సివిల్స్ టాపర్స్ లో ఉమ్మడి ఖమ్మం పిల్లలేరి...

by Disha Web Desk 15 |
సివిల్స్ టాపర్స్ లో ఉమ్మడి ఖమ్మం పిల్లలేరి...
X

దిశ, ఖమ్మం టౌన్ : ఈ వారం వెలువడిన సివిల్ సర్వీసెస్ టాపర్స్ లిస్ట్ లో ఖమ్మం నియోజకవర్గం నుంచి ఒక్కరూ లేకపోవడం తీవ్రంగా బాధించిందని, తనకొక అవకాశం ఇస్తే మెరుగైన విద్య అందించేందుకు, సరైన వైద్య సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానని ఖమ్మం భాజపా ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు అన్నారు. అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం సత్తుపల్లి నియోజకవర్గం వేంసూర్, పెనుబల్లి మండలాల్లో మంగళవారం పర్యటించి రోడ్ షోలలో ప్రసంగించారు. అడుగడుగునా ఆయనకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. దమ్మపేట మండలంలో మందలపల్లి గ్రామం నుండి దమ్మపేట మండల సెంటర్ వరకు బీజేపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన భారీ ర్యాలీలో వినోద్ రావు పాల్గొన్నారు. వీధివీధిన తిరుగుతూ ప్రచారం చేశారు. గత ప్రభుత్వాల ప్రజా ప్రతినిధులు దమ్మపేట మండలాన్ని పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు.

మండలంలోని ప్రభుత్వ హాస్పిటల్ ను పునరుద్ధరించలేదన్నారు. తనని గెలిపిస్తే మండల పరిధిలోని గ్రామాలలో ప్రధానమైన రోడ్ల సమస్యను తొందరగా పరిష్కరిస్తానని, 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుంచుతానని మాటిచ్చారు. అనంతరం దమ్మపేట మండల బీజేపీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. సత్తుపల్లి నియోజకవర్గం వేంసూర్ మండల పరిధిలోని మర్లపాడు గ్రామంలో ఉన్న సాయిబాబా ఆలయ ప్రాంగణంలోని ఆంజనేయ స్వామి విగ్రహానికి పూజలు చేసి ప్రచారం ప్రారంభించారు. ప్రచారానికి భారీగా తరలివచ్చిన వేంసూర్ మండల ప్రజలు కార్యకర్తలు, నాయకులతో కలిసి మండలంలోని ఇంటింటి ప్రచారం చేశారు. అనంతరం వినోద్ రావు మాట్లాడుతూ ఒక్క అవకాశం కల్పిస్తే మన నియోజకవర్గం

అభివృద్ధి చేసే బాధ్యత తనదని అన్నారు. సత్తుపల్లి నియోజకవర్గం ప్రజలు గత, ప్రస్తుత ప్రభుత్వ హామీలు నమ్మి మోసపోయి బాధపడుతున్నారని అన్నారు. గతంలో గెలిచిన నాయకులు మన సత్తుపల్లి నియోజకవర్గ విద్యార్థులకు జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు తీసుకురావడంలో విఫలమయ్యారని అన్నారు. తనకి అవకాశం ఇస్తే నియోజకవర్గంలో ఉన్న ప్రతి సమస్యను తీరుస్తానని చెప్పారు. పెనుబల్లి మండలంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి వచ్చిన వినోద్ రావు కి పెనుబల్లి మండల ప్రజలు , వీఎం బంజర గ్రామ ప్రజలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. పెనుబల్లి మండల యువకులు , మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఉత్సాహంతో వినోద్ రావుతో ప్రచారంలో పాల్గొన్నారు. వినోద్ రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే నిధులను బీఆర్ఎస్,

కాంగ్రెస్ ప్రభుత్వాలు దుర్వినియోగం చేసి మన ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేయలేదన్నారు. జిల్లాలో, సత్తుపల్లి నియోజకవర్గంలో విద్యార్థులకు కావాల్సిన ఉద్యోగ కోచింగ్ సెంటర్స్ లేక మొన్న విడుదలైన సివిల్ సర్వీసెస్ ఫలితాలలో జిల్లా నుండి ఎవరూ ఎంపిక కాలేదన్నారు. మన జిల్లాలో ముఖ్యమైన పామ్ ఆయిల్ రైతులకు బోర్డ్ తేవడంలో విఫలం అయ్యారని అన్నారు. ఈసారి తనకి అవకాశం ఇస్తే జిల్లాకు కావాల్సిన అన్ని వనరులు వచ్చేలా కృషి చేస్తానని అన్నారు. ఆయన వెంట రంగ కిరణ్, నంబూరి రామలింగేశ్వరావు, వీరం రాజు, నాయుడు రాఘవ, నున్న మిశ్ర , పగిడాల మధుసూదన్, రాంబాబు, నర్సింహారావు, జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed