు దందా జరుగుతోందని పలువురు వాపోతున్నారు.

పడవల ద్వారా ఒడ్డుకు చేర్చుతున్న రియల్ పుష్ప టీమ్...

అడవి సంపదను కాపాడవలసిన అటవీ అధికారులే అక్రమార్కులతో చేతులు కలుపుతున్నారు. దీంతో అక్రమార్కుల ఆదాయం మూడు పువ్వులు, ఆరు కాయలు అన్న చందంగా సాఫీగా సాగుతోంది. అక్రమార్కులు ప్లాన్ ప్రకారం వర్షాకాలం ముందే కొన్ని వందల టేకు చెట్లను కొంతమంది అధికారుల సహాయంతోనే నరికి గోదావరి ఇసుక రీచ్ లో పాతి పెడుతున్నారు. గోదావరి పెరిగే సమయాన్ని అదను చూసుకొని పడవల సహాయంతో గోదావరిలో కొట్టుకువస్తున్న టేకు మొద్దులను అందినకాడికి అందుకుంటున్నారు.

అందుకున్న టేకు భారీ మొద్దులను గుట్టుచ్చప్పుడు కాకుండా అక్రమార్కులు తమ గృహాలకు తరలిస్తున్నారు. అంత సర్దుమణిగిన తర్వాత గృహ అవసర వస్తువులను తయారుచేసి కొన్ని లక్షల రూపాయలకు అమ్ముతున్నారు. దీంట్లో అటవీ అధికారులు 10 శాతం వాటా ఉందనే ఆరోపణలు కూడా జోరుగా వినిపిస్తున్నాయి. ప్రతి ఏటా గోదావరిలో ఫారెస్ట్ అధికారుల కనుసన్నల్లోనే టేకుదందా జరుగుతుందని చుట్టూ ప్రక్కల అంటున్నారు. ఏది ఏమైనా పుష్ప టీమ్ ను కాపాడేదే కొంతమంది అటవీశాఖ అధికారులేనని విమర్శలు గుప్పుమంటున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి టేకు దొంగలను అడ్డుకుంటారా లేదా అనేది వేచి చూడాల్సిందే.

Advertisement

Next Story

Most Viewed