రీకాల్​ వ్యవస్థ రావాలి : Teenmar Mallanna

by Sridhar Babu |   ( Updated:2022-12-13 15:10:07.0  )
రీకాల్​ వ్యవస్థ రావాలి : Teenmar Mallanna
X

దిశ, టేకులపల్లి : ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు వేసిన ప్రజలకు ఆ ప్రజా ప్రతినిధుల పనితీరు బాగాలేకపోతే వారిని పదవి నుంచి దింపే హక్కు (రికాల్ )రావాలని తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు. తెలంగాణ లోని కోల్డ్​బెల్ట్ ఏరియాలలో నిర్వహిస్తున్న పాద యాత్రలో భాగంగా మండలానికి విచ్చేసిన ఆయన కోయగూడెం ఓసీకి వెళ్తూ విలేకర్ల తో మాట్లాడారు. ఇప్పటి వరకు పార్టీలు వారి స్వప్రయోజనాల కోసం మ్యానిపేస్టో లు రచించాయని అన్నారు. కానీ తాను రాబోయే కాలంలో ఓటు హక్కు వేసిన వాడికి ఆ ప్రజా ప్రతినిధి పనితీరును బట్టి తిరిగి దింపే హక్కు ఉండేలా కృషి చేస్తానన్నారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో ప్రధానంగా 20 శాతం నిధులు విద్య, వైద్యం కోసం కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం 2 శాతం మాత్రమే కేటాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులు చెప్రాసి నుంచి కలెక్టర్ వరకు, సర్పంచ్ నుంచి ముఖ్యమంత్రి వరకు వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపాలని, ప్రభుత్వ వైద్య శాలలో వైద్యం తీసుకోవాలని కోరారు. అప్పుడే అవి మెరుగు పడతాయని అన్నారు. అభివృద్ధి చెందిన దేశాలలో ప్రజా ప్రతినిధుల పని తీరుని కొలమానంగా రీకాల్ చేసే వ్యవస్థ ఉందని, దాన్ని భరతదేశ వ్యాప్తంగా అమలు చేయాలనేదే తమ ప్రధాన ఎజెండా అని పేర్కొన్నారు.

అశోక్ హత్య కేసుని హైదరాబాద్​ కు బదిలీ చేయాలి

ఇటీవల జరిగిన దారావత్ అశోక్ హత్య కేసు దర్యాప్తు హైదరాబాద్ కు బదిలీ చేయాలనీ తీన్మార్ మల్లన్న డిమాండ్ చేశారు. మంగళవారం శాంతినగర్ గ్రామానికి వెళ్లి ఆయన అశోక్ కుటుంబ సభ్యులను కలిసి వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా వారు తమ కుమారుడి హత్య కేసులో అనేక అనుమానాలు ఉన్నాయని తెలిపారు. దీంతో ఆయన వెంటనే తన లీగల్ టీం వారిని సంప్రదించి వారికి తగిన సలహాలు సూచనలు చేశారు. స్థానిక పోలీసులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు. హంతకుడి సోదరి మృతునికి వరుసకు సోదరి అవుతుందని, కానీ వారి ఇరువురికి పోలీస్ విచారణ లో ప్రేమ వ్యవహారం అంటకట్టారని తెలిపారు. దీనికి సంబంధించి హంతకుడి సోదరి పోలీసులను ప్రశ్నించిన ఫోన్ సంభాషణను వినిపించారు. ఎస్పీ దృష్టికి విషయాన్ని తీసుకువెళ్లి కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed