- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమిత్ షాకు హోంమంత్రిగా అర్హత లేదు
దిశ,ఇల్లెందు : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ను పార్లమెంట్ సాక్షిగా అవమానించేలా మాట్లాడిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ఆ పదవిలో కొనసాగే అర్హత లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. తక్షణమే హోం మంత్రిగా అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కమ్యూనిస్టులు లేకపోతే ఈ దేశానికి భవిష్యత్తు ఉండదన్నారు. మతోన్మాద ఫాసిస్ట్ బీజేపీని తిప్పికొట్టేందుకే కాంగ్రెస్ తో కలిసి ఇండియా కూటమిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇల్లెందు 24 ఏరియా సింగరేణి కమ్యూనిటీ హాల్ లో శుక్ర, శనివారాలు నిర్వహించే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీపీఎం మూడో మహాసభల్లో తమ్మినేని ప్రారంభోపన్యాసం చేశారు. ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసే ఒకే ఎన్నిక విధానాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం రద్దయితే ఈ విధానంలో కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నా అది గత సర్కారు ఎన్ని రోజులు పాలించిందో ఐదేళ్లలో ఆ సమయాన్ని మినహాయించి మిగిలిన కాలానికి మాత్రమే ప్రభుత్వం అధికారంలో ఉంటుందని వివరించారు.
జెమిలి ఎన్నికలు ప్రాంతీయ పార్టీలకు, ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు. బీజేపీ ప్రయోజనాల కోసమే ఒకే ఎన్నిక విధానాన్ని ముందుకు తీసుకొస్తుందని తెలిపారు. అంబేద్కర్ గొప్పతనం ఏంటి అని పదేపదే ఆయన్ని తలుచుకోవడం కంటే దేవున్ని తలచుకుంటే పుణ్యమైనా వస్తుందని అమిత్ షా వ్యాఖ్యలు చేయడం వెనుక కుట్ర కోణం దాగి ఉందన్నారు. దేవుణ్ణి తలుచుకుంటే పుణ్యం వచ్చిందో లేదో కానీ అంబేద్కర్ వల్ల హక్కులు వచ్చాయని స్పష్టం చేశారు. మనుధర్మ శాస్త్రాన్ని రాజ్యాంగంగా పెట్టాలనేదే బీజేపీ ఉద్దేశమని అన్నారు. సమాజాన్ని కులాల వారీగా విభజించాలని మనుధర్మం చెబుతుందని, చతుర్వర్ణ సిద్ధాంతాన్ని అమలు చేస్తుందని చెప్పారు. దళితులకు ఆస్తులు ఉండకూడదని కూడా మనుధర్మం బోధిస్తుందన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం స్థానంలో అటువంటి మనుధర్మాన్ని అమలు చేయాలనే కుట్రతోనే ఆయన నిర్మించిన రాజ్యాంగాన్ని రూపుమాపడం కోసమే అమిత్ షా అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. అమిత్ షా వ్యాఖ్యలను ఖండిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బంద్కు పిలుపునివ్వాలని సూచించారు.
అంబేద్కర్ పై వ్యాఖ్యలు చేసిన అమిత్ షాకు హోం మంత్రిగా కొనసాగే అర్హత లేదని, తక్షణం ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఆల్ పార్టీస్ మీటింగ్ ఏర్పాటు చేసి తెలంగాణ బంద్ కు పిలుపునివ్వాలని విజ్ఞప్తి చేశారు. హిందుత్వ రాజ్యమే బీజేపీ లక్ష్యమని, సెక్యులరిజం, హక్కులను ఇది కాలరాస్తుందని, కార్మిక హక్కులను హరించి వేస్తుందని తెలిపారు. భారత శిక్షాస్మృతిలోనూ సవరణలు చేసి బీజేపీ తన ప్రయోజనాల కోసం రాజ్యాంగ వ్యవస్థలను సైతం నిర్వీర్యం చేస్తోందని సూచించారు. ఆర్థిక రంగంలో అదానీ, అంబానీలకు దోచి పెడుతూ బీజేపీ దేశానికి ద్రోహం తలపెడుతోందని హెచ్చరించారు. అదానీ, అమిత్ షాను సమర్థిస్తూ ప్రధాని మోడీ మాట్లాడటం సరికాదన్నారు. అదానిని అరెస్ట్ చేయాలని ఓవైపు రాహుల్ గాంధీ ఆందోళనలు చేస్తుంటే మరోవైపు అదే పార్టీకి చెందిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ ఆయనతో ఒప్పందాలు చేసుకోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. దావూస్ లో రూ.12,400 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించు కోవాలని కోరారు. అవినీతి అదానీ పెట్టుబడి తెలంగాణకు అవసరం లేదని, వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
జమిలీ చట్టంలో అనేక లొసుగులు ఉన్నాయన్నారు. బీజేపీ ప్రమాదాన్ని నియంత్రించే పార్టీ సీపీఎం మాత్రమేనని పునరుద్ఘాటించారు. సీతారాం ఏచూరి క్రియాశీలకంగా వ్యవహరించి ఏర్పాటు చేసిన ఇండియా కూటమి కారణంగానే గత లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని తిప్పికొట్టామని, సీట్లు గణనీయంగా తగ్గాయని తెలిపారు. గత కేసీఆర్ ప్రభుత్వం కౌలుదారులను గుర్తించలేదని, కుటుంబ పాలన, నియంతృత్వ పోకడ, ఎమ్మెల్యేల కొనుగోళ్ల కారణంగా ప్రజలు ఆ పార్టీని ఓడించి కాంగ్రెస్ కు అధికారం ఇచ్చారని తమ్మినేని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా ఆరు గ్యారంటీలు అమలుకు నోచుకోవడం లేదన్నారు. రుణమాఫీకి రూ. 31 వేల కోట్లు కేటాయించి రూ.21వేల కోట్లు మాత్రమే రైతుల ఖాతాల్లో జమ చేశారని, అర్హత ఉండి మాఫీ కాని రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.
వ్యవసాయ కార్మికులకు రూ.12,000 ఏమయ్యాయని, రూ.4,000 నిరుద్యోగ భృతి ఎటు పోయిందని, ఐదు లక్షల ఎకరాలకు పోడు పట్టాలు ఎప్పుడు ఇస్తారని నిలదీశారు. 15 వేల డబుల్ బెడ్ రూమ్ లు ఇచ్చాకే మూసీ పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లగచర్ల ఫార్మాసిటీ రద్దు ఎర్రజెండా విజయం గా పేర్కొన్నారు. కమ్యూనిస్టులు లేకపోతే ఈ దేశానికి భవిష్యత్తు ఉంటుందా? అని ప్రశ్నించారు. బూర్జువా పార్టీలకు ప్రజాస్వామ్యబద్ధ కమిటీ ఎన్నిక విధానం లేదని తెలిపారు. వచ్చే మూడేళ్లు ప్రజా ఉద్యమాలపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. శ్రామిక వర్గ పోరాటాలకు ఇల్లందు కేంద్రంగా ఉందన్నారు. ఇక్కడ ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర కమ్యూనిస్టులదని చెప్పారు.
బొగ్గుట్టపై అరుణ తోరణం
సిపీఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మూడో మహాసభలను పురస్కరించుకొని ఇల్లందులో ఎర్రజెండాలతో భారీ ప్రదర్శన నిర్వహించారు. స్థానిక పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ సింగరేణి 24 ఏరియా కమ్యూనిటీ హాల్ వరకు సాగింది. అక్కడ ఏర్పాటు చేసిన పార్టీ జెండాను సీనియర్ నాయకులు కాసాని ఐలయ్య ఆవిష్కరించారు. అనంతరం అమరవీరులకు నివాళులర్పించి ప్రతినిధులు, పరిశీలకులు మహాసభలు నిర్వహించే దేవులపల్లి యాకయ్య నగర్, గుగులోత్ ధర్మా, మోరంపూడి పుల్లారావు ప్రాంగణంలోకి ప్రవేశించారు. ఆహ్వాన కమిటీ గౌరవాధ్యక్షులు పి. సోమయ్య మహాసభలకు స్వాగతం పలికారు. పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు.
జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య కార్యదర్శి నివేదికను ప్రతినిధుల ముందు ఉంచారు. ఈ మహాసభలకు పరిశీలకులుగా సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు బి. వెంకట్, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, రాష్ట్ర పరిశీలకులు బండారు రవికుమార్, సీనియర్ నాయకులు మీడియం బాబూరావు, కొండపల్లి పావన్, రాష్ట్ర కమిటీ సభ్యులు మాచర్ల భారతి, యర్రా శ్రీకాంత్, నాయకులు ఆనందాచారి, మూడ్ శోభన్, పార్టీ ఖమ్మం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాదినేని రమేష్, భూక్యా వీరభద్రం, యర్రా శ్రీనివాసరావు, భద్రాద్రి జిల్లా నాయకులు కారం పుల్లయ్య, ఎ. బ్రహ్మచారి, బి. నర్సారెడ్డి, ఎస్.నబీ, ఎం. జ్యోతి, అన్నవరపు సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. అధ్యక్ష వర్గంగా ఏజే రమేశ్, కొక్కెరపాటి పుల్లయ్య, పర్సా చిలకమ్మ, కున్సోత్ ధర్మా వ్యవహరించారు.