రాష్ట్రం పై అవగాహన లేకుండానే రాహుల్ పర్యటన.. ఎమ్మెల్సీ తాత మధు

by Sumithra |
రాష్ట్రం పై అవగాహన లేకుండానే రాహుల్ పర్యటన.. ఎమ్మెల్సీ తాత మధు
X

దిశ బ్యూరో, ఖమ్మం: ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పై విమర్శలు చేసేందుకే బహిరంగ సభ పెట్టుకున్నారని జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాత మధు ఆరోపించారు. సోమవారం ఖమ్మంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయ పబ్బం గడుపుకునేందుకు ఖమ్మం జిల్లా వేదికగా కాంగ్రెస్ పార్టీ సభలో అబద్ధాలు, అవాస్తవాలు మాట్లాడి తమ పార్టీ పై విమర్శలు చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏమి చేస్తుందో చెప్పకుండా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ముఖ్యమంత్రి కేసీఆర్ పై వ్యక్తిగత విమర్శలు చేయడం సమంజసం కాదన్నారు. రాహుల్ గాంధీ రాష్ట్రం పై అవగాహన లేకుండా పర్యటన చేసేందుకు వచ్చారు అనడానికి వారి వ్యాఖ్యలే నిదర్శనమని వెల్లడించారు.

సభలో రాహుల్ మాట్లాడుతూ మేము అధికారానికి వస్తె పోడు ప్రజలకు హక్కులు ఇస్తా అని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో గిరిజన, ఆదివాసీలకు చెందిన 4 లక్షలమంది ప్రజలకు పోడు పట్టాలు ఇచ్చారు. ఆ మాత్రం కూడా తెలుసుకోకుండా మాట్లాడడం సిగ్గు చేటన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏ పార్టీకీ బీ టీమ్ గా వుండదని, బడుగు బలహీన వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించే ఏ టీమ్ గా ఉంటుందని చెప్పారు. బీ టీమ్ గా వుండేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని, బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా బీజేపీకిబీ టీమ్ గా కాంగ్రెస్సే ఉందని.. గుజరాత్ ఎన్నికల సమయంలో ఈ విషయం స్పష్టమైందన్నారు.

బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను తగ్గిస్తూ ఢిల్లీ ఆర్డినెన్సు విషయంలో కాంగ్రెస్ ఇప్పడి వరకు తమ వైఖరి ప్రకటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ జోడో యాత్ర గుజరాత్ ఎన్నికల సమయంలో గుజరాత్ పోకుండా మధ్యప్రదేశ్ కు వెళ్లారు. అంటే మీరు బీజేపీకి బీ పార్టీ కాదా ? బీజేపీకి సహకరించడం కోసమే వెళ్ళలేదు అని ప్రజలు అనుకున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఈ జిల్లా ప్రజలు అందరూ కేసీఆర్ వైపే వున్నారని అందుకు కాంగ్రెస్ సభకు వచ్చిన జనమే దానికి నిదర్శనమన్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కు స్కాం గ్రేస్ అని పేరు పెట్టారని, తెలంగాణ ప్రజల ప్రాణాలు తీసిన బలి దేవత సోనియా అని కూడా అన్నారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో 82 కోట్ల ప్రాజెక్టులో లక్ష కోట్ల కుంభకోణం అని ఎలా అంటున్నారో అర్థం కావడం లేదన్నారు. కోమటి రెడ్డి వొళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి కేటీఆర్ ని అరే అని సంబోధిస్తావా..? మేము తలచుకుంటే హైదరాబాద్, నల్గొండ , ఖమ్మంలో తిరగలేవనా ఆగ్రహం వ్యక్తంచేశారు.

బీఆర్ఎస్ లోకి వస్తానని బేరసారాలు చేసింది మీరు కాదా, తమ్ముడిని గెలిపించడానికి విదేశాలకు వెళ్లి బీజేపీకి ఓటు వేయమని చెప్పినొడివి నువ్వు కాదా అని ప్రశ్నించారు. కుటుంబ పాలన అంటున్నారు. అర్హత లేకున్నా పార్టీ నడుపుతుంది మీరు కాదా.? నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఆ కుటుంబంలో పుట్టడమే నీ అర్హత. అంతకుమించి రాహుల్ కు ఏ అర్హతలు వున్నాయో చెప్పాలన్నారు. పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కలలు కలలగానే మిగిలిపోతాయి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాధించి డిసెంబర్ లో ఖమ్మంలోనే విజయోత్సవం ఘనంగా జరుపుతామన్నారు. ఈ సమావేశంలో నగర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పగడాల నాగరాజు, సుడా చైర్మెన్ బచ్చు విజయ్ కుమార్, జిల్లా రైతు సమన్వయ అధ్యక్షులు నల్లమల వెంకటేశ్వర్లు, జిల్లా యువజన అధ్యక్షులు చింత నిప్పు కృష్ణ చైతన్య, తెలంగాణ ఉద్యమకారులు ఉప్పల వెంకటరమణ, కార్పొరేటర్ కమర్తపు మురళి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed