గురుకులంలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం కలకలం

by Mahesh |
గురుకులంలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం కలకలం
X

దిశ, వైరా : తనతో పాటు చదువుకుంటున్న విద్యార్ధినుల వేధింపులు తట్టుకోలేక ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన వైరాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో చోటు చేసుకుంది. పదోతరగతి చదువుతున్న కడారి దీప్తి అనే విద్యార్థిని శుక్రవారం రాత్రి తనకు అందుబాటులో ఉన్న 14 రకాల మాత్రలను మోతాదుకు మించి వేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. గత రెండు మూడు నెలలుగా తన తోటి విద్యార్థినులు పలురకాలుగా దీప్తిని వేధిస్తున్నారు. ఈ విషయాన్ని ఓ ఉపాధ్యాయనికి చెప్పినప్పటికీ వేధింపులకు గురిచేస్తున్న విద్యార్థినిలను అదుపు చేయడంలో విఫలమయ్యారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన దీప్తి ఆత్మహత్యాయత్నానికి యత్నించింది. దీప్తిని నిరంతరం వేధిస్తున్న విద్యార్థినిలు శుక్రవారం రాత్రి కూడా ఆమెపై ఓ ఉపాధ్యాయురాలికి తప్పుడు ఫిర్యాదు చేశారు.

దీప్తి నిద్రమాత్రలు వేసుకుందని ఆమె సహచర విద్యార్థినులు ఓ ఉపాధ్యాయురాలికి శుక్రవారం రాత్రి తప్పుడు ఫిర్యాదు చేశారు. తోటి విద్యార్థినిలు చేసిన తప్పుడు ప్రచారంతో మరలా తీవ్ర మనస్థాపానికి గురైన దీప్తి తనకు అందుబాటులో ఉన్న వివిధ జబ్బులకు సంబంధించిన ట్యాబ్లెట్లను ఒకేసారి వేసుకుంది. ఈ విషయాన్ని వైరాలోని బీసీ కాలనీలో ఉన్న దీప్తి తల్లిదండ్రులకు పాఠశాల యాజమాన్యం సమాచారం అందించారు.

వెంటనే తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని తమ కుమార్తెను స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి అక్కడ ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో ఖమ్మం తరలించారు. ఈ సంఘటన గురుకులంలో కలకలం రేకెత్తించింది. వైరా గురుకుల పాఠశాలలో విద్యార్థినిలపై అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయురాళ్ల కనీస పర్యవేక్షణ కొరవడడంతో దీప్తి ఆత్మహత్యాయత్నంకు పాల్పడే వరకు పరిస్థితి వచ్చింది.

Advertisement

Next Story

Most Viewed