కాంగ్రెస్‌లో ఖమ్మం కహానీ.. ఉనికిని చాటుకునేలా రేవంత్ మాస్టర్ స్కెచ్?

by GSrikanth |
కాంగ్రెస్‌లో ఖమ్మం కహానీ.. ఉనికిని చాటుకునేలా రేవంత్ మాస్టర్ స్కెచ్?
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో అప్పుడే పొలిటికల్ హీట్ పెరిగింది. రాబోయే ఎన్నికల్లో సత్తా చాటేందుకు పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. వరుసగా రెండుసార్లు ఎన్నికల్లో దూసుకుపోయిన కారు పార్టీ స్పీడ్‌కు బ్రేకులు వేసేందుకు బీజేపీ, కాంగ్రెస్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో చేరికలపై దృష్టి సారించాయి. వీలైనంత ఎక్కువ మంది పలుకుపడి కలిగిన నాయకులను తమ వైపు తిప్పుకోవడం ద్వారా ప్రజాక్షేత్రంలో గేమ్ చేంజర్‌గా మారేందుకు పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత పాలిటిక్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బడా నేతగా పేరున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి బీఆర్ఎస్‌తో తెగదెంపులు కావడంతో ఆయన్ను పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ గాలం వేస్తున్నాయి. ఈ క్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరితో భేటీ కావడం హస్తం పార్టీలో అలజడి రేపుతోంది. రేణుక, రేవంత్ సమావేశం వెనుక ఆంతర్యం ఏంటి అనే ప్రశ్నలు సొంతపార్టీలో గుప్పుమంటున్నాయి.

ఈనెల 24న ఖమ్మంలో నిర్వహించబోయే నిరుద్యోగ నిరసన దీక్ష ఏర్పాట్లు, పొంగులేటిని పార్టీలో చేర్చుకునే అంశంపై రేణుకా చౌదరితో రేవంత్ రెడ్డి ఈ భేటీలో చర్చించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ భేటీలో ఈ అంశాలే ప్రస్తావనకు వచ్చాయా లేక మీటింగ్ వెనుక అసలు వ్యూహం మరొకటి ఉందా అనేది హాట్ టాపిక్ అవుతోంది. నిజానికి రేవంత్ రెడ్డిపై ఇటీవల సీనియర్ల అసమ్మతి మరోసారి పెరిగింది. కోమటిరెడ్డి, ఉత్తమ్ రెడ్డిలు రేవంత్ రెడ్డి ఏకపక్ష పోకడలపై అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే ఇటీవల సీఎం రేస్ లో భట్టి పేరు తెరపైకి వస్తోంది. ఈ పరిణామాలు పార్టీలో రేవంత్ రెడ్డి ఇమేజ్‌ను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయనే చర్చ మొదలైంది. మరో వైపు ఉమ్మడి ఖమ్మంలో పొంగులేటి చేరిక అదే జిల్లాకు చెందిన భట్టి, రేణుకలు ఏ మేరకు స్వాగతిస్తారనేది అనుమానంగా మారింది. ఈ చర్చ జరుగుతున్న క్రమంలో అనూహ్యంగా రేవంత్ రెడ్డి రేణుకా చౌదరితో సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది.

పార్టీలో పొంగులేటి వంటి వారిని ఆహ్వానించడం ద్వారా పార్టీలో తన ఉనికిని మరోసారి చాటుకునే అవకాశం రేవంత్‌కు లభిస్తుంది. అందువల్లే పొంగులేటి చేరికను రేవంత్ సీరియస్ గా తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పొంగులేటి పార్టీలో చేరడం ద్వారా తనకు మద్దతు పెరిగే అవకాశాలు లేకపోలేదనేది రేవంత్ భావన అయి ఉండవచ్చు. పొంగులేటి గనుక కాంగ్రెస్ లో చేరితే ఉమ్మడి ఖమ్మంలో భట్టికి చెక్ పెట్టే పెట్టినట్లు అవుతుందనే వ్యూహం కూడా ఉండి ఉండవచ్చనే చర్చ తెరపైకి వస్తోంది. అందువల్ల తాజా భేటీ వెనుక భట్టికి చెక్ పెట్టే వ్యూహమా? లేక ఉనికి చాటే ప్రయత్నామా అనే సందేహాలు పొలిటికల్ సర్కిల్స్‌లో వ్యక్తం అవుతున్నాయి. అసలే రేవంత్ రెడ్డి చేపట్టిన ఏ కార్యక్రమానికైనా సీనియర్ల నుంచి ఏదో రకంగా అసంతృప్తి వ్యక్తం అవుతున్న తరుణంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ రాజకీయాలు గాంధీ భవన్ లో హీట్ పెంచుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed