పెద్దోడికి ఒక న్యాయం,పేదోడికి అన్యాయం.. అధికారుల బలంతో అక్రమ నిర్మాణాలు..?

by Javid Pasha |
పెద్దోడికి ఒక న్యాయం,పేదోడికి అన్యాయం.. అధికారుల బలంతో అక్రమ నిర్మాణాలు..?
X

దిశ, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలో రాచరిక పోకడ నడుస్తుంది అనడానికి అనేక ఉదాహరణలు కళ్ళముందు తచ్చాడుతున్నాయి. కొత్తగూడెం నియోజకవర్గంలో ధనం దేవుడైతే, పొలిటికల్ పవర్ రాజరిక పాలనను మరిపిస్తుంది. చట్టాలకు అతీతంగా ఏమి చేయాలన్నా ధనం లేదా పొలిటికల్ పవర్ ఉంటే సరిపోతుంది. చట్టాలు మొత్తం చుట్టాలు అయిపోతాయి. అనడానికి లక్ష్మీదేవి పల్లి మండలంలో కడుతున్న నాలుగు అంతస్తుల భవనం ఉదాహరణగా నిలుస్తుంది.

కొత్తగూడెం నియోజకవర్గ వ్యాప్తంగా నిబంధనలకు నీళ్లు వదులుతూ పంచాయతీ, మున్సిపాలిటీల్లో అనుమతులు అవసరం లేకుండా బహుళ అంతస్థుల నిర్మాణాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. రాజకీయ అండదండలు ఒకవైపు, ధన బలం మరోవైపు ప్రదర్శిస్తూ అధికారుల నోర్లు మోగించడంలో కొత్తగూడెంలోని బడాబాబులు ముందు వరుసలో ఉన్నారు.

అనుమతి లేకున్నా బహుళ అంతస్తుల నిర్మాణం..

గిరిజన చట్ట పరిధిలో ఉన్న ప్రాంతాల్లో కానీ, మున్సిపాలిటీ పరిధిలో గాని బహుళ అంతస్తుల నిర్మాణాలకు అనుమతి తప్పనిసరి కావాల్సి ఉంటుంది. పేద మధ్య తరగతి ప్రజలు తమ స్తోమతకు తగ్గట్టుగా అనుమతుల మీద అవగాహన రాహిత్యంతో చిన్న గూడు కట్టుకుంటే నేలమట్టం చేసే అధికారులు గిరిజన చట్టాలను తుంగలో తొక్కుతూ అనుమతులు లేకుండా బహుళ అంతస్తుల నిర్మాణం కళ్లముందు సాగుతున్నా చూసీచూడనట్లు వ్యవహరించడంపై పట్టణ ప్రజలు అనేక అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు.

లక్ష్మీదేవి పల్లి మండలంలోని మోర్ సూపర్ మార్కెట్‌కు సమీపంలో అనుమతి లేకుండా నాలుగు అంతస్తుల నిర్మాణం చేపట్టారు. నిర్మాణ పనులు కళ్లముందే సాగుతున్నప్పటికీ ఏ ఒక్క అధికారి అటు వైపు చూసిన దాఖలాలు లేవు. పొరపాటున ఎవరైనా అటువైపు అడుగు వేస్తే జిల్లా అధికారి మా దోస్తు.. ఎవరి అనుమతి ఉన్నా లేకున్నా ఆయన ఆశీర్వాదం మాకు ఉంది అంటూ యదేచ్ఛగా బహుళ అంతస్తుల నిర్మాణాన్ని పూర్తి చేస్తున్నారు. అనుమతి లేకుండా బహుళ అంతస్తుల నిర్మాణం చేపడదామనుకునేవారికి రోల్ మోడల్‌గా నిలుస్తున్నారు.

అధికారుల ఆశీర్వాద బలంతోనే బహుళ అంతస్తుల నిర్మాణాల?

గిరిజన చట్టమైనా 1/70 యాక్ట్ అమలులో ఉన్నా గిరిజనేతరులు ఎలాంటి అనుమతులు లేకుండా బహుళ అంతస్థుల నిర్మాణాలు కళ్లముందే చేపడుతున్న ఏ ఒక్క అధికారి అటువైపు చూసిన దాఖలాలు కనబడటం లేదు. పేదవాడు కట్టుకున్న గూటిపై చూపించే ప్రతాపం పెద్దలపై చూపలేక పోవడం హాస్యాస్పదంగా కనిపిస్తుంది.

ఈ అనుమతి లేని అక్రమ కట్టడాల వెనుక స్థానిక ప్రజాప్రతినిధుల హస్తముందని, కట్టడి చేయాల్సిన అధికారులకు సైతం ముడుపులు గట్టిగానే ముట్టినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. భవన నిర్మాణం చేపడుతున్న వ్యక్తి ఏ అధికారి నిర్మాణాన్ని ఆపలేరు అంటూ బహిరంగ సవాల్ విసురుతున్నట్లు తెలుస్తుంది.

అనుమతి ఉందా అని అడిగిన వారికి మీకు చెప్పాల్సిన అవసరం లేదు అంటూ తలతిక్క సమాధానాలు చెబుతున్నారు. ఇవన్నీ గమనిస్తున్న పట్టణవాసులు పంచాయతీ అధికారులకు భారీ మొత్తంలోనే ముట్ట చెప్పారంటూ చెవులు కొరుక్కుంటున్నారు.పేదోడికి ఒక న్యాయం,పెద్దోడికి మరో న్యాయమా అంటూ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడానికి అనేక మంది సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story