కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లు ఎక్కడ.. ఒంటరి అవుతోన్న టీపీసీసీ చీఫ్..?

by Satheesh |   ( Updated:2023-11-10 17:27:58.0  )
కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లు ఎక్కడ.. ఒంటరి అవుతోన్న టీపీసీసీ చీఫ్..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఈ సార్వత్రిక ఎన్నికలకు మరో 19 రోజులు సమయం మాత్రమే ఉన్నది. కానీ ఇప్పటికే రంగంలోకి దిగాల్సిన స్టార్ క్యాంపెయినర్లు పార్టీ సభలు, ప్రచారాల్లో కానరావడం లేదు. ఈ ఎన్నికల్లో ప్రచారానికి నూతన క్యాపెంయినర్ల లిస్టును కూడా ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు. గతంలో స్టార్ క్యాంపెయినర్‌గా పనిచేసిన కోమటిరెడ్డి కూడా ఎన్నికల ప్రచారంలో తిరగడం లేదు. ఆయనతో పాటు రాష్ట్రంలోని కొందరు కీలక నేతలంతా నియోజకవర్గాలకే పరిమితం అవుతున్నారు. పైగా సీఎం సీటు కోసం చాలా మంది సీనియర్లు పోటీ పడుతున్నారే తప్పా.. పవర్ కోసం కృషి చేయడం లేదనేది కాంగ్రెస్ సెకండ్ కేడర్ విమర్శలు కురిపిస్తున్నది.

తాము సీఎం సీటుకు అర్హతను కలిగి ఉన్నామని, నియోజకవర్గంలో గెలిపిస్తే రాష్ట్రానికి సారధిలుగా మారుతామని ఇప్పటికే సీఎల్పీ భట్టి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జగ్గారెడ్డి బహిరంగంగా చెప్పగా..తామేమీ తక్కువ కాదనేది ఎంపీ ఉత్తమ్, మాజీ మంత్రి జానారెడ్డి తదితరులు అనుచరుల వద్ద ప్రస్తావిస్తున్నారు. పార్టీని పవర్ లోకి తీసుకురావాలని క్షేత్రస్థాయి కేడర్ కృషి చేస్తుంటే...అగ్ర నేతలంతా స్వప్రయోజనాల కోసమే ప్రయత్నించడం విచిత్రంగా ఉన్నదని గ్రౌండ్ కేడర్ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగే ప్రమాదం ఉన్నదని కేడర్ ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం.

పీసీసీ ఏక్ నిరంజన్..?

బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. తామేమీ తక్కువ కాదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా ప్రచారాన్ని వేగవంతం చేశారు. ఆయన పోటీ చేస్తున్న రెండు సెగ్మెంట్‌లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కీలక నియోజకవర్గాలన్నింటిలోనూ ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్ధులను గెలిపించాల్సిందిగా ప్రజలను అభ్యర్థిస్తున్నారు. గత కొన్ని రోజులుగా పీసీసీ ఒక్కరే రాష్ట్రమంతటా తిరుగుతున్నా.. సీఎం సీటు కోసం ప్రయత్నిస్తున్న నేతలెవ్వరూ సొంత నియోజకవర్గాలు వదిలి బయటకు రావడం లేదు.

పార్టీ గెలుపు కోసం ఇప్పుడు పాటు పడకుండా.. సీఎం కూర్చీపైనే అగ్రనేతలు ఆశలు పెంచుకోవడం ఎంత వరకు కరెక్ట్..? అని పార్టీలోనే నేతలే ప్రశ్నిస్తున్నారు. ఒక వైపు బీఆర్ఎస్ పార్టీ రెండు, మూడు విడతల్లో తన ప్రచారాలను పూర్తి చేస్తుండగా.. కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని రేవంత్ ఒక్కడే రాష్ట్రమంతటా చేయడం సవాల్‌గా మారిందని పార్టీ నేతలు వెల్లడిస్తున్నారు. అగ్రనేతలంతా రాష్ట్ర విజయానికి కృషి చేసేందుకు చొరవ చూపాలని పలువురు నేతలు కోరుతున్నారు.

Advertisement

Next Story