- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘సుడా’ మాజీ చైర్మన్‌పై మరో మరక
దిశ బ్యూరో, ఖమ్మం: సుడా మాజీ చైర్మన్‌గా పనిచేసిన బచ్చు విజయ్ కుమార్ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అనేక ఫిర్యాదులు వెల్లువెత్తిన అధికారాన్ని అడ్డుపెట్టుకుని తప్పించుకున్న ఇతను.. ఇప్పుడు అధికారం మారడంతో చేసిన అక్రమాలు మాత్రం అతనికి గుదిబండగా తయారయ్యాయి. తాజాగా వైరా నియోజకవర్గం కొణిజర్ల మండలం అమ్మపాలెం రెవెన్యూ పరిధిలో ఓ వెంచర్ నిర్వాహకుల నుంచి లక్షలాది రూపాయలు తీసుకుని ఇబ్బంది పెట్టిన విషయం వెలుగులోకి వచ్చింది.
ఆరు లక్షలు తీసుకుని ఆర్చ్ కూల్చేశారు..
వైరా నియోజకవర్గ పరిధిలోని కొణిజర్ల మండలం, అమ్మపాలెం రెవెన్యూ పరిధిలో 2021 సంవత్సరంలో కొందరు ఓ వెంచర్ వేశారు. అనుమతుల్లో భాగంగా డీటీసీపీ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఓరల్‌గా పర్మిషన్ తీసుకుని ఆర్చ్ నిర్మాణం చేపట్టారు. అందులో భాగంగా అప్పటి సుడా చైర్మన్ లక్షలాది రూపాయలు తీసుకుని అన్ని అనుమతులు చూసుకుంటామని, పనులు చేసుకోవాల్సిందిగా సూచించాడు. దాంతో నిర్వాహకులు భూమిలోపల ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా.. తాత్కాలికంగా ఓ ఆర్చ్ మాత్రం నిర్మించుకుంటామని అధికారులతో పాటు, సుడా చైర్మన్‌కు తెలియపరిచారు. ఓకే అనడంతో నిర్మాణానికి పూనుకున్నారు.
నిర్మాణం పూర్తయ్యాక కూల్చివేశారు..
అనుమతుల విషయం తాను చూసుకుంటానని చెప్పిన సుడా మాజీ చైర్మన్ అనూహ్యంగా కొంతకాలం తర్వాత మాట మార్చాడు. వెంచర్ పెద్దదని, ముందుగా అనుకున్న మేరకు మనీ మ్యాటర్ మారిందని, ఇంకా పెంచవలసిందిగా డిమాండ్ చేశాడు. దీంతో నిర్వాహకులు సైతం ముందుగా ఒప్పుకున్న ప్రకారం ఆరు లక్షలు చెల్లించామని మళ్లీ అదనంగా చెల్లించాలంటే తమకు ఇబ్బందని చెప్పారు. దీంతో ఆగ్రహించిన బచ్చు విజయ్ కుమార్ అధికారులను ఉసిగొల్పి నిర్మించిన ఆర్చ్ మొత్తాన్ని ధ్వంసాన్ని చేయించాడని నిర్వాహకులు ‘దిశ’ ప్రతినిధికి తెలిపారు. వచ్చిన అధికారులను అడిగితే తమ చేతుల్లో ఏమీ లేదని పై నుంచి ఆర్డర్స్ వచ్చాయని మాత్రమే చెప్పి లక్షలాది రూపాయల వ్యయంతో నిర్మించిన ఆర్చ్‌ను పూర్తిగా ధ్వంసం చేశారని చెప్పారు.
ముందు ఒక మాట.. తర్వాత మరో మాట
సుడా ఏర్పాటయ్యాక వెంచర్ అనుమతుల విషయంలో అప్పటి చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ జోక్యం అధికంగా ఉండేదని నిర్వాహకులు అంటున్నారు. అధికారులు చేయాల్సిన పని అయినప్పటికీ అన్నీ తానై ప్రతి వెంచర్ వివరాలు తెలుసుకుంటూ అడ్డుపుల్లలు పెట్టేవారని, వెంచర్ నిర్వాహకులు తనను కలిసే విధంగా పావులు కదిపేవాడని చెప్పుకుంటున్నారు. వెంచర్‌లో రకరకాల కొర్రీలు పెడుతూ చివరకు తన దారిలోకి తెచ్చుకుని అడిగినంత ఇస్తే అనుమతులు వస్తాయని బెదిరించేవాడని ప్రతీతి. దీంతో నిర్వాహకులు బచ్చు అడిగినంత కాకున్నా ఎంతోకొంతకు ఓకే అని అందజేసేవారని, డబ్బులు ఇచ్చిన తర్వాత కూడా మరింత కావాలని ఇబ్బంది పెట్టేవాడని తెలియవచ్చింది. లేదంటే అధికారులను ఉసిగొలిపి నిర్మాణాలను ధ్వంసం చేయడం.. అనుమతులను పెండింగ్ లో పెట్టడంతో పాటు అనేక ఇబ్బందులకు గురి చేసే వారని తెలిపారు.
మొన్న జరిగింది ఇది..
సుడా చైర్మన్ గా బచ్చు విజయ్ కుమార్ ఉన్నప్పుడు వరంగల్ క్రాస్ రోడ్డులో ఓ వెంచర్ నిర్వాహకులు విజయ్‌ను కలిశారు. లక్షలాది రూపాయలు డిమాండ్ చేయడంతో చేసేదిలేక కొంత మొత్తానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. అందులో కొంత చెల్లించినా.. మిగతాది ఇవ్వలేదన్న నెపంతో వెంచర్‌పైకి అధికారులను ఉసిగొలిపి అనేక ఆటంకాలు క్రియేట్ చేశాడు. ఉన్నతాధికారులను కలిసి నిర్వాహకులు కావాల్సిన అనుమతులు తీసుకున్నారు. కానీ సుడా చైర్మన్ తీసుకున్న డబ్బులు మాత్రం ఏళ్లు గడుస్తున్నా తిరిగి ఇవ్వలేదు. అధికార మార్పిడి జరిగాక తీసుకున్న డబ్బులు ఇవ్వాల్సిందిగా నిర్వాహకులు అడిగినా సరైన సమాధానం రాకపోవడం, ఇంకా దర్పం ప్రదర్శించి ఎదురు తిరగడంతో విషయం తీవ్ర రూపం దాల్చింది. నలుగురైదుగురు కార్పొరేటర్ల సమక్షంతో పంచాయతీ జరగడంతో జనవరి రెండో వారంలో ఇస్తామని ఒప్పుకోవడంతో సమస్య సద్దుమణిగింది.
ముందుకు వస్తున్న బాధితులు..
బచ్చు విజయ్ అక్రమాలపై దిశలో కథనాలు వస్తుండటంతో బాధితులు ఒక్కరొక్కరుగా బయటకు వస్తున్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు జిల్లాకు చెందిన మంత్రులను కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని తెలిపేందుకు సిద్ధమతున్నారు. తమ దగ్గర తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లిస్తే ఓకేనని, లేదంటే త్వరలో అన్ని విషయాలు బహిర్గతం చేస్తామని చెబుతున్నారు. జిల్లాకు చెందిన ఓ ప్రముఖ రియల్టర్ సైతం ఇదే విషయం స్పష్టం చేశాడు. త్వరలో అన్ని విషయాలు మంత్రులకు తెలియపరుస్తామని, తాము పడ్డ ఇబ్బందులు వారికి తెలియజేస్తామన్నాడు.