రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

by Sathputhe Rajesh |
రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. టీఎస్ పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ అంశంలో బీజేపీ, కాంగ్రెస్ నేతలను ఎందుకు విచారించారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. టీఎస్‌పీఎస్సీ పరీక్షలు రద్దు, వాయిదా సబబేనని అభిప్రాయపడింది. ఎన్ఎస్‌యూఐ ప్రెసిడెంట్ బల్మూర్ వెంకట్ వేసిన పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా పిటిషనర్ తరపు వివేక్ థన్కా వాదనలు వినిపిస్తూ సిట్ దర్యాప్తు సరిగా జరగడం లేదని, సిట్‌పై రాజకీయ ఒత్తిడి, మంత్రి జోక్యం ఉందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. మంత్రి కేటీఆర్ చెప్పినట్లుగా సిట్ దర్యాప్తు కొనసాగుతుందని, లీకేజ్‌లో ఇద్దరికే ప్రమేయం ఉందని కేటీఆర్ ముందే చెప్పారన్నారు.

అందువల్ల కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరారు. ఐటీ అంశాలపై దర్యాప్తు చేసేందుకు సిట్‌లో సాంకేతిక నిపుణులు లేరని వాదించారు. దీంతో జోక్యం చేసుకున్న కోర్టు సిట్‌లో ఐటీ నిపుణులు ఉన్నారా? ఐటీ అంశాల దర్యాప్తు కోసం మళ్లీ ఔట్ సోర్సింగ్‌కు వెళ్తారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన ఏజీ.. ఈ కేసులో సిట్ విచారణ కొనసాగుతున్నదని ఇప్పటికే సిట్ నివేదికను సమర్పించామని, అడిషనల్ నివేదిక సబ్మిట్ చేస్తామన్నారు. సిట్ 40 మంది సాక్షులను విచారించిందని, లీకేజ్ కేసులో సిట్ 12 కంప్యూటర్లను సీజ్ చేసిందని కోర్టుకు తెలిపారు. ఇప్పపటికిప్పుడు విచారణ అవసరం లేదని కోర్టుకు తెలియజేశారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. అదే రోజు తీర్పు వెల్లడిస్తామని స్పష్టం చేసింది.

Advertisement

Next Story